అమ్మ ప్రేమగా టీలో ముంచి తినిపించిన బిస్కెట్ ఆ చిట్టి తల్లి ఉసురు తీసింది. అవును.. ఆ బిస్కెట్ తిని ఊపిరాడక పాప మృతి చెందింది. దీంతో తల్లిదండ్రులు రోదనలు మిన్నంటాయి.
Venkata Lakshmi
కేరళలోని తిరువళ్లూరు సమీపంలో బిస్కెట్లు తింటూ ఊపిరాడక 3 ఏళ్ల చిన్నారి మృతి చెందింది. ఈ విషాద ఘటన తిరువళ్లూరు జిల్లా కుమ్మిడిపూండి పక్కన గల కవరప్పెట్టై ప్రాంతంలోని గురువరాజా కందిగై గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామంలో అరికృష్ణన్, అమ్ములు దంపతులు నివశిస్తున్నారు. వారికి వెంకట లక్ష్మి అనే 3 సంవత్సరాల వయసు గల కుమార్తె ఉంది. కాగా, ఆదివారం ఉదయం చిన్నారి వెంకటలక్ష్మికి టీలో బిస్కెట్లు ముంచి తినిపించారు. ఆ సమయంలో చిన్నారి ఒక్కసారిగా ఊపిరి పీల్చుకోలేక ఇబ్బంది పడింది. దీంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు.. పాపను సెంగున్రం సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ వెంకటలక్ష్మిని పరీక్షించిన వైద్యులు అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటనపై కవార్‌పేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తిరువళ్లువర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
కాగా పిల్లలకు వారి వయస్సు ప్రకారం సరైన ఆహారం ఇవ్వాలని వైద్య నిపుణులు సూచించారు. పిల్లల వయస్సు, ఎదుగుదలను పరిగణనలోకి తీసుకోకుండా వివిధ రకాల ఆహార పదార్థాల్ని ఇవ్వడం కరెక్ట్ కాదంటున్నారు. ఈ విషయంలో సందేహాలు ఉంటే పిల్లల వైద్య నిపుణుల్ని సంప్రదించాలని సూచిస్తున్నారు.