Sepaktakraw Shivakumar Story: కర్నూలుకు చెందిన శివకుమార్, తండ్రి మరణానంతరం కుటుంబాన్ని పోషించేందుకు పేపర్ బాయ్‌గా పనిచేస్తూ సెపక్తక్రా క్రీడల్లో సాధన చేశాడు. అతని కృషి ఫలించి, అనేక జాతీయ, అంతర్జాతీయ పతకాలు సాధించాడు. 2024లో ఆదాయ పన్ను ఇన్స్పెక్టర్‌గా ఉద్యోగం సాధించాడు. అతని కథ, కష్టపడితే విజయం సాధించవచ్చని నిరూపిస్తుంది.
Sepaktakra Sport
Sepaktakraw Shivakumar Story: కర్నూలుకు చెందిన సరస్వతి ఎర్రన్నలకు నలుగురు కుమారులు. ఎర్రన్న రుమాల్ రోటి తయారు చేయడంలో సిద్ధంహస్తుడు. చెఫ్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అనివార్య కారణాలవల్ల 2014లో అనారోగ్యం పాలై ఎర్రన్న మృతి చెందాడు. దీంతో కుటుంబ భారం అంతా తల్లి సరస్వతిపై పడింది. కుటుంబ ఆర్థిక పరిస్థితులు తెలుసుకున్న ముగ్గురు పిల్లలు అశోక్ కుమార్, శివకుమార్, చిరులు తల్లికి చేదోడువాదులుగా ఉండేవారు. ఇక రెండవ కుమారుడైన శివకుమార్.. తండ్రి బాటలో పయనిస్తూ పార్ట్ టైంగా ఉదయం పేపర్ బాయ్‌గా పని చేస్తూ అనంతరం మైదానంలో సెపక్తక్రా క్రీడను సాధన చేసేవాడు. ఓవైపు పనులు చేస్తూనే, మరోవైపు ఆట ఆడుతూ బీకాం పూర్తి చేశాడు. చిన్నప్పుడు చేసిన కఠోర సాధన నేడు అంతర్జాతీయ స్థాయిలో భారతదేశానికి బంగారు పథకాలను తెచ్చిపెడుతోంది.
అన్న అశోక్ కుమార్ కూడా సెపక్తక్రా క్రీడలో ప్రతిభ కనబరిచి స్పోర్ట్స్ కోటాలో హైదరాబాదులో పోస్టల్ శాఖలో ఉద్యోగం సాధించాడు. తమ్ముడు చిరు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. శివకుమార్ సెపక్తక్రాలులో దాదాపు 20 పైగా రాష్ట్రస్థాయి జాతీయస్థాయి ఛాంపియన్ షిప్‌ల్లో పాల్గొన్నాడు. ఐదుసార్లు అంతర్జాతీయ స్థాయిలో భారతదేశం తరపున ప్రాతినిధ్య వహించాడు. 2024 జులైలో ముంబైలో ఇన్కమ్ టాక్స్ ఇన్స్పెక్టర్గా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం సాధించాడు.
ఈ ఉద్యోగానికి దాదాపు పదివేల మంది క్రీడాకారులు దరఖాస్తు చేసుకోగా అంతర్జాతీయ స్థాయిలో బంగారు పతకాలు సాధించడంతో ఉద్యోగం శివకుమార్‌ను వరించింది. 2022లో సీనియర్ రెగు వరల్డ్ ఛాంపియన్షిప్ బ్యాంకాక్‌లో గోల్డ్ మెడల్ సాధించాడు. 2023లో బ్యాంకాక్ లో జరిగిన వరల్డ్ ఛాంపియన్షిప్ లో బ్రాంజ్ మెడల్ సాధించాడు. 2024లో సౌత్ ఏషియన్ ఛాంపియన్షిప్ పోటీల్లో మూడు బంగారు పథకాలు సాధించి రికార్డు సృష్టించాడు.
ఇవి కూడా చదవండి
2024 లో థాయిలాండ్ లో జరిగిన ఛాంపియన్ షిప్ ఇండియా జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఒక లక్ష్యాన్ని ఎంచుకొని క్రీడాకారులు కష్టపడి సాధనం చేస్తే ఫలితం తప్పకుండా దక్కుతుంది అనేదానికి నేనే నిదర్శనం అంటున్నాడు ఈ అంతర్జాతీయ క్రీడాకారుడు శివకుమార్. శివకుమార్ నిజంగా అందరికీ స్ఫూర్తిదాయకం.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..