2002 నాట్‌వెస్ట్ సిరీస్ ఫైనల్ భారత క్రికెట్ చరిత్రలో నిలిచిపోయే ఓ మధుర జ్ఞాపకం. ఇంగ్లాండ్ నిర్దేశించిన 325 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి, యువరాజ్ సింగ్, మహ్మద్ కైఫ్ అద్భుతమైన భాగస్వామ్యంతో భారత్ విజయం సాధించింది. అయితే, ఈ విజయానికి మరింత చరిత్ర కలిపిన ఘటన సౌరవ్ గంగూలీ లార్డ్స్ బాల్కనీలో షర్ట్ విప్పి జరుపుకున్న సంబరాలు. తాజాగా, ఆ మ్యాచ్‌లో భారత జట్టు మేనేజర్‌గా ఉన్న బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, ఈ వేడుకకు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
‘TRS’ యూట్యూబ్ షోలో పాల్గొన్న రాజీవ్ శుక్లా, ఆ మ్యాచ్ సమయంలో తన అనుభవాలను పంచుకున్నారు. భారత్ 325 పరుగుల లక్ష్యాన్ని ఛేదించగలదా? అనే టెన్షన్ వల్ల తాను రక్తపోటు మాత్ర వేసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. “నేను చాలా టెన్షన్‌లో ఉన్నాను, మ్యాచ్ ఎలా మారుతుందో తెలియదు. అప్పుడు సౌరవ్ గంగూలీని అడిగాను. అతనేమో ‘సార్, కనీసం మనం మైదానంలోకి వెళ్దాం’ అంటూ పూర్తి ఆత్మవిశ్వాసం ప్రదర్శించాడు,” అని చెప్పాడు.
భారత జట్టు విజయానికి దగ్గరగా ఉండగా, సౌరవ్ గంగూలీ మొత్తం జట్టుతో కలిసి షర్ట్ విప్పి సంబరాలు చేయాలని కోరాడని రాజీవ్ శుక్లా తెలిపారు. ఇంతకీ దీనికి ఓ ప్రత్యేక కారణం కూడా ఉంది. 2002లో ముంబైలో ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ కూడా ఇదే విధంగా షర్ట్ విప్పి సంబరాలు చేసుకున్నాడు. ఆ సంఘటనను గుర్తు చేసుకుంటూ, గంగూలీ అతనికి బదులివ్వాలనే ఉద్దేశంతోనే ఇలా చేశాడని శుక్లా వెల్లడించారు.
గంగూలీ ఈ సంబరాల్లో మొత్తం జట్టునూ భాగస్వామ్యం చేయాలని అనుకున్నా, సచిన్ టెండూల్కర్ మాత్రం అలా చేయొద్దని సూచించాడు. శుక్లా తన అనుభవాన్ని పంచుకుంటూ, “సచిన్ డ్రెస్సింగ్ రూమ్‌లో నాతో ‘ఇది పెద్దమనిషి ఆట, మొత్తం జట్టు ఇలా చేయడం సరైన అభిప్రాయం ఇవ్వదు. ఒకవేళ గంగూలీ చేయాలని భావిస్తే, అతనొక్కడే చేయొచ్చు’ అని చెప్పాడు. నేను గంగూలీకి చెప్పాను, అతను అలా చేశాడు. ఆ దృశ్యం చరిత్రగా మిగిలిపోయింది” అని తెలిపారు.
భారత క్రికెట్ దూకుడును మార్చిన గంగూలీ
ఆ సంఘటన భారత క్రికెట్‌కు కొత్త తరం స్పూర్తిని అందించిందని, గంగూలీనే భారత జట్టులో దూకుడును తీసుకువచ్చిన మొదటి కెప్టెన్ అని రాజీవ్ శుక్లా అన్నారు. భారత క్రికెట్‌లో సాహసాన్ని, ఎదురు దెబ్బ ఇచ్చే ధోరణిని ప్రారంభించిన కెప్టెన్ గంగూలీ అని, అదే తరానికి ధోనీ, కోహ్లీ, రోహిత్ శర్మల వంటి ఆత్మవిశ్వాసం కలిగిన నాయకులను అందించిందని చెప్పుకోవచ్చు.
2002 నాట్‌వెస్ట్ ట్రోఫీ విజయం కేవలం ఒక సాధారణ గెలుపు కాదు. భారత క్రికెట్ ధోరణిని మార్చిన మలుపు. గంగూలీ షర్ట్ విప్పిన ఆ బాల్కనీ వేడుక ఒక క్రమశిక్షణగల జట్టు నుంచి దూకుడుగా, ప్రత్యర్థులను ఢీకొట్టగల బలమైన భారత జట్టుగా మారిన మార్పుకు సంకేతం. ఇది భారత క్రికెట్‌కు కొత్త శకానికి నాంది!
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..