తిరుపతి జిల్లాలో ఏనుగుల దాడిలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. చంద్రగిరి మండలం మామిడి మానుగడ్డ పంట పొలాల్లో ఏనుగుల గుంపు తిష్టవేసింది. స్థానిక రైతులు వాటినే తరిమేందుకు యత్నించారు. ఈ క్రమంలో గజరాజులు ఎదురుదాడి చేశాయి. ఏనుగుల దాడిలో 33 ఏళ్ల రాకేష్ చౌదరి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన మానుగడ్డ గ్రామ పరిధిలోని పంట పొలాల్లో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.. పంట పొలాల్లో తిష్ట వేసిన ఏనుగులను తరిమే క్రమంలో ఏనుగులు తిరగబడ్డాయి. తప్పించుకునే ప్రయత్నం చేసినా రాకేష్‌ను తొండంతో పట్టుకుని నేలకు కొట్టి చంపింది ఏనుగు. ఈ విషయం తెలిసి స్థానికులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. మృతుడు కందులవారి పల్లి ఉప సర్పంచ్ రాకేష్ చౌదరి సీఎం చంద్రబాబు కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. ఆయనకు భార్య, మూడేళ్ల కూతురు ఉంది. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
అసలేం జరిగిందంటే..
మానుగడ్డ గ్రామ పంట పొలాల్లో తిష్ట వేసిన ఏనుగుల గుంపును తరిమే ప్రయత్నంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు గ్రామస్థులు తెలిపారు. గ్రామ పరిసరాల్లోని పొలాల్లో తిష్ట వేసిన ఏనుగుల గుంపును తరిమేందుకు శనివారం రాత్రి రాకేష్ చౌదరి రైతులతో పాటు వెళ్ళాడు. రాత్రిపూట ఏనుగులగుంపును తరిమే సమయంలో దగ్గరగా ఏనుగుల గుంపు వచ్చింది. టార్చ్ లైట్స్ వేసుకొని వాటిని బెదరగొట్టే ప్రయత్నం చేసిన రైతులు.. రాత్రి సమయం కావడంతో ఏనుగుల గుంపు దగ్గరగా రావడాన్ని గుర్తించలేకపోయారు. కొందరు చెట్లను ఎక్కి తప్పించుకునే ప్రయత్నం చేశారు. అయితే.. రాకేష్ చౌదరి అందరికన్నా ముందు ఉండడంతో ఏనుగులు మరింత రెచ్చిపోయాయి.. రాకేష్ చౌదరి టార్చ్ వేసి తప్పించుకునే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది. ఓ ఏనుగు రాకేష్‌ను తొండంతో పట్టుకుని చెట్టుకు విసిరి కొట్టి నేలపై పడేసి తొక్కి చంపినట్లు స్థానికులు తెలిపారు.. ఏనుగుల గుంపుతో భయంతో వణికిపోయిన రైతులు చెట్టుకు పుట్టకు పరుగులు తీసి ప్రాణాలను కాపాడుకున్నారు. కొందరు రైతులు చెట్లపైకి ఎక్కి ఏనుగులకు కనిపించకుండా దాక్కున్నట్లు స్థానిక రైతులు తెలిపారు.
వీడియో చూడండి..
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో…
ఉమ్మడి చిత్తూరు జిల్లాకు ఏనుకులు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తరుచూ పంట పొలాలను నాశనం చేస్తుండటంతో ఎప్పటికప్పుడు రైతులు తరుముతున్నారు. ఏనుగుల నుంచి తమకు, పంట పొలాలకు రక్షణ కల్పించాలని జనం కోరుతున్నారు. కాని పరిష్కారం దొరకడం లేదు. రాకేష్ మృతి ఉమ్మడి చిత్తూరు జిల్లాను షాక్‌కు గురిచేసింది. ఏనుగులతో ఉన్న ముప్పు ఏ స్థాయిలో ఉందో మరోసారి స్పష్టం చేసింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..