Uddhav Thackeray: ఉద్ధవ్ ఠాక్రే.. పదవీ వ్యామోహమే ఆయన కొంప ముంచిందా?

1 hour ago 1

రాజకీయాల్లో ఒక్క పరాజయంతో కథ ముగిసింది అనుకోవడం అవివేకమని చరిత్ర చెబుతోంది. వరుస పరాజయాల తర్వాత కూడా పడిలేచిన కెరటంలా అఖండ విజయాలు సొంతం చేసుకున్న ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. అదే సమయంలో కొన్ని పరాజయాలు భవిష్యత్తు అన్నదే లేకుండా చేసిన సందర్భాలు సైతం ఉన్నాయి. మహారాష్ట్ర తాజా రాజకీయ పరిణామాలను గమనిస్తే.. ఉద్ధవ్ ఠాక్రేకు అసెంబ్లీ ఎన్నికల్లో తగిలిన ఎదురుదెబ్బ నిస్సందేహంగా జీర్ణించుకోవడం కష్టమే. అయితే నిలబడి కలబడుతూ భవిష్యత్తులో అధికారానికి తిరిగొస్తారా అన్నదే ఇప్పుడు క్లిష్టమైన మారింది. ముఖ్యమంత్రి పదవిపై వ్యామోహం ఉద్ధవ్ ఠాక్రే వర్తమానాన్ని అగ్యమగోచరంగా మార్చింది.

నిజానికి 2019లోనే ప్రజాతీర్పు భారతీయ జనతా పార్టీ (BJP), శివసేన (SS) కూటమికి విజయాన్ని అందించింది. ఈ ఎన్నికల్లో 152 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ 105 గెలుచుకుంది. 124 స్థానాల్లో పోటీ చేసిన శివసేన కేవలం 56 సీట్లను మాత్రమే గెలుచుకోగలింది. ఎక్కడైనా ఎక్కువ సీట్లు గెలుచుకున్న పార్టీకే ముఖ్యమంత్రి పదవి వరిస్తుంది. కానీ అందుకు భిన్నంగా నాటి శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే సీఎం పదవి తనకే ఇవ్వాలని పేచీ పెట్టారు. ఈ పేచీని కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP)లు తమకు అనుకూలంగా మార్చుకుని, ఆ సీఎం పదవి తామే ఇస్తామని, తమతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఉద్ధవ్ ఠాక్రేకు ఆశజూపాయి.

తనకు ముఖ్యమంత్రి పదవే ముఖ్యం తప్ప పార్టీ సిద్ధాంతంతో పనేముంది అన్న చందంగా.. సైద్ధాంతికంగా పూర్తి భిన్న ధృవాలుగా ఉన్న పార్టీలతో ఉద్ధవ్ ఠాక్రే కలిసి ‘మహా వికాస్ అఘాడీ’ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మిత్రద్రోహానికి పాల్పడ్డ శివసేనకు బుద్ధి చెప్పాలనుకున్నారో.. లేక ఆర్థిక రాజధాని ముంబైపై పట్టుకోసమో.. మొత్తానికి బీజేపీ చేపట్టిన ఆపరేషన్‌తో శివసేన నిట్టనిలువుగా చీలిపోయింది. ఏకంగా 40 మంది ఎమ్మెల్యేలను చీల్చుకుని బయటికొచ్చిన ఏక్‌నాథ్ షిండేకు ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టిన కమలనాథులు.. ఆ తర్వాత ఎన్సీపీని సైతం చీల్చి అజిత్ పవార్‌కు ఉప ముఖ్యమంత్రి పదవినిచ్చి తమ సంకీర్ణ సర్కారును పటిష్టం చేసుకున్నారు. ఇదంతా అందరికీ తెలిసిన కథే. ఈ కథలో అసెంబ్లీ ఎన్నికలు ఊహించని మలుపులు తీసుకొచ్చాయి.

ప్రతిపక్ష నేత హోదా సైతం దక్కని దైన్యం!

అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ముందు వరకు, మహా వికాస్ అఘాడి (MVA) మెజారిటీ సాధిస్తే ముఖ్యమంత్రి పదవి తమకే దక్కాలంటూ శివసేన (ఉద్ధవ్ ఠాక్రే వర్గం), కాంగ్రెస్ నాయకులు బహిరంగంగా చర్చించుకున్నారు. వారొకటి తలిస్తే విధి మరొకటి తలచింది అన్నట్టుగా.. ముఖ్యమంత్రి పదవి కాదుకదా.. కనీసం అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడి హోదా సైతం దక్కని స్థితి నెలకొంది. ప్రతిపక్ష హోదాకు అవసరమైన కనీస సంఖ్య 29కి అఘాఢీ కూటమిలో ఏ ఒక్క పార్టీ చేరుకోలేకపోయింది. గుడ్డిలో మెల్ల నయం అన్న చందంగా ఆ కూటమిలో పెద్దన్న పాత్ర పోషిస్తుందనుకున్న కాంగ్రెస్ కంటే శివసేన (ఉద్ధవ్ ఠాక్రే) వర్గమే 20 స్థానాలు సాధించి పెద్ద పార్టీగా నిలిచింది.

ఉద్ధవ్ రాజకీయ ప్రయాణం 2003లో శివసేన నాయకత్వాన్ని స్వీకరించినప్పటి నుంచి సంక్షోభాలను, సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు సాగింది. ఆయన నాయకత్వాన్ని సవాల్ చేస్తూ తిరుగుబాట్లను సైతం ఎదుర్కొన్నారు. 2009లో రాజ్ ఠాక్రే విబేధించి ‘మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన’ (MNS) పేరుతో వేరు కుంపటి పెట్టుకున్నారు. ఆ పార్టీ శివసేనకు ముప్పుగా మారి ‘కొత్త శివసేన’గా చలామణి అయింది. ఆ తర్వాత నారాయణ్ రాణే కూడా తిరుగుబాటు చేశారు. అయినా సరే నిలదొక్కుకున్న ఉద్ధవ్ ఠాక్రే.. 2022లో ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలో జరిగిన తిరుగుబాటుతో పార్టీ అసలు పేరు, ఎన్నికల గుర్తును కోల్పోవాల్సి వచ్చింది. అయినా సరే.. లోక్‌సభ ఎన్నికల్లో మంచి పనితీరు కనబర్చిన ఉద్ధవ్ ఠాక్రేకు.. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం పార్టీ ఉనికికే ప్రమాదం తెచ్చిపెట్టింది.

ఫలించని ‘సానుభూతి’ అస్త్రాలు

ఏక్‌నాథ్ షిండే పార్టీని చీల్చి బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడాన్ని తనకు జరిగిన వెన్నుపోటుగా పేర్కొన్న ఉద్ధవ్ ఠాక్రే.. అదే అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తూ ప్రజల్లో సానుభూతి పొందే ప్రయత్నం చేశారు. అలాగే తనకు ద్రోహం చేసిన ఏక్‌నాథ్ షిండేను, ఆయన వర్గం నేతలను దేశద్రోహులుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో సానుభూతి అస్త్రం కొంతమేర పనిచేసినా.. పదే పదే అదే అంశం ఆధారంగా ఓట్లు పొందడం సాధ్యం కాదని అసెంబ్లీ ఎన్నికలు నిరూపించాయి. షిండే సర్కారు మహారాష్ట్ర కంటే గుజరాత్‌కే (మోదీ-షా) ఎక్కువ అనుకూలం అంటూ చేసిన విమర్శల్ని సైతం ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు.

