కొత్తగా నాలుగు సంక్షేమపథకాలకు జనవరి 26న ముహూర్తంగా పెట్టుకుంది రేవంత్ ప్రభుత్వం. లబ్దిదారుల ఎంపికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని.. అధికారుల్ని ఉరుకులు పెట్టిస్తోంది. క్షేత్రస్థాయి సర్వే తర్వాత ఈనెల 21 నుంచి గ్రామసభలు నిర్వహిస్తోంది. కానీ.. సర్కార్ తలపెట్టిన గ్రామసభలు కాస్తా సంగ్రామ సభలుగా మారుతున్నాయి. లబ్దిదారుల జాబితాలన్నీ తప్పుల తడకలేనంటూ అనేక చోట్ల జనం నుంచి ఆగ్రహం వ్యక్తమౌతోంది. ఎక్కడికక్కడ జనం నిలదీస్తుంటే అధికారులకు సినిమా కనిపిస్తోంది. గ్రామసభలైతే జరుగుతున్నాయ్ గాని.. ఎమ్మెల్యేలు, మంత్రులు సైతం జనం ముందుకు ధైర్యంగా వెళ్లలేకపోతున్నారని, ఇచ్చిన హామీల గురించి ప్రజలే నిలదీస్తున్నారని విపక్షం కోరస్ ఇస్తోంది. ఇదే అదనుగా.. రైతు ఆత్మహత్యలపై ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ అధ్యయన కమిటీ యాక్షన్లోకి దిగింది. కమిటీ చైర్మన్ నిరంజన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు.రైతు ఆత్మహత్యలు, అర్హులైన రైతులందరికీ రైతు భరోసా అమలు, సంపూర్ణ రైతు రుణమాఫీ, యాసంగి పంటకు సాగునీరు, రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న మిగతా అంశాలపై పరిశీలన జరపడం కమిటీ లక్ష్యం. 24 నుంచి నెలరోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలన్నది కమిటీ టార్గెట్.
రాహుల్ గాంధీ ఇచ్చి వెళ్లిన రైతు డిక్లరేషన్ ఏమైంది.. ఇందిరమ్మ ఇళ్ల కోసం తీసుకున్న కోటీఆరు లక్షల దరఖాస్తులు ఏమైనయ్.. రైతులకు ఇస్తామన్న బోనస్ ఎక్కడికి పోయింది.. ఇలా సమస్యల చిట్టాతో ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేయబోతోంది పింక్ బెటాలియన్. ఏడాది తిరక్కుండానే ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని నమ్ముతున్న బీఆర్ఎస్.. ఈ సందర్భాన్ని ఇలా సద్వినియోగం చేసుకుంటోంది. బీఆర్‌ఎస్ అంటే భారత రాష్ట్రసమితే కాదు.. భారత రైతు సమితి కూడా అని పదేపదే చెబుతూ రైతన్నను ప్రసన్నం చేసుకుంటోంది గులాబీదండు. అబ్‌కీ బార్ కిసాన్ సర్కార్ అనే కేసీఆర్ స్లోగన్‌ని కూడా గుర్తు చేస్తోంది. మాదీ రైతు రాజ్యమే.. రైతే మా రాజు అంటూ కాంగ్రెస్ పార్టీ కూడా రైతు భరోసా పథకం అమలుపై అన్నదాతల్లో నమ్మకాన్ని పెంచే ప్రయత్నం చేస్తోంది. గ్రామసభల్లో గొడవలన్నీ పనిగట్టుకుని సృష్టించేవేనంటోంది కాంగ్రెస్ పార్టీ. గతంలో ఇచ్చిన అప్లికేషన్‌లో పేరు రాలేదని అభద్రతకు గురి కావద్దు.. గ్రామసభలో మళ్లీ అప్లై చేసుకోవచ్చు.. ప్రతిపక్షాల రెచ్చగొట్టే మాటల్ని నమ్మవద్దు.. అని దువ్వుతూనే ఉంది అధికారపక్షం.
ఈ నెల 24 శుక్రవారం వరకూ గ్రామసభలు జరుగుతాయి. రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ఎక్కువగా గందరగోళం నెలకొంది. కానీ.. రాష్ట్రవ్యాప్తంగా మొదటిరోజు 3400 గ్రామ సభలు జరిగితే 144 చోట్ల మాత్రమే గొడవ జరిగింది.. అంటే 96 శాతం గ్రామ సభలు సక్సెస్ ఐనట్టే అని లెక్కలు చూపుతోంది అధికారపార్టీ. ఆరునూరైనా 24 తర్వాత లబ్దిదారుల ఎంపికను సిద్ధం చేసి 26 నుంచి కొత్త పథకాలు అమలు చేయాలని భావిస్తోంది ప్రభుత్వం. కానీ.. మూడురోజులుగా ప్రజల నుంచి ఎదురయ్యే ఆగ్రహాన్ని చూసి.. విపక్షం కూడా అప్రమత్తమైంది. దరఖాస్తుల దందా నడవదు..ఈ ఆగ్రహజ్వాల ఆగదు.. పోలీసు పహారాలో గ్రామాలను నింపేసి గ్రామసభలా.. అంటూ నిగ్గదీసి అడుగుతోంది బీఆర్ఎస్. పథకాల అమలు మొదలైన తర్వాత కూడా పోరాట బాట కంటిన్యూ చేస్తోంది బీఅర్‌ఎస్. రైతు భరోసా మొత్తాన్ని తగ్గించడాన్ని ప్రశ్నిస్తూ ఈ నెల 28న నల్గొండ క్లాక్‌టవర్ దగ్గర భారీ ధర్నాకు నడుంకట్టింది. కోర్డుకెళ్లి మరీ పర్మిషన్ తెచ్చుకుని నల్గొండ దీక్షకు సమాయత్తమౌతోంది. సో.. ఈనెల 24, 26, 28 తేదీల్లో సవాళ్లు- ప్రతిసవాళ్లు.. పోటాపోటీ సమరభేరీలతో మారుమోగబోతోంది తెలంగాణ గడ్డ.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి