ప్రేమకు ఎల్లలు లేవంటారు.. ప్రస్తుతం ప్రేమ కుల, మతాలకు అతీతకంగా ఖండాలు దాటుతోంది. తాము పనిచేసే చోట లేదా.. చదువుకుంటున్న సమయంతో ఏర్పడిన పరిచయాలు ప్రేమగా మారుతున్నాయి. జాతి, మతం, కులం వంటి బేధాలను పక్కకు పెట్టి ప్రేమని పండించుకోవాలని.. పెళ్లి చూసుకోవాలని భావిస్తున్నారు నేటి యువతీ యువకులు. తెలుగు రాష్ట్రాల నుంచి విదేశాల్లో ఉద్యోగాలు, ఉన్నత చదువుల కోసం వెళుతున్న యువత, పెద్దలను ఒప్పించి ప్రేమ పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. అలాగే మరో తెలుగు యువకుడి ప్రేమ కథ ఖండాంతరాలను దాటింది.
నల్లగొండ జిల్లా చండూరుకు చెందిన పాంపాటి భాస్కర్, శోభ దంపతుల మొదటి కుమారుడు సందీప్ ఉన్నత విద్య కోసం 2017 సంవత్సరంలో వియత్నాం దేశానికి వెళ్లాడు. ఉన్నత విద్య పూర్తయిన తర్వాత సందీప్ అక్కడే ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ రంగంలో పనిచేశారు. మరోవైపు 2019లో వియత్నాంలో హోటల్ వ్యాపారాన్ని ప్రారంభించాడు. అదే సమయంలో వియత్నాం యూత్ మినిస్ట్రీ సెక్రటరీగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న అమ్మాయి నీనా పరిచయమైంది.
ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆ తర్వాత వారిద్దరూ మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. తమ ప్రేమ విషయాన్ని సందీప్.. తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పచ్చ జెండా ఊపారు. దీంతో ఇద్దరు ఇటీవల చండూరుకు వచ్చారు. దీంతో చండూరు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో వీరిద్దరూ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. మొత్తానికి చండూరు అబ్బాయి.. వియత్నాం అల్లుడు అయ్యారంటూ స్థానికులు ఆశీర్వదిస్తున్నారు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..