ప్రకాశం జిల్లాలో విదేశీ అతిధులు సందడి చేస్తున్నాయి. జిల్లాలోని కంభం మండలం తురిమెళ్ళ గ్రామం చెరువులో యూరప్ దేశాల సంతతికి చెందిన నార్తన్ పిన్ టైజ్ పక్షులు దర్శనమిచ్చాయి. యూరప్ లో ప్రతికూల వాతావరణాన్ని తట్టుకోలేక డిసెంబర్ చివరి మాసం నుంచి మార్చి వరకు దక్షిణ భారతదేశానికి ఈ పక్షులు వలస వస్తాయని పక్షి ప్రేమికులు చెబుతున్నారు. దాదాపు 7వేల కిలోమీటర్లు ప్రయాణించి ఇవి దక్షిణ భారతదేశానికి చేరుకుంటాయి. ప్రస్తుతం స్వల్ప మొత్తంలో తురిమెళ్ళ గ్రామ చెరువులో ఈ పక్షులు సేద తీరుతున్నాయి. పగలంతా చెరువులో చేపలు వేటాడి ఆకలి తీర్చుకుంటాయి. రాత్రి వేళల్లో సమీప ప్రాంతాలలో చెట్లపై సేద తీరుతున్నాయి. ఈ పక్షులను గ్రామస్థులు ఎవరూ వేటాడరు. వేల కిలోమీటర్లు గాల్లో ఎగురుతూ తమ ప్రాంతానికి వస్తున్న ఈ విదేశీ పక్షులను గ్రామస్థులు అతిధులుగానే చూస్తారు. అతిధి మర్యాదలు చేయకపోయినా వాటి ప్రాణాలