హైదరాబాద్, నవంబర్ 22: తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టీజీ టెట్ 2024) దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 20 అర్ధరాత్రితో ముగిసింది. టెట్‌కు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,75,773 దరఖాస్తులు వచ్చినట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. వీటిల్లో పేపర్ 1 పరీక్షకు 94,335 దరఖాస్తులు, పేపర్ 2 పరీక్షకు 1,81,438 దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొంది. ఇక దరఖాస్తు వివరాల్లో పొరపాట్లు సవరించుకునేందుకు కూడా విద్యాశాఖ అనుమతి ఇచ్చింది. నవంబరు 22తో ఈ గడువు ముగియనుంది. ఈ మేరకు గడువు సమయంలోగా వివరాలు సవరించుకోవాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నర్సింహారెడ్డి తెలిపారు. ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ దరఖాస్తుల్లో సవరణలు చేసుకోవడానికి అవకాశం ఇవ్వబోమని స్పష్టం చేశారు. ఇక తెలంగాణ టెట్ హాల్ టికెట్లు డిసెంబర్ 26న విడుదలవుతాయి. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి జనవరి 20వ తేదీ వరకు టెట్ పరీక్షలు ఆన్‌లైన్ విధానంలో జరుగుతాయి.
ప్రతి రోజు రెండు సెషన్లలో ఈ పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేయనున్నారు. ఉదయం సెషన్ 9 నుంచి 11.30 గంటల వరకు, మధ్యాహ్నాం సెషన్ 2 గంటల నుంచి 4.30 గంటల వరకు నిర్వహించనున్నారు. ఇక టెట్ ఫలితాలు ఫిబ్రవరి 5వ తేదీన వెల్లడించనున్నారు. ఫిబ్రవరి 5వ తేదీన ఫలితాలను ప్రకటిస్తారు. టెట్ పరీక్షలో మొత్తం రెండు పేపర్లకు పరీక్ష ఉంటుంది. ఒక్కో పేపర్ 150 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఓసీ అభ్యర్థులకు 90 మార్కులు, బీసీలకు 75, మిగిలిన వారికి 60 మార్కులు సాధిస్తే టెట్‌లో ఉత్తీర్ణులుగా పరిగణిస్తారు. టెట్‌లో అర్హత సాధించిన వారికి మాత్రమే డీఎస్సీ రాసేందుకు అవకాశం లభిస్తుంది. టెట్ పరీక్షల్లో వచ్చిన మార్కులకు డీఎస్సీ నియామకాల్లో 20 శాతం వెయిటేజ్ ఉంటుందనే సంగతి అందరికీ తెలిసిందే. త్వరలోనే కొత్త డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. అయితే పోస్టులు 5వేలు లేదా 6 వేలు మాత్రమే ఉండే అవకాశం ఉంది.
ఐబీపీఎస్ పీవో ప్రిలిమ్స్ ర్యాంకు కార్డులు విడుదల.. డిసెంబర్‌లో మెయిన్స్
దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వ బ్యాంకుల్లో 4450 ప్రొబేషనరీ ఆఫీసర్, మేనేజ్‌మెంట్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన ప్రాథమిక పరీక్ష ఫలితాలు ఐబీపీఎస్ విడుదల చేసింది. ఈ పరీక్షలు అక్టోబర్ 19, 20 తేదీల్లో నిర్వహించిన సంగతి తెలిసిందే. పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఐబీపీఎస్ అధికారిక వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్‌వర్డ్ నమోదు చేసి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ఫలితాల లింక్ నవంబరు 28 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. డిసెంబర్‌లో మెయిన్స్ పరీక్ష జరగనుంది.
ఇవి కూడా చదవండి
ఐబీపీఎస్ పీవో ప్రిలిమ్స్ ర్యాంకు కార్డు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.