మహానటి, సీతారామం లాంటి సినిమాలతో తెలుగు హీరో అయిపోయాడు దుల్కర్ సల్మాన్. ఈయన నుంచి సినిమా వస్తుందంటే చాలు కచ్చితంగా బాగుంటుందనే నమ్మకాన్ని కలిగించాడు. తాజాగా లక్కీ భాస్కర్ అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చాడు. సార్ తర్వాత వెంకీ అట్లూరి తెరకెక్కించిన సినిమా ఇది. మరి ఈ సినిమాతో దుల్కర్ తెలుగులో హ్యాట్రిక్ అందుకున్నాడా లేదా అనేది చూద్దాం..
లక్కీ భాస్కర్ సినిమా కథ అంతా 1989-92 మధ్యలో జరుగుతుంది. భాస్కర్ కుమార్ అలియాస్ దుల్కర్ సల్మాన్ ముంబయిలో మగధ అనే ప్రైవేటు బ్యాంకులో క్యాషియర్‌గా పని చేస్తుంటాడు. ఇంట్లో అతడే పెద్ద కొడుకు.. చాలా బాధ్యతలుంటాయి. దాంతో జీతం సరిపోక అప్పులు చేస్తూ ఇంటిని నెట్టుకొస్తుంటాడు. ఇంటి మీదకు అప్పుల వాళ్లు వస్తే తప్పించుకుంటూ ఉంటాడు. ఇలా భాస్కర్ జీవితం గడుస్తూ ఉంటుంది. ఆయనకు భార్య సుమతి అలియాస్ మీనాక్షి చౌదరి, ఓ చిన్న కొడుకు ఉంటాడు. బ్యాంకులో వచ్చే జీతం సరిపోక ఏవో చిన్న చిన్న పార్ట్ టైమ్ బిజినెస్లు కూడా చేస్తుంటాడు. అలాంటి భాస్కర్ జీవితంలోకి ఒకసారి ఇంపోర్ట్ అండ్ ఎక్స్‌పోర్ట్ బిజినెస్ చేసే ఆంటోనీ అలియాస్ రాంకీ వస్తాడు. తన జాబ్‌ను రిస్క్ చేసి ఆంటోనీతో కలిసి బిజినెస్ మొదలు పెడతాడు భాస్కర్. అక్కడ కోట్లు సంపాదిస్తాడు. బ్యాంకులో డబ్బుతో ఇల్లీగల్ పనులు చేస్తూనే తెలివిగా తప్పించుకుంటాడు. ఇలా సాగుతున్నపుడు సీబీఐ అధికారుల కన్ను భాస్కర్ మీద పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది.. సాధారణ బ్యాంక్ ఎంప్లాయ్ ఖాతాలోకి వందల కోట్లు ఎలా వచ్చాయి అనేది అసలు కథ.. అరె.. సినిమా అదిరిపోయిందిరా.. భలే తీసార్రా..! ఓ సినిమా లవర్‌గా ఈ మాట రాయడానికి చాలా మంది ఇష్టపడుతుంటారు. కానీ ఈ మాట చెప్పే ఛాన్స్ ఈ మధ్య కాలంలో చాలా తక్కువ సినిమాలు మాత్రమే ఇచ్చాయి. ఇప్పుడు లక్కీ భాస్కర్ రూపంలో మరో అవకాశం వచ్చింది ఈ లైన్ చెప్పడానికి! సినిమా అదిరిపోయింది.. నిజంగా అదిరిపోయింది. వెంకీ అట్లూరి డైరెక్షన్ కంటే కూడా రైటింగ్‌కు ఫిదా అయిపోతారంతా…! ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టకుండా.. కట్టి పడేసే స్క్రీన్ ప్లే రాసుకున్నాడు. బలమున్నోన్ని కొట్టొచ్చు కానీ తెలివైనోన్ని కొట్టలేం అనేది లక్కీ భాస్కర్ లైన్. బ్యాంకింగ్ రంగంలో జరిగే స్కామ్స్‌ను తెలివిగా వాడుకుని.. ఓ సామాన్యుడు అసామాన్యుడుగా ఎలా ఎదిగాడు అనేది ఈ సినిమా కథ. ఒక్కో సీన్‌ను వెంకీ అట్లూరి డిజైన్ చేసిన తీరు అద్భుతంగా వర్కవుట్ అయింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch: