పరీక్షల్లో ఎంతచదివామన్నది కాదు.. ఎలా చదివామన్నదే ముఖ్యం. అలాగని అందరికీ ఒకే స్ట్రాటజీ పనిచేస్తుందని చెప్పలేం. కానీ బుర్రకి పదును పెడితే పరీక్షల్లో మంచి ర్యాంకులు తెచ్చుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. ఈ టెక్నిక్స్ ఒత్తిడిని తగ్గించడమే కాదు.. విద్యార్థుల్లో మరింత చదవాలనే ఆసక్తిని కూడా పెంచుతాయి.
మీరే గురువుగా మారితే..
ప్రాక్టీస్ తో పాటు మధ్యలో బ్రేక్ తీసుకోవడం కూడా ఎంతో ముఖ్యం. లేదంటే చదివింది చదివినట్టు బుర్ర నుంచి జారిపోయే ప్రమాదం ఉంది. ముందుగా కష్టంగా ఉండే టాపిక్స్ ను డివైడ్ చేసుకుని సరళమైన భాషలో అర్థం చేసుకోవాలి. తర్వాత వాటిని వేరొకరికి బోధించాలి. ఇలా చేయడం వల్ల సబ్జెక్ట్ మీద పట్టు సాధించగలుగుతారు. వేరొకరికి చెప్పేటప్పుడు మనకొచ్చే సందేహాలను అప్పటికప్పుడు తెలుసుకుంటే నేర్చుకోవడం మరింత ఈజీ అవుతుంది.
మర్చిపోకుండా.. మరింత ఇంట్రెస్టింగ్ గా
నిత్యం మన మైండ్ లో ఎన్నో విషయాలు మెదులుతూ ఉంటాయి. మనం చదివేటప్పుడు కూడా అందుకు సంబంధించిన ఏదో ఒక ఇమేజ్ కళ్లముందు మెదులుతుంది. పరీక్ష రాసేటప్పుడు చదివింది మర్చిపోకుండా ఉండేందుకు ఇదో అద్భుతమైన టెక్నిక్. పాఠాలను ఒక సినిమాలాగానో అందులో కనిపించే ఓ సీన్ లాగానో ఊహించుకోవాలి. మనకు బాగా తెలిసిన విషయాలతో వీటిని ముడిపెడుతూ చదవగలిగితే ప్రిపరేషన్ మరింత ఇంట్రస్టింట్ గా మారుతుంది.
రివర్స్ స్టడీతో మొదలుపెట్టండి..
‘విజేతలు కొత్తగా ఏమీ చేయరు.. కానీ, భిన్నంగా చేస్తారు’ అని ఇంగ్లిష్ లో ఓ సెంటెన్స్ ఉంది. ప్రతిసారి పాత పద్దుతులే కాకుండా కొత్తదనం ట్రై చేయండి. ఉదాహరణకు ముందుగా ప్రశ్నలను ప్రాక్టీస్ చేసి ఆ తర్వాత మెటీరియల్ చదవండి. ఇది మన బ్రెయిన్ ను కీ డీటెయిల్స్ ను గుర్తుంచుకునేలా చేస్తుంది. దీనినే ‘రివర్స్ స్టడీ టెక్నిక్’ అని పిలుస్తారు.
పరుగెత్తి పాలు తాగేకన్నా..
మన కెపాసిటీని ముందుగానే అంచనా వేసుకుని దానిని బట్టి ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోవాలి. కొందరికి తెల్లవారుజామున ఫోకస్ బాగా కుదురుతుంది. కొందరికి నైట్ ఔట్స్ నచ్చుతాయి. నచ్చిన సమయాల్లో చదివేది కొంచెమైనా ఎక్కువకాలం గుర్తుంటుంది. అప్పుడు చదువు భారంగా అనిపించదు. ఇలా చదువుతూనే ప్రతి 40 నిమిషాలకు ఒకసారి బ్రేక్ తీసుకోవడం మాత్రం చాలా ముఖ్యం.
ఊహలకు రంగులు తోడైతే..
మన మెదడు సహజంగానే రంగులను బాగా ఇష్టపడుతుందని సైన్స్ చెప్తోంది. అందుకే ముఖ్యమైన ఫార్ములాలను ప్రత్యేకంగా ఓ రంగుతో హైలెట్ చేయాలి. అలాగే వాటి డెఫినేషన్లను కూడా మరో రంగుతో రాసుకోవాలి. వీటిని మెదడు ఎక్కువ కాలం గుర్తుంచుకుంటుంది. ఎరుపు, ఆరెంజ్ రంగులను కీ పాయింట్స్ కోసం.. బ్లూ, గ్రీన్ వంటివి డెఫినేషన్ల కోసం ఉపయోగించండి.
ఆడియోల రూపంలో..
ప్రయాణాలు చేసేటప్పుడు, ఇంట్లో చిన్న చిన్న పనులు చేసుకునేటప్పుడు చదువుకునే సమయం ఉండదు. అలాంటప్పుడు టైం వేస్ట్ కాకుండా పాఠాలను ఆడియోల రూపంలో సేవ్ చేసుకుని వినడం వల్ల మరింత ఉత్సాంగా చదవగలరని పరిశోధనలు చెప్తున్నాయి.
క్రియేటివిటీని అద్దుతూ..
డేటా రూపంలో ఉన్న వాటిని ఆసక్తికరం కథనాలుగా మలుచుకోవడం నేర్చుకోండి. ఇలా చేయడం వల్ల ఎప్పటికి మర్చిపోయే అవకాశమే ఉండదు. అవసరమైతే మీరు క్రియేట్ చేసిన కథలను మీ స్నేహితులతో పంచుకోండి. మెదడు ఇలాంటివి చేసినప్పుడు సహజంగానే మరింత ఫాస్ట్ గా రియాక్ట్ అవుతుందట.