ఖమ్మం జిల్లా మధిరలో రైలు దిగి పట్టాలు దాటుతున్న క్రమంలో వేగంగా వచ్చిన నవజీవన్ ఎక్స్ ప్రెస్ ఢీకొట్టడంతో తండ్రి కూతురు సంఘటనా స్థలంలోనే మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. మధిర మండలం మల్లారం గ్రామానికి చెందిన కొంగర కేశవరావు (52) తన కూతురు ఇదే మండలం, ఖమ్మంపాడు గ్రామానికి చెందిన నూకారపు సరిత (28) తో కలిసి విజయవాడలో ఆసుపత్రికి వెళ్లి ఆరోగ్య పరీక్షలు చేయించుకొని తిరిగి మధిరకు చేరుకున్నారు. విజయవాడ నుండి ఇంటర్ సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్‌లో మధిరకు వచ్చినట్లు తెలిసింది. వీరు ట్రైన్ దిగి మల్లారం వెళ్లేందుకుగాను రైల్వే ట్రాక్‌ను దాటి వెళుతున్న క్రమంలో విజయవాడ నుండి అహ్మదాబాద్ వెళ్తున్న నవజీవన్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో తండ్రీ కూతురు ఇరువురు అక్కడికక్కడే మృతి చెందగా, మృతురాలు సరిత కుమారుడిగా ఉన్న పదేళ్ల బాబు పట్టాలు దాటి ప్రాణాలు దక్కించుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయాన్ని గుర్తించి తక్షణమే ప్రమాద సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలకు పంచనామ నిర్వహించి మధిర ప్రభుత్వ ఆసుపత్రికి శవ పంచనామ నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పీ భాస్కరరావు తెలిపారు. మృతులు స్థానికులుగా గుర్తించడంతో వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లు ఎస్సై తెలిపారు. ఇది ఇలా ఉండగా దెందుకూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో బాజా సాయి అనే యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు, మరో నలుగురికి తీవ్ర గాయాలు కాగా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.