కోటా, జనవరి 18: కొత్త ఏడాది ప్రారంభమై పట్టుమని 20 రోజులు కూడా కాలేదు.. అప్పుడే ప్రవేశ, పోటీ పరీక్షల కోచింగ్ హబ్‌గా పేరొందిన రాజస్థాన్‌లో ముగ్గురు విద్యార్ధులు బలవన్మరణానికి పాల్పడ్డారు. కోటాలో ప్రతి ఏడాది అధిక సంఖ్యలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం అక్కడ షరా మామూలై పోయింది. దీనిపై తాజాగా ఆ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి మదన్ దిల్వార్ మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కోటా ఆత్మహత్యలు చేసుకుంటున్న విద్యార్ధుల్లో కొందరు ప్రేమ వ్యవహారాల కారణంగానే ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆయన తేల్చేశాడు. ఈ మేరకు శనివారం ఓ కార్యక్రమంలో వెల్లడించడం విశేషం.
తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని, చదువు కోసం పిల్లలపై ఒత్తిడి పెంచవద్దని ఆయన కోరారు. తమ పిల్లల కదలికలపై తల్లిదండ్రులు ఎల్లవేళలా ఓ కన్నేసి ఉంచాలని సూచించారు. ప్రతి విద్యార్థికి వారికంటూ సొంత అభిరుచి ఉంటుందని, వారి ఆసక్తికి వ్యతిరేకంగా వారి లక్ష్యాలను బలవంతంగా నిర్దేశించడం వల్ల.. వారు తీవ్ర ఒత్తిడికి లోనవుతారని, దీంతో డిప్రెషన్‌కు లోనై విపరీత నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆయన పేర్కొన్నాడు. కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లకు ఇందులో చాలా తక్కువ పాత్ర ఉండవచ్చు కానీ విద్యార్థుల ర్యాంక్‌లపై తరచుగా చేసే వ్యాఖ్యలతో స్నేహితులు కీలక పాత్ర పోషిస్తారని ఆయన అన్నారు.
కొన్ని సందర్భాల్లో ‘ప్రేమ వ్యవహారాలు’ వల్ల కూడా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉంటే విద్యార్యాఉలు నియంత్రణ కోల్పోయినప్పుడు.. వారు తప్పు దిశలో వెల్లకుండా అడ్డుకోవచ్చని విద్యా మంత్రి దిలావర్ పేర్కొన్నారు. నా మాటలు కొంతమందికి చికాకు కలిగించినప్పటికీ, నేను నిజాయితీగా ఈ విషయాన్ని చెబుతున్నానని ఆయన అన్నారు. కాగా మంత్రి వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇవి కూడా చదవండి
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.