డ్రైఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మంచివని అందరికీ తెలుసు. వీటిలో ప్రోటీన్లు, మినరల్స్, ఫైబర్స్ పుష్కలంగా ఉండటంతో ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. అయితే వీటిని తినే విధానం సరైనది కాకపోతే ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశముంది అంటున్నారు వైద్య నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎప్పుడు తినొద్దు..?
కొంతమంది డ్రైఫ్రూట్స్‌ను అధికంగా తినటం వల్ల అనేక సమస్యలు వస్తాయి. ఇవి ఎక్కువగా తినటం వల్ల శరీరానికి అవసరమైన కేలరీలు దాటి బరువు పెరిగే అవకాశం ఉంటుంది. రోజుకు పావు కప్పు పరిమాణంలో మాత్రమే తినడం మంచిది.
షుగర్ కోటింగ్ డ్రైఫ్రూట్స్
కొన్ని డ్రైఫ్రూట్స్‌ను షుగర్ కోట్ చేసి అమ్ముతారు. అలాంటి వాటిని తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ పెరిగి, డయాబెటిస్ ప్రమాదం పెరుగుతుంది. సహజంగా ఉండే ఎండు ద్రాక్ష వంటి వాటిని మాత్రమే తినాలి.
డీహైడ్రేషన్ సమస్య
డ్రైఫ్రూట్స్ తిన్నప్పుడు కొంతమంది తగినంత నీరు తాగరు. ఇది డీహైడ్రేషన్, మలబద్ధకం సమస్యలకు కారణమవుతుంది. అందుకే, డ్రైఫ్రూట్స్ తినేటప్పుడు నీటిని ఎక్కువగా తాగడం ముఖ్యం.
ఫుడ్ తిన్న వెంటనే తినకూడదు
కొందరు భోజనం చేసిన వెంటనే డ్రైఫ్రూట్స్ తింటారు. ఇది పోషకాలు పూర్తిగా శరీరానికి అందకుండా చేస్తుంది. భోజనం చేసిన గంట తర్వాత లేదా మీల్స్ మధ్యలో తినడం ఉత్తమం.
ప్రిజర్వేటివ్స్‌ను చెక్ చేయండి
బయట కొనే డ్రైఫ్రూట్స్‌లో సల్ఫైట్, సల్ఫర్ డయాక్సైడ్ వంటి రసాయనాలు ఉండే అవకాశముంది. ఇవి ఆరోగ్యానికి హానికరం. కాబట్టి కొనేటప్పుడు లేబుల్ చెక్ చేసి, ప్రిజర్వేటివ్‌లులేని డ్రైఫ్రూట్స్‌ను ఎంచుకోవాలి.
మిగతా ఆహారంతో బ్యాలెన్స్
డ్రైఫ్రూట్స్ తింటున్నామని, మిగతా పండ్లు, కూరగాయలు, హోల్ గ్రెయిన్స్ తీసుకోకుండా ఉంటే పోషక సమతుల్యత తప్పుతుంది. అందువల్ల అన్ని రకాల పోషకాలను సమతుల్యంగా తీసుకోవడం చాలా అవసరం.
డ్రైఫ్రూట్స్ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే అవి ఎప్పుడూ, ఎంత తినాలి, ఎలా తినాలి అన్న దానిపై సరైన అవగాహన ఉండాలి. అప్పుడే వీటి ప్రయోజనాలను పూర్తిగా పొందగలుగుతాం.