Tirumala Brahmotsavam : బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవం..వాహన సేవలు, విశిష్టతలు..అన్నీ ప్రత్యేకతలే..!

1 hour ago 1

తిరుమల శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల‌కు విస్తృత ఏర్పాట్లు చేసింది టిటిడి. వాహన సేవలు అందుకునే మలయప్పస్వామి భక్తకోటి ని కటాక్షించనున్నారు. తిరుమలేశుని బ్రహ్మోత్సవాలలో వాహ‌న‌సేవ‌ల వైశిష్ట్యం ఎంతో గొప్పది. పురాణాల ప్రకారం శ్రీనివాసుడు వేంకటాద్రిపై వెలసిన తొలినాళ్లలోనే బ్రహ్మదేవుడిని పిలిచి లోకకల్యాణం కోసం తనకు ఉత్సవాలు నిర్వహించాలని ఆజ్ఞాపించారట. ఈ మేరకు ఆనందనిలయం మధ్యలో ఆవిర్భవించిన శ్రీవేంకటేశ్వరుడికి కన్యామాసం (ఆశ్వయుజం) లోని శ్రవణా నక్షత్రం నాటికి పూర్తయ్యేలా బ్రహ్మదేవుడు తొమ్మిదిరోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించార‌ట‌. అందువల్లే ఇవి బ్రహ్మోత్సవాలుగా అప్పటినుండి నిరాటంకంగా కొనసాగుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే నేటి(అక్టోబర్‌4) నుంచి అక్టోబర్‌ 12 వ‌ర‌కు 9 రోజుల పాటు జ‌రుగ‌నున్న ఈ ఉత్స‌వాల్లో శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామి వారి ఉత్స‌వ‌మూర్తి అయిన శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారు వివిధ వాహ‌నాల‌పై ఆల‌య నాలుగు మాడ వీధుల్లో భ‌క్తుల‌కు దివ్య‌ద‌ర్శ‌నం క‌ల్పిస్తారు.

బ్ర‌హ్మోత్స‌వ వాహ‌న‌సేవ‌ల్లో పాల్గొనే భ‌క్తులకు మెరుగైన సౌక‌ర్యాలు క‌ల్పించేందుకు టిటిడి ఏర్పాట్లు పూర్తి చేసింది. భ‌క్తులంద‌రికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా శ్రీ‌వారి వాహ‌న సేవ‌ల‌తో పాటు మూల‌విరాట్ ద‌ర్శ‌నం క‌ల్పించేందుకు టిటిడి లోని అన్ని విభాగాల స‌మ‌న్వ‌యంతో బ్ర‌హ్మోత్స‌వాల ఏర్పాట్లు పూర్తి చేసింది టిటిడి. ఉదయం వాహనసేవ 8 నుండి 10 గంటల వరకు, రాత్రి వాహనసేవ 7 నుండి 9 గంటల వరకు నిర్వహించనుంది. బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టంగా గరుడ వాహనసేవను మాత్రం సాయంత్రం 6.30 నుండి ప్రారంభం కానుంది. రాత్రి 11 గంటల‌ వరకు జరుగుతుంది.

ఆల‌య నాలుగు మాడ వీధుల‌లో భ‌క్తుల‌ను ఆక‌ట్టుకునేలా రంగ‌వ‌ల్లులు తీర్చిదిద్దిన టిటిడి గ్యాల‌రీల‌లో వేచివుండే భ‌క్తులకు అన్ని సౌకర్యాలను కల్పించింది. ఈ రోజు సాయంత్రం 5.45 నుండి 6 గంటల మధ్య మీన లగ్నంలో శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహించనుంది. బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభం కానుండగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి వారి సమక్షంలో వేదగానాల మంగళ వాయిద్యాల మధ్య అర్చకస్వాములు బంగారు ధ్వజస్తంభం పై గరుడ ధ్వజాన్ని ఎగురవేస్తారు. సకల దేవతలను, అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తారు. ఆ తరువాత రాత్రి 9గంటల నుండి 11 గంటల వ‌ర‌కు పెద్ద శేషవాహనం పై మలయప్ప స్వామి దర్శనం ఇస్తారు. బ్రహ్మాండనాయకుడి బ్రహ్మోత్సవాల్లో ప్రతి అడుగూ ప్రత్యేకమే. ప్రతిసేవా వైభవోపేతమే.