సిద్ధాంతం గాలికొదిలి.. సెక్యులర్ ముసుగు తొడిగి…

ఉద్ధవ్ రాజకీయ గమనంలో ఎన్ని ఒడిదుడుకులు, తిరుగుబాట్లను ఎదుర్కొన్నా మళ్లీ నిలదొక్కుకున్నారు. కానీ 2019లో సైద్ధాంతికంగా బద్ధశత్రువులైన కాంగ్రెస్, ఎన్సీపీలతో జట్టు కట్టడం ఉద్ధవ్‌ను మెజారిటీ హిందువులకు దూరం చేసింది. హిందూ హృదయ సామ్రాట్‌గా జనం చేత పిలిపించుకున్న బాలా సాహెబ్ ఠాక్రే (బాల్ ఠాక్రే) నెలకొల్పిన శివసేన’ అతివాద హిందూ రాజకీయ పార్టీ అనడంలో సందేహం లేదు. హిందూత్వ భావజాలంతో రాజకీయాలు చేస్తున్న భారతీయ జనతా పార్టీ (BJP)ని మించి హిందూత్వ వాదాన్ని శివసేన ప్రదర్శించేది. భావసారూప్యత కారణంగా ఈ రెండు పార్టీలు కలిసి అనేక సంవత్సరాలుగా ప్రయాణం సాగించగలిగాయి. కానీ ఉద్ధవ్ ఠాక్రే సెక్యులర్ ముగుసు తొడిగి మైనారిటీ మెప్పు పొందే రాజకీయ వైఖరిని ప్రదర్శించే కాంగ్రెస్, ఎన్సీపీలతో జట్టుకట్టడం తన రాజకీయ ప్రయాణానికి చరమగీతం పాడినట్టయింది. బాల్ ఠాక్రే హయాంలో మిలిటెంట్ హిందూత్వ పోరాట వైఖరి నుంచి సెక్యులర్ జోన్లోకి అడుగుపెట్టడం ఆ పార్టీ శ్రేణుల్ని జీర్ణించుకోలేకుండా చేసింది. అదే ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటుకు పూర్తి మద్ధతు లభించేలా చేసింది.

సవాళ్లను అధిగమిస్తేనే భవిష్యత్తు

తాజా ఎన్నికల్లో ఓటమి తర్వాత తన విధేయులను నిలబెట్టుకోవడం ఉద్ధవ్‌కు మరో సవాలుగా మారింది. రాజకీయ నాయకులు సహజంగానే మంచి అవకాశాలు ఉన్న వర్గాల వైపు ఆకర్షితులవుతారు. పైగా వారు ఏ భావజాలాన్ని ఇష్టపడి వచ్చారో ఆ భావజాలం పార్టీలో కొరవడినప్పుడు, తమకు నచ్చిన భావజాలం కల్గిన ఇతర పార్టీల్లోకి ఫిరాయించేందుకే ఆసక్తి చూపుతారు. ఇప్పుడు శివసేన (ఉద్ధవ్ ఠాక్రే) పార్టీ తరఫున గెలిచిన 20 మందిని కాపాడుకోవడంతో పాటు పార్టీ శ్రేణుల్లో ఈ పరాజయభారాన్ని మర్చిపోయేలా రాజకీయ పోరాటాలకు సిద్ధం చేయాల్సిన అవసరం ఉంది.

ముంబయి, థానే, పూణే, నాసిక్, సంభాజీనగర్ వంటి నగరాల్లో జరగనున్న మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు మరో ముఖ్యమైన సవాలుగా మారుతున్నాయి. శివసేన మూడు దశాబ్దాలుగా బృహన్‌ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (BMC)ని పాలించింది. ఇందులో అత్యధిక కాలం బీజేపీతోనే పొత్తు పెట్టుకుంది. ఇప్పుడు చీలిపోయిన బలహీనపడ్డ శివసేన (UBT) ఓవైపు, తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బలంగా కనిపిస్తున్న శివసేన (ఏక్‌నాథ్ షిండే) వర్గం, బీజేపీలు మరోవైపు నిలిచాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ముంబైలో షిండే వర్గం (6) కంటే ఉద్ధవ్ పార్టీ ఎక్కువ సీట్లు (10) గెలుచుకోవడం ఆయనలో కొత్త ఆశలు చిగురింపజేస్తున్నాయి. బీఎంసీ ఎన్నికల్లో పట్టు నిలబెట్టుకుంటే.. పార్టీ శ్రేణుల్లో కొంత భరోసా నింపే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. లేదంటే ఉద్ధవ్ భవితవ్యం ప్రశ్నార్థకమేనని వ్యాఖ్యానిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article