అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచే ట్రంప్ తన మార్క్ పాలనకు శ్రీకారం చుట్టారు. తాజాగా డెన్మార్క్‌లోని గ్రీన్‌లాండ్‌పై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గ్రీన్‌ల్యాండ్‌ను హస్తగతం చేసుకోవాలనుకుంటున్న ట్రంప్ దీని విషయమై డెన్మార్క్ ప్రధాని మెటె ఫ్రెడెరిక్సన్‌తో ఫోన్‌లో మాట్లాడారని, ఈ క్రమంలో వారిద్దరిమధ్య వాగ్వాదం జరిగిందని తెలుస్తోంది. డెన్మార్క్ అధీనంలో ఉన్న గ్రీన్‌లాండ్ ను కొనుగోలు చేస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే పలుమార్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ట్రంప్, డెన్మార్క్ ప్రధానమంత్రి మధ్య 45 నిమిషాల పాటు సాగిన ఫోన్ కాల్‌లో.. ట్రంప్ తన అభిప్రాయాలను ఘాటైన స్వరంతో వినిపించారని సంబంధిత అధికారులను ఉద్దేశిస్తూ అంతర్జాతీయ మీడియా కథనం వెల్లడించింది. గ్రీన్‌లాండ్ ను స్వాధీనం చేసుకునే విషయంలో తాము సీరియస్‌గా ఆలోచిస్తున్నామని ట్రంప్ పేర్కొనగా.. దానిని ఫ్రెడెరిక్సన్ తోసిపుచ్చారు. తమకు గ్రీన్‌ల్యాండ్‌ను అమ్మే ఉద్దేశం లేదని తేల్చిచెప్పారు. తన ప్రతిపాదనను తిరస్కరించడంతో ట్రంప్ దూకుడుగా మాట్లాడారని, ఒక దశలో బెదిరింపులకు పాల్పడ్డారని అధికారులు తెలిపారు. ఫోన్‌కాల్‌లో ట్రంప్ సంభాషించిన తీరుతో తాము దిగ్భ్రాంతికి గురయ్యామని తెలిపారు. మరికొందరు మాత్రం డెన్మార్క్ తిరస్కరణతో అమెరికా నుంచి చర్యలు ఉండొచ్చనే ఆందోళన వ్యక్తం చేశారు. డెన్మార్క్‌ను సుంకాలతో శిక్షిస్తానని ట్రంప్ ఈ ఫోన్‌కాల్‌లో హెచ్చరించినట్లు ఆ కథనం పేర్కొంది.