ఇవి కూడా చదవండి

తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో వాహ‌న సేవ‌ల వైశిష్ట్యం ఇది….

అక్టోబర్‌ 4 తొలి రోజు రాత్రి 9 గంటలకు పెద్దశేషవాహనంపై…

బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజు రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు ఏడుతలల స్వర్ణ శేషవాహనంపై పెద్ద శేషవాహన సేవ అందుకుంటారు. తిరుమాడ వీధులలో భక్తులను అనుగ్రహిస్తారు. ఆదిశేషుడు శ్రీహరికి మిక్కిలి సన్నిహితుడని భక్తుల నమ్మకం. రామావతారంలో లక్ష్మణుడు గా, ద్వాపరయుగంలో బలరాముడుగా శ్రీమన్నారాయణుడికి మిక్కిలి సన్నిహితంగా ఉన్నవాడు శేషుడు అని భావిస్తారు. శ్రీవైకుంఠంలోని నిత్యసూరులలో ఇతడు ఆద్యుడు, భూభారాన్ని వహించేది శేషుడే. అందుకే శేషవాహనం ముఖ్యంగా దాస్యభక్తికి నిదర్శనం. ఆ భక్తితో పశుత్వం తొలగి మానవత్వం, దాని నుండి దైవత్వం, ఆపై పరమపదం సిద్ధిస్తాయనీ భక్తుల విశ్వాసం.

అక్టోబర్‌ 5 న ఉదయం 8 గంటలకు చిన్నశేషవాహన సేవ.

ఇక శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు ఉదయం శ్రీ మలయప్పస్వామి 5 తలల చిన్నశేష వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. పురాణ ప్రాశస్త్యం ప్రకారం చిన్నశేషుడిని వాసుకిగా భావిస్తారు. శ్రీవైష్ణవ సంప్రదాయానుసారం భగవంతుడు శేషి, ప్రపంచం శేషభూతం. శేషవాహనం ఈ శేషిభావాన్ని సూచిస్తుంది. చిన్నశేష వాహనాన్ని దర్శిస్తే భక్తులకు కుండలినీయోగ సిద్ధిఫలం లభిస్తుందని ప్రశస్తి.

5న రాత్రి 7 గంటలకు హంసవాహనంపై దర్శనం…

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు రాత్రి మలయప్పస్వామి వీణాపాణియై హంసవాహనం పై సరస్వతీమూర్తి అవతారంలో దర్శనమిస్తారు. బ్రహ్మ వాహనమైన హంస పరమహంసకు ప్రతీక. హంసకు ఒక ప్రత్యేకత ఉంది. అది పాలను, నీళ్లను వేరుచేయగలదు. అంటే మంచిని, చెడును గ్రహించగలిగిన అపురూపమైన శక్తిగలదని అర్థం. అందుకే ఉపనిషత్తులు హంసను పరమేశ్వరునిగా అభివర్ణిస్తున్నాయి. శ్రీవారు హంస వాహనాన్ని అధిరోహించి దర్శనమివ్వడం ద్వారా భక్తులలో అహంభావాన్ని తొలగించి శరణాగతి కలిగిస్తాడని భక్తుల నమ్మకం.

అక్టోబర్‌ 6 న ఉదయం 8 గంటలకు సింహ వాహనంపై దర్శనం..

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు ఉదయం శ్రీ మలయప్ప స్వామి సింహవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. శ్రీవారి దశావతారాల్లో నాలుగవది నరసింహ అవతారం కావడం, సింహం గొప్పదనాన్ని తెలియ జేస్తోంది. యోగశాస్త్రంలో సింహం బలానికి వేగానికి ఆదర్శంగా భక్తులు భావిస్తారు. భక్తుడు సింహబలం అంతటి భక్తిబలం కలిగినప్పుడు భగవంతుడు అనుగ్రహిస్తాడని వాహనసేవలో అంతరార్థం.

