యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్- నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (డిసెంబర్) 2024 (యూజీసీ- నెట్ డిసెంబర్ 2024) నోటిఫికేషన్ విడుదలైంది. జూనియర్ రిసెర్చి ఫెలోషిప్‌తోపాటు విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు పోటీపడేందుకు, పీహెచ్డీ ప్రవేశాలకు ఏటా రెండు సార్లు జూన్, డిసెంబర్ నెలల్లో నిర్వహిస్తుంటారు. ఈ ఏడాదికి డిసెంబర్ సెషన్‌కు యూజీసీ- నెట్ నోటిఫికేషన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) జారీ చేసింది. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 19వ తేదీ నుంచి ప్రారంభమైంది. డిసెంబర్ 10వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మొత్తం 85 సబ్జెక్టులకు ఈ పరీక్షను ఆన్లైన్ విధానంలో నిర్వహించనున్నారు. ఆన్లైన్లో నవంబర్ 19 నుంచి డిసెంబర్ 10 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. నెట్‌కు అర్హత సాధిస్తే యూనివర్సిటీలు, కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేయడానికి, జేఆర్ఎఫ్కు ఎంపికైతే ఫెలోషిప్ లభిస్తుంది. జేఆర్ఎఫ్ పూర్తిచేసిన వారికి ఎస్ఆర్ఎఫ్కు అర్హత లభిస్తుంది. వీరికి కూడా స్కాలర్షిప్ అందుతుంది. తద్వారా పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు.
అడల్ట్ ఎడ్యుకేషన్, ఆంథ్రోపాలజీ, అరబ్ కల్చర్ అండ్ ఇస్లామిక్ స్టడీస్, అరబిక్, ఆర్కియాలజీ, అస్సామీ, బెంగాలీ, బోడో, బౌద్ధ, జైన, చైనీస్, కామర్స్, కంప్యూటర్ సైన్స్ అండ్, క్రిమినాలజీ, జాగ్రఫీ, ఎకనామిక్స్, ఇంగ్లిష్, హోం సైన్స్, హిస్టరీ, ఫోరెన్సిక్ సైన్స్, ఇండియన్ కల్చర్, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, లింగ్విస్టిక్స్, మ్యూజిక్, సైకాలజీ, లా, ఫిలాసఫీ, ఫిజికల్ ఎడ్యుకేషన్, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, తెలుగు తదితర సబ్జెక్టుల్లో ఈ పరీక్షను నిర్వహిస్తారు. మాస్టర్స్ డిగ్రీలో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులై అభ్యర్ధులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఓబీసీ- ఎన్సీఎల్/ ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ థర్డ్ జెండర్ కేటగిరీ అభ్యర్థులకు 50 శాతం మార్కులు వస్తే సరిపోతుంది. జేఆర్ఎఫ్కు జనవరి 1, 2025 నాటికి 30 ఏళ్లు మించకుండా ఉండాలి. అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు ఎలాంటి గరిష్ఠ వయోపరిమితి ఉండదు.
ఆసక్తికలిగిన వారు జనరల్ అభ్యర్ధులు రూ.1150, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ- ఎన్సీఎల్ అభ్యర్ధులు రూ.600, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, థర్డ్ జెండర్ అభ్యర్ధులు రూ.325 దరఖాస్తు ఫీజు చెల్లించి అప్లై చేసుకోవచ్చు. ఈ పరీక్ష మొత్తం రెండు పేపర్లకు ఉంటుంది. రెండు పేపర్లలో ఆబ్జెక్టివ్ టైప్, మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. పేపర్ 1లో 50 ప్రశ్నలకు 100 మార్కులు కేటాయిస్తారు. పేపర్ 2లో 100 ప్రశ్నలకు 200 మార్కులు కేటాయించారు. పరీక్షకు 3 గంటల వ్యవధి ఉంటుంది. పేపర్-1లో రీజనింగ్ ఎబిలిటీ, రీడింగ్ కాంప్రహెన్షన్, డైరెర్జంట్ థింకింగ్, జనరల్ అవేర్నెస్పై ప్రశ్నలు అడుగుతారు. పేపర్ 2లో అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్ట్ ఆధారంగా ప్రశ్నలు వస్తాయి.
ఇవి కూడా చదవండి
ముఖ్యమైన తేదీలు
- ఆన్లైన్ దరఖాస్తులకు ప్రారంభ తేదీ: నవంబర్ 19, 2024.
- ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబర్ 10, 2024.
- పరీక్ష రుసుం చెల్లింపు చివరి తేదీ: డిసెంబర్ 11, 2024.
- దరఖాస్తు సవరణ తేదీలు: డిసెంబర్ 12, 13 తేదీల్లో
- అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ తేదీ: ఇంకా వెల్లడించలేదు
- నెట్ పరీక్ష తేదీ: జనవరి 1, 2025 నుంచి 19 వరకు