ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచడం, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా సాగిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బృందం పర్యటన విజయవంతంగా ముగిసింది. నాలుగు రోజుల్లో ప్రముఖ సంస్థల అధినేతలు, సీఈవోలు, పలు దేశాల ప్రతినిధులతో చర్చలు జరిపింది ఏపీ ప్రభుత్వం.
ఆనాటి ఆ జ్ఞాపకాలెంత మధురం అంటూ 30 ఏళ్ల ఫ్లాష్‌బ్యాక్‌లోకెళ్లారు ఏపీ సీఎం చంద్రబాబు. అంతేకాదు.. సడన్‌గా ప్రజంట్ టెన్స్‌లోకొచ్చి.. మై ఏపీ.. మై అమరావతి.. మై విజన్.. అనే స్లోగన్‌తో మెరుపుకలల సాకారం కోసం శ్రమిస్తున్నారు. టోటల్‌గా.. మధురస్మృతులు, బంగరు భవితకు సంబంధించి అమూల్యమైన భరోసాలతో పండగలా సాగింది చంద్రబాబు దావోస్ టూర్.
దావోస్ పర్యటనలో వేర్వేరు రంగాలకు చెందిన దాదాపు 15 వాణిజ్య సంస్థల అధిపతులతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలను వివరించారు. రాష్ట్రానికి వచ్చి అనుకూలతలను ప్రత్యక్షంగా పరిశీలించాలని ఆహ్వానించారు. దీంతో పలు ప్రముఖ సంస్థలు రాష్ట్రంలో తమ ప్రాజెక్టులను నెలకొల్పేందుకు ఆసక్తి కనబరిచాయి.
దావోస్ పర్యటనలో స్విస్‌మెన్, ఓర్లికాన్, ఆంగ్స్ట్ ఫిస్టర్, స్విస్ టెక్స్‌టైల్స్ సీఈవోలతో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ముఖ్యమంత్రి వివరించారు. సీఐఐ ప్రత్యేక సెషన్‌లో గ్రీన్ ఇండస్ట్రియలైజేషన్‌పై ప్రసంగించారు. రాష్ట్రాన్ని గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్‌కు గ్లోబల్ హబ్‌గా మార్చబోతున్నామన్నారు. సిస్కో, ఎల్జీ కెమ్ , కార్ల్స్‌బెర్గ్ గ్రూప్, ఆర్సెల్లార్ మిట్టల్ ప్రాజెక్టు, వెల్స్‌పన్ వెల్స్‌పన్ చైర్మన్ బీకే గోయింకాతో పెట్టుబడులపై చంద్రబాబు బృందం చర్చలు జరిపింది. సర్వర్ల కోసం సొంత చిప్‌లను రూపొందిస్తున్న గూగుల్ విశాఖలో డిజైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్‌ను కోరారు.
అలాగే, మలేషియాకు చెందిన ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కంపెనీ పెట్రోనాస్ ప్రెసిడెంట్, గ్రూప్ చీఫ్ ఎగ్జీక్యూటివ్ ఆఫీసర్ ముహమ్మద్ తౌఫిక్‌తోనూ సీఎం చంద్రబాబు చర్చలు జరిపారు. పెప్సీకో ఇంటర్నేషనల్ బెవరేజస్ సీఈవో యూజీన్ విల్లెంసెన్, పెప్సీకో ఫౌండేషన్ చైర్మన్ స్టీఫెన్ కెహోతో భేటీ అయ్యారు. బహ్రెయిన్ ప్రైమ్ మినిస్టర్ కార్యాలయం ప్రతినిధి హమద్ అల్ మహ్మీద్, ముంతాలకత్ సీఈవో అబ్దుల్లా బిన్ ఖలీఫా అల్ ఖలీఫాతో సమావేశమై రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పాలసీలను వివరించారు.
ఆంధ్రప్రదేశ్‌ను ఆరోగ్య, విద్య, ఆవిష్కరణల కేంద్రంగా మార్చేందుకు సహకరించాలని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు, బిల్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ ఫౌండర్ బిల్ గేట్స్‌ను సీఎం చంద్రబాబు కోరారు. ఫుడ్, హోమ్ కేర్, బ్యూటీ, పర్సనల్ కేర్ సంబంధిత ఉత్పత్తులకు పేరున్న సంస్థ యూనిలీవర్ చీఫ్ సప్లై చైన్ ఆఫీసర్ విల్లెం ఉజ్జెన్‌తో చర్చలు జరిపారు. ఏపీలో రూ. 330 కోట్లతో పామాయిల్ ఇండస్ట్రీ ఏర్పాటు చేయాలని భావిస్తున్న యూనిలీవర్‌ను బ్యూటీ పోర్ట్‌ఫోలియోకు సంబంధించి టెక్నాలజీ సెంటర్ ఏర్పాటుకు విశాఖపట్నం అనుకూలంగా ఉంటుందన్నారు.
దావోస్‌లో కాగ్నిజెంట్ సీఈవో రవికుమార్‌తో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీకి త్వరలోనే గుడ్‌న్యూ్స్ వస్తుందన్నారు. విశాఖ లాంటి నగరాల్లో కార్యకలాపాలు ప్రారంభించాలని.. అలాగే విజయవాడ, తిరుపతిలోనూ సౌకర్యాలు ఉన్నాయన్నారు.
ఐటీ మంత్రి నారా లోకేష్ ముఖ్యమంత్రికి వెన్నుదన్నుగా ఉంటూ పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ఒకేరోజు.. హిటాచీ ఇండియా ఎండీ భరత్ కౌశల్‌తో, WTCA గ్లోబల్ చైర్మన్ జాన్ డ్రూతో, WEF హెల్త్ కేర్ హెడ్ శ్యామ్ బిషన్‌తో, టెమాసెక్ హోల్డింగ్స్ ఇండియా హెడ్ రవి లాంబాతో వన్‌టువన్ మీటింగ్స్‌లో పాల్గొన్నారు లోకేష్. ఆంధ్రప్రదేశ్‌లోని డేటా సెంటర్లలో పెట్టుబడులు పెట్టాలని, విశాఖ, తిరుపతిలో కమర్షియల్ స్పేస్ ఏర్పాటు చేయాలని కోరారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..