రెండేళ్ల క్రితం షారుఖ్ ఖాన్ నటించిన బాలీవుడ్ సినిమా ‘డంకీ’ అందరికీ గుర్తుండే ఉంటుంది. అక్రమ మార్గాల్లో యునైటెడ్ కింగ్‌డమ్ (UK)లోకి చొరబడుతున్న పలువురు భారతీయుల కథను ఇతివృత్తంగా తీసుకుని రూపొందించిన సినిమా ఇది. కేవలం ఇదొక సినిమా కథ కాదు. నిజజీవితంలో నిత్యం జరుగుతున్న ఉదంతాలే ఇవి. వీటిలో అగ్రరాజ్యం అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ (UK) వంటి ఆంగ్లం మాట్లాడే దేశాలకు భారత ఉపఖండం నుంచి అక్రమ వలసలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఆయా దేశాల్లో గతంలో ఉన్న ప్రభుత్వాలు చూసీచూడనట్టు వ్యవహరించినప్పటికీ.. ఇప్పుడు రెండు దేశాల్లోనూ మారిన ప్రభుత్వాలు అక్రమ వలసలపై కఠిన వైఖరిని ఎంచుకున్నాయి. అమెరికా అధినేత డోనాల్డ్ ట్రంప్ పగ్గాలు చేపట్టిన మరుక్షణం నుంచే అక్రమ వలసదారుల ఏరివేత మొదలుపెట్టారు. వారందరినీ నిర్బంధించి చేతులకు, కాళ్లకు గొలుసులు వేసి మరీ తమ రక్షణ విమానాల్లో వెనక్కి పంపించడం మొదలుపెట్టారు. ట్రంప్ దారిలో యూకే ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపుతున్నారు. నిజానికి ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ ప్రక్రియ మొదలుపెట్టినప్పటికీ.. అమెరికా యాక్షన్ చూసిన తర్వాత తమ దేశంలో చేపడుతున్న చర్యలను మరింత వేగవంతం చేశారు.
అక్రమ వలసలు కేరాఫ్ ఇండియన్ రెస్టారెంట్స్
యూకే సహా వివిధ యూరోపియన్ దేశాల్లో భారతీయ రెస్టారెంట్లలో పనిచేస్తున్న సిబ్బందిలో అత్యధికంగా అక్రమమార్గాల్లో వచ్చినవారే ఉంటున్నారు. వాటిలో పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్ వంటి భారత ఉపఖండ దేశాలతో పాటు భారతదేశం నుంచి వెళ్తున్నవారు కూడా ఉంటున్నారు. భారతీయుల్లో స్టూడెంట్ వీసాపై వెళ్లి, చదువు పూర్తయిన తర్వాత వెనక్కి రాకుండా అక్కడే ఇలాంటి రెస్టారెంట్లు, నెయిల్ బార్లు, కన్వీనియన్స్ స్టోర్లలో పనిచేస్తున్నారు. బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్ వాసులు ఎక్కువగా రెస్టారెంట్లలో వంట సిబ్బందిగా, సర్వర్లుగా పనిచేస్తున్నారు. ఇలాంటి భారతీయ రెస్టారెంట్లు నిర్వహించే అందరూ భారతీయులే అనుకుంటే పొరపాటే. చాలా రెస్టారెంట్లను పాకిస్తాన్ నుంచి వెళ్లి అక్కడ స్థిరపడ్డవారు నిర్వహిస్తున్నారు. అలాంటి రెస్టారెంట్లలో పనిచేస్తున్న సిబ్బందిలోనే ఎక్కువ శాతం అక్రమ వలసదారులు ఉంటున్నారు. అందుకే యూకే ప్రభుత్వం ఆ దేశంలో ఉన్న భారతీయ రెస్టారెంట్లే లక్ష్యంగా ఎంచుకుని మెరుపు దాడులు చేస్తోంది. గత ఏడాదితో పోల్చితే ఈ దాడులు, తనిఖీలు 3-4 రెట్లు పెరిగాయి. అలాగే అరెస్టవుతున్న అక్రమ వలసదారుల సంఖ్య కూడా పెరిగింది.
యూకే హోంశాఖ ఆధ్వర్యం జరుగుతున్న ఈ దాడులు భారతీయ రెస్టారెంట్లు, టేక్‌అవేలు, కేఫ్‌లతో పాటు ఆహార, పానీయాల పరిశ్రమ, పొగాకు పరిశ్రమకు చెందిన ఔట్‌లెట్లపై ఎక్కువగా జరుగుతున్నాయి. ఉత్తర ఇంగ్లాండ్‌లోని హంబర్‌సైడ్‌లో ఒక భారతీయ రెస్టారెంట్‌లో నిర్వహించిన తనిఖీల అనంతరం ఏడుగురిని అరెస్టు చేయగా మరో నలుగురిని నిర్బంధించినట్టు అధికారవర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాది జనవరిలో దేశవ్యాప్తంగా మొత్తం 828 ప్రదేశాల్లో తనిఖీలు చేపట్టగా.. 609 అరెస్టులు జరిగాయని యూకే హోంశాఖ కార్యదర్శి య్వెట్టే కూపర్ వెల్లడించారు. “తమ ప్రాణాలను సైతం ఫణంగా పెడుతూ చిన్నచిన్న పడవల్లో సముద్రం దాటి మా దేశంలోకి అడుగుపెడుతున్నారు. వారంతా మా దేశ వలస చట్టాలను ఉల్లంఘించడమే కాదు, ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్నారు” అంటూ కూపర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
వ్యూహాలు చెప్పొద్దు.. అమలు చేయాలి
అమెరికా మాదిరిగా యూకే తమ వ్యూహాలను బహిర్గతం చేయకుండా నేరుగా ఆచరణలో అమలు చేసి చూపిస్తోంది. కీర్ స్టార్మర్ ప్రధాని అయ్యాక ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం అక్రమ వలసదారుల ఏరివేత చర్యలు చేపట్టారు. వారిలో మాదక ద్రవ్యాల నేరాలు, దొంగతనాలు, అత్యాచారం – హత్య వంటి నేరాలకు పాల్పడినవారు సైతం ఉన్నారు. యూకే చరిత్రలోనే తొలిసారిగా ఏకంగా 800 మందిని బెస్పోక్ చార్టర్ విమానాల్లో వెనక్కి పంపించింది. ట్రంప్ తరహాలో ఈ ఆపరేషన్‌కు సంబంధించిన వీడియో ఫుటేజిని మీడియాకు విడుదల చేస్తూ యూకే ప్రభుత్వం అక్రమవలసదారులకు ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తోంది. కరుడుగట్టిన నేరస్థులను కట్టుదిట్టమైన భద్రత నడుమ వెనక్కి పంపుతున్న దృశ్యాలు కూడా ఇందులో ఉన్నాయి. లేబర్ పార్టీ అధికారం చేపట్టినప్పటి నుంచి దాదాపు 19,000 మంది విదేశీ నేరస్థులు, అక్రమ వలసదారులను గుర్తించింది.
ఒకవైపు అక్రమవలసదారులను గుర్తించి వెనక్కి పంపడంతో పాటు మరోవైపు ఇక నుంచి కొత్తగా ఏ ఒక్కరూ అక్రమ మార్గాల్లో ఆ దేశంలోకి చొరబడకుండా నిరోధించే ప్రయత్నాలను కూడా చేపట్టింది. ఈ క్రమంలో యూకేలో మెరుగైన జీతాలు, జీవితం ఆశజూపి మనుషులను అక్రమంగా తరలిస్తున్న ముఠాల గురించి వియాత్నాం, అల్బేనియా దేశాల్లో పెద్ద ఎత్తున సోషల్ మీడియా క్యాంపేయిన్ చేపట్టింది. మరిన్ని దేశాల్లోనూ ఈ తరహాల ప్రచారాన్ని చేస్తూ.. అక్రమ వలసదారుల అసలు జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో వివరించే ప్రయత్నం చేస్తోంది.
మరోవైపు సరిహద్దు భద్రతను మరింత పటిష్టం చేయడంతో పాటు అక్రమవలసదారులపై మరింత కఠిన వైఖరి అవలంబించడం కోసం “బోర్డర్ సెక్యూరిటీ, అసైలం అండ్ ఇమ్మిగ్రేషన్ బిల్”ను పార్లమెంట్ ముందుకు తీసుకొచ్చింది. ఈ బిల్లు ద్వారా మనుషుల అక్రమ రవాణా, మాదక ద్రవ్యాలు వంటి వ్యవస్థీకృత నేర ముఠాలపై ఉక్కుపాదం మోపేందుకు ఆస్కారం ఉంటుంది. అక్రమ మార్గాల్లో యూకేలోకి ప్రవేశించే వ్యక్తుల మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకోవడానికి ఈ కొత్త చట్టం వీలు కల్పిస్తుంది. అధికారులకు అదనపు అధికారాలను కల్పిస్తుంది ఈ బిల్లు. ప్రతిపక్ష కన్జర్వేటివ్ పార్టీ ఈ బిల్లుతో కనీసం పడవలను కూడా ఆపలేమని ఎద్దేవా చేస్తోంది. అక్రమ వలసదారులపై మరింత కఠిన చర్యలు అవసరమని చెబుతోంది. “మన దేశం మన ఇల్లు లాంటిది. హోటల్ కాదు. ఎవరంటే వాళ్లు ఎప్పుడంటే అప్పుడు వచ్చి వెళ్లడానికి” అంటూ కనర్వేటివ్ పార్టీ నేతలు నినదిస్తున్నారు. మొత్తంగా అధికార, ప్రతిపక్షాలు అక్రమ వలసలపై కఠిన వైఖరి ప్రదర్శిస్తుండడంతో.. ఆ దేశంలోని ఎలాగోలా చొరబడి, ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకుని, ఇంటికి పెద్ద మొత్తంలో డబ్బులు పంపాలని ఆశపడేవారు తమ నిర్ణయాలను మార్చుకోక తప్పదని స్పష్టమవుతోంది.