మంచి కాంతివంతమైన చర్మంతో ఉన్నవారు కూడా ఒక్కోసారి ఉన్నట్టుండి నల్లబడిపోతుంటారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఆ ఇబ్బంది అలాగే ఉంటుంది. దీనికి చాలా రకాల కారణాలు ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా జీర్ణ వ్యవస్థ పనితీరుకు, మన చర్మం రంగు, ఆరోగ్యానికి లింక్ ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. దీనిని ముందే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే...నిగనిగలాడే, కాంతివంతమైన చర్మం మీ సొంతమవుతుందని వివరిస్తున్నారు. ఇక చర్మానికి, జీర్ణ వ్యవస్థకు ఏమిటి లింకేంటి అంటే...
మనం తినే ఆహారం నుంచి తగిన పోషకాలు శరీరానికి అందాలంటే… జీర్ణ వ్యవస్థలో ఆ ఆహారం బాగా జీర్ణం కావాలి, అదే సమయంలో పోషకాలన్నీ బాగా సంగ్రహించగలగాలి. ఇందులో ఏమాత్రం తేడా వచ్చినా మన మొత్తం ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. అందులోనూ ముఖ్యంగా చర్మంపై ఎక్కువ ప్రభావం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. జీర్ణ వ్యవస్థ సరిగా పనిచేయకపోతే… చర్మానికి సంబంధించిన చాలా సమస్యలకు దారితీస్తుందని స్పష్టం చేస్తున్నారు. జీర్ణ వ్యవస్థ సరిగా పనిచేయకపోతే శరీరంలో ఇన్ ఫ్లమేషన్ స్థితి తలెత్తుతుంది. ఇది చర్మాన్ని కళావిహీనం చేస్తుంది. చర్మం పొడిబారిపోతుంది. రంగు తగ్గిపోతుంది. ముడతలు పడటం ద్వారా వయసు ఎక్కువగా కనిపించేలా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు… ఎసిడిటీ, గ్యాస్, ఇతర జీర్ణ సంబంధ సమస్యలు ఉన్నవారిలో కళ్లకింద నల్లటి వలయాలు ఎక్కువగా ఏర్పడతాయని అమెరికాకు చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అధ్యయనంలో తేలింది.