అక్టోబర్‌ 6న రాత్రి 7 గంటలకు ముత్యపుపందిరి వాహనం…

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు రాత్రి శ్రీ మలయప్పస్వామివారు ముత్యపుపందిరి వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. జ్యోతిషశాస్త్రం చంద్రునికి ప్రతీకగా ముత్యాలను తెలియజేస్తుంది. శ్రీకృష్ణుడు ముక్కుపై, మెడలో ముత్యాల ఆభరణాలు ధరించినట్టు పురాణాల్లో ఉంది. ఆదిశేషుని పడగలను ముత్యాల గొడుగా పూనిన స్వామివారిని దర్శించినా, స్తోత్రం చేసినా సకల శుభాలు కలుగుతాయని పురాణ ప్రశస్తి. చల్లని ముత్యాల కింద నిలిచిన శ్రీనివాసుని దర్శనం తాపత్రయాలను పోగొట్టి, భక్తుల జీవితాలకు చల్లదనాన్ని సమకూర్చుతుందని భక్తుల విశ్వాసం.

అక్టోబర్‌ 7న ఉదయం 8 గంటలకు కల్పవృక్ష వాహన సేవ…

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు ఉదయం మలయప్ప స్వామి ఉభయదేవేరులతో కలిసి కల్పవృక్ష వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. క్షీరసాగరమథనంలో ఉద్భవించిన విలువైన వస్తువుల్లో కల్పవృక్షం ఒకటి. కల్పవృక్షం నీడన చేరిన వారికి ఆకలిదప్పులుండవు. పూర్వజన్మస్మరణ కూడా కలుగుతుంది. ఇతర వృక్షాలు తాము కాచిన ఫలాలు మాత్రమే ప్రసాదిస్తాయి. అలాకాక కల్పవృక్షం కోరుకున్న ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది. కల్పవృక్ష వాహన దర్శనం వల్ల కోరిన వరాలను శ్రీవారు అనుగ్రహిస్తారని భక్తుల విశ్వాసం.

అక్టోబర్‌ 7న రాత్రి 7 గంటలకు సర్వభూపాల వాహనం..

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు రాత్రి శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి సర్వభూపాల వాహనంపై భక్తులకు అభయ మిస్తారు. సర్వభూపాల అంటే విశ్వానికే రాజు అని అర్థం. అంటే శ్రీవారు సకల దిక్పాలకులకు రాజాధిరాజని భావం. తూర్పుదిక్కుకు ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణానికి యముడు, నైరుతికి నిరృతి, పశ్చిమానికి వరుణుడు, వాయువ్యానికి వాయువు, ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి పరమేశ్వరుడు అష్టదిక్పాలకులుగా విరాజిల్లుతున్నారు. వీరందరూ స్వామివారిని తమ భుజస్కంధాలపై, హృదయంలో ఉంచుకుని సేవిస్తారు. తద్వారా వారి పాలనలో ప్రజలు ధన్యులవుతారు అనే సందేశాన్ని ఈ వాహనాన్ని అధిరోహించడం ద్వారా స్వామివారు తెలియజేస్తున్నారు.

అక్టోబర్‌ 8 న ఉదయం 8 గంటలకు మోహినీ అవతారం…

బ్రహ్మోత్సవాలలో 5వ రోజు ఉదయం శ్రీవారు మోహినీ రూపంలో శృంగారరసాధి దేవతగా భాసిస్తూ దర్శనమిస్తాడు. పక్కనే స్వామి దంతపుపల్లకి పై వెన్నముద్ద కృష్ణుడై మరో రూపంలో అభయమిస్తాడు. ప్రపంచమంతా తన మాయావిలాసమని, తనకు భక్తులైనవారు ఆ మాయను సులభంగా దాటగలరని మోహినీ రూపంలో ప్రకటిస్తున్నాడు.

అక్టోబర్‌ 8న సాయత్రం 6.30 గంటలకు గరుడ వాహనం…

శ్రీవారి బ్రహ్మోత్సవాలలో 5వ రోజు రాత్రి గరుడవాహనం పై జగన్నాటక సూత్రధారియైన శ్రీ మలయప్ప స్వామివారు తిరుమాడ వీధులలో నింపాదిగా ఊరేగుతూ భక్తులందరికీ తన దివ్యమంగళ రూపదర్శన మిస్తాడు. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. దాస్య భక్తితో కొలిచే భక్తులకు తాను దాసుడినవుతానని గరుడవాహనం ద్వారా స్వామివారు తెలియజేస్తున్నాడు. మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని స్వామివారు భక్తకోటికి తెలియజెప్పుతున్నాడు.

అక్టోబర్‌ 9న ఉదయం 8 గంటలకు హనుమంత వాహనం…

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజు ఉదయం శేషాచలాధీశుడు రాముని అవతారంలో తన భక్తుడైన హనుమంతునిపై ఊరేగి భక్తులకు దర్శనమిస్తాడు. హనుమంతుడు భగవత్‌ భక్తులలో అగ్రగణ్యుడు. గురుశిష్యులైన శ్రీరామ హనుమంతులు తత్త్వవివేచన తెలిసిన మహనీయులు కావున ఈ ఇరువురినీ చూసిన వారికి వేదాలతత్త్వం ఒనగూరుతుందని నమ్మకం.

అక్టోబర్‌ 9న సాయంత్రం నాలుగు గంటలకు స్వర్ణరథం…

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజు సాయంత్రం శ్రీనివాసుడు స్వర్ణరథాన్ని అధిరోహించి భక్తులను అనుగ్రహిస్తాడు. స్వర్ణరథం స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైంది. ఈ స్వర్ణోత్సవ సేవలో కల్యాణకట్ట సేవాపరులు తొలుత బంగారు గొడుగును అలంకరించడం సంప్రదాయంగా వస్తోంది. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు రథగమనాన్ని వీక్షించిన ద్వారకా ప్రజలకు ఎంతో ఆనందం కలిగింది. స్వర్ణరథంపై ఊరేగుతున్న శ్రీనివాసుడిని చూసిన భక్తులకు కూడా అలాంటి సంతోషమే కలుగుతుంది.

అక్టోబర్‌ 9న రాత్రి 7 గంటలకు గజవాహనం…

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజు రాత్రి వేంకటాద్రీశుడు గజవాహనంపై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయమిస్తాడు. శ్రీవారిని గజేంద్రుడు మోస్తున్నట్టు భక్తులు కూడా నిరంతరం శ్రీనివాసుని హృదయంలో పెట్టుకుని శరణాగతి చెందాలని ఈ వాహనసేవ ద్వారా తెలుస్తోంది.

అక్టోబర్‌ 10 న ఉదయం 8 గంటలకు సూర్యప్రభ వాహనం…

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 7వ రోజున ఉదయం సూర్యప్రభ వాహనంపై శ్రీమన్నారాయణుడు తిరుమాడవీధులలో విహరిస్తూ భక్తులను కటాక్షిస్తారు. సూర్యుడు తేజోనిధి, సకల రోగ నివారకుడు. ప్రకృతికి చైతన్యప్రదాత. వర్షాలు, వాటి వల్ల పెరిగే చెట్లు, చంద్రుడు, అతని వల్ల పెరిగే సముద్రాలు మొదలైనవన్నీ సూర్యతేజం వల్లనే వెలుగొందుతున్నాయి. సూర్యప్రభ వాహనంపైన శ్రీనివాసుని దర్శనం వల్ల ఆరోగ్య విద్య, ఐశ్వర్యం, సంతానం వంటి ఫలాలు సూర్యదేవుని అనుగ్రహం వల్ల భక్తకోటికి సిద్ధిస్తాయని విశ్వాసం.

అక్టోబర్‌ 10 న రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనం…

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 7వ రోజు రాత్రి శ్రీమలయప్పస్వామి చంద్రప్రభ వాహనంపై విహరిస్తూ తన రాజసాన్ని భక్తులకు చూపుతాడు. చంద్రుడు శివునికి శిరోభూషణమైతే ఇక్కడ శ్రీహరికి వాహనంగా ఉండడం విశేషం. చంద్రోదయం కాగానే కలువలు వికసిస్తాయి. సాగరుడు ఉప్పొంగుతాడు. చంద్రప్రభ వాహనంపై స్వామిని చూడగానే భక్తుల మనసు ఉప్పొంగుతుంది. భక్తుల కళ్లు వికసిస్తాయి. భక్తుల హ దయాల నుండి అనందరసం స్రవిస్తుంది. ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆది దైవికమనే మూడు తాపాలను ఇది నివారిస్తుంది.

అక్టోబర్‌ 11 న ఉదయం ఏడు గంటలకు శ్రీవారి రథోత్సవం…

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 8వ రోజు ఉదయం ఉభయదేవేరులతో కూడిన శ్రీమలయప్పస్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఆత్మ రథికుడు, శరీరమే రథం, బుధ్ధి సారథి, మనస్సు పగ్గం, ఇంద్రియాలే గుర్రాలు, విషయాలే వీధులు, ఈ రీతిలో శరీరాన్ని రథంతో పోల్చుతారు. దీన్నివల్ల స్థూల శరీరం వేరని, సూక్ష్మ శరీరం వేరని, ఆత్మ అందుకు భిన్నమనే ఆత్మానాత్మ వివేకం కలుగుతుంది. రథోత్సవంలో ముఖ్యంగా కలిగే తత్త్వజ్ఞానమిదే. భక్తులు రథాన్ని లాగుతారు కానీ, సకలజీవులలో అంతర్యామిగా ఉన్న పరమాత్మ తన రథాన్ని తానే లాగుతున్నాడని అన్నమయ్య అనడం ముదావహం.

అక్టోబర్‌ 11న రాత్రి 7 గంటలకు అశ్వవాహనం…

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 8వ రోజు రాత్రి శ్రీమలయప్పస్వామివారు అశ్వవాహనంపై విహరించి భక్తులను అనుగ్రహిస్తాడు. ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలను వర్ణిస్తున్నాయి. ఆ గుర్రాలను అధిరోహించిన పరమాత్మ ఇంద్రియాలను నియమించే నియామకుడు అని కృష్ణయజుర్వేదం తెలుపుతోంది. స్వామి అశ్వవాహనారూఢుడై కల్కి అవతారంలో తన స్వరూపాన్ని ప్రకటిస్తూ భక్తులను కలిదోషాలకు దూరంగా ఉండాలని తన అవతారంతో ప్రబోధిస్తున్నాడని భక్తుల విశ్వాసం.

అక్టోబర్‌ 12 న బ్రహ్మత్సవాల తొమ్మిదోన ఉదయం 6 గంటలకు చక్రస్నానం…

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో చివరిదైన 9వ రోజు ఉదయం చక్రస్నానం వేడుకగా జరుగుతుంది. చక్రస్నానం యజ్ఞాంతంలో ఆచరించే అవభృథస్నానమే. ముందుగా ఉభయదేవేరులతో కలిసి శ్రీవారి సరసన ఉన్న చక్రత్తాళ్వార్లకు పాలు, పెరుగు, నెయ్యి, తెనె, చందనంతో అర్చకులు అభిషేకం చేస్తారు. ఈ అభిషేక కైంకర్యాన్ని అందుకుని చక్రత్తాళ్వార్‌ ప్రసన్నుడవుతాడు. చక్రస్నానం సమయంలో అధికారులు, భక్తులందరూ పుష్కరిణిలో స్నానం చేసి యజ్ఞఫలాన్ని పొందుతారని భక్తుల విశ్వాసం.

అక్టోబర్‌ 12 ఆఖరు రోజు రాత్రి 7 గంటలకు ధ్వజావరోహణం…

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో చివరిదైన తొమ్మిదో రోజు రాత్రి బంగారు తిరుచ్చి ఉత్సవం తరువాత ధ్వజావరోహణం శాస్త్రోక్తంగా జరుగుతుంది. ధ్వజావరోహణ ఘట్టంతో 9 రోజుల పాటు జరిగిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article