నాలుగు రోజులుగా తిరుపతిలో జరుగుతున్న ఉత్కంఠకు తెరపడింది. డిప్యూటీ మేయర్ ఉపఎన్నికలో టీడీపీ విజయం సాధించింది. టీడీపీ అభ్యర్థి మునికృష్ణకు మద్దతుగా 26 ఓట్లు వచ్చాయి. వైసీపీ అభ్యర్థి లడ్డు భాస్కర్‌కు మద్దతుగా 21 ఓట్లు వచ్చాయి. తీవ్ర ఉత్కంఠ మధ్య జరిగిన ఎన్నికలో కూటమి విజయం సాధించింది. అయితే అప్రజాస్వామికంగా గెలిచారని వైసీపీ ఎంపీ గురుమూర్తి విమర్శించారు. తమకు బలం ఉంది కాబట్టే గెలిచామని టీడీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కౌంటర్ ఇచ్చారు. ప్రజలు ఎప్పుడో వైసీపీని తిరస్కరించారన్న కూటమి నేతలు విమర్శించారు.
తొలుత ఓటు వేసేందుకు సభ్యలంతా SVU సెనెట్‌హాల్‌కు వచ్చారు. వైసీపీ, టీడీపీ మద్దతు దారులంతా ఒకే దగ్గర కూర్చున్నారు. ఓటింగ్ ప్రారంభించిన అధికారులు.. వైసీపీ అభ్యర్థికి అనుకూలంగా ఉన్న వారిని చేతులు లేపాల్సిందిగా కోరారు. 21 మంది చేతులెత్తారు. ఆ తర్వాత టీడీపీ అభ్యర్థికి 26 ఓట్లు వచ్చాయి. ఓటింగ్ సంఖ్యను బట్టి టీడీపీ అభ్యర్థిని విజేతగా ప్రకటించారు.
డిప్యూటీ మేయర్ పదవిపై ఎన్నిక జరిగిన తర్వాత, సమావేశ మందిరంలో కాసేపు హైడ్రామా చోటుచేసుకుంది. టీడీపీ అభ్యర్థికి ఓటువేసిన మహిళా కార్పొరేటర్.. వైసీపీకి చెందిన సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. టీడీపీకి ఓటేసిన కార్పొరేటర్ కన్నీళ్లు పెట్టుకుంటూ సెనెట్‌హాల్ నుంచి బయటకు వచ్చారు. వైసీపీ తరఫున గెలిచి సభ్యులను బెదిరించి ఓట్లు వేయించుకుని గెలిచారని ఎంపీ గురుమూర్తి ఆరోపించారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని విమర్శించారు. వైసీపీ విమర్శలను కూటమి నేతలు తిప్పికొట్టారు. తిరుపతి ప్రజలు వైసీపీని తిరస్కరించారన్నారు తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. వైసీపీకి బలం లేదు కాబట్టే ఓడిపోయారని చెప్పారు.