ప్రస్తుత రోజుల్లో కూడా వాస్తు శాస్త్రం ఇళ్ల నిర్మాణాలు, బాత్రూమ్ లొకేషన్లు, ఇతర విషయాల్లో కీలక పాత్ర పోషిస్తుంది. వాస్తు ప్రకారం ఇంటి నిర్మాణం నుంచి ప్రతి చిన్న అంశం వరకు కొన్ని నియమాలు పాటించడం చాలా అవసరం. ముఖ్యంగా అటాచ్‌డ్ బాత్రూమ్‌ల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే వాటి ప్రభావం కుటుంబ జీవితంపై ప్రతికూలంగా ఉంటుంది. కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా మీ ఇంట్లో శాంతి, ఐశ్వర్యం మెరుగుపడతాయి.
ప్రధాన జాగ్రత్తలు
అటాచ్‌డ్ బాత్రూమ్‌ల ప్రభావం ఎక్కువగా దాంపత్య జీవితంపై ఉంటుంది. అందుకే ఆ గదిలో నిద్రిస్తున్నప్పుడు బాత్రూమ్ వైపు పాదాలు పెట్టకూడదు. ఇది మీ సంబంధాల్లో ఒడిదుడుకులు తెచ్చే అవకాశం ఉంది. అలాగే బాత్రూమ్ రంగుల విషయంలో గోధుమ, తెలుపు వంటి రంగులు ఉపయోగించడం మంచిది. వీటి వల్ల శుభఫలితాలు ఉంటాయి.
బాత్రూమ్ తలుపులు మూసి ఉంచడం
పొరపాటున కూడా బాత్రూమ్ తలుపులు తెరిచి ఉంచకూడదు. ఇది దాంపత్య జీవితంలో సమస్యలే కాకుండా ఆర్థిక పరిస్థితులపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. రాత్రి పడుకునే ముందు బాత్రూమ్ తలుపులు మూసి ఉంచడం అలవాటు చేసుకోవాలి. బకెట్లు లేదా టబ్‌లు నీలిరంగులో ఉండేలా చూసుకోవాలి. నలుపు, ఎరుపు వంటి రంగుల బకెట్లు వాడకపోవడం మంచిది.
గ్లాస్ గిన్నెలు, రాళ్ల ఉప్పు
మీ ఇంట్లో వాస్తు దోషాలను తగ్గించాలనుకుంటే బాత్రూమ్‌లో గాజు గిన్నె ఉంచి, అందులో రాళ్ల ఉప్పు నింపండి. వీటిని ప్రతి వారం మారుస్తూ ఉండాలి. ఇది ప్రతికూల శక్తులను దూరం చేయడంలో ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే బాత్రూమ్‌లో నీటిని లీక్ కాకుండా చూసుకోవాలి.
తడి బట్టలు ఉంచకపోవడం
బాత్రూమ్‌లో బట్టలు ఉతకడం, తడి బట్టలను ఉంచడం వంటివి ఎప్పుడూ చేయకూడదు. తడి బట్టలు ఉంచడం వాస్తు దోషాలను పెంచే అవకాశం ఉంది. వీటిని బాత్రూమ్‌లో నానబెట్టకుండా బయట ఎండబెట్టడం మంచిది.
టాయిలెట్ సీటును మూసి ఉంచడం
టాయిలెట్ సీటు ఎప్పటికీ మూసే ఉంచాలి. పొరపాటున తెరిచి ఉంచితే ప్రతికూల శక్తులు ఇంట్లోకి ప్రవేశించి ఆర్థిక నష్టాలను కలిగిస్తాయి. అందువల్ల ఈ అంశాన్ని ఖచ్చితంగా పాటించాలి. ఈ చిన్న చిట్కాలు పాటించడం ద్వారా వాస్తు దోషాలను తగ్గించుకోవచ్చు, శుభ ఫలితాలను పొందవచ్చు.
(ఇక్కడ ఇచ్చిన సమాచారం మత విశ్వాసాలు, నమ్మకాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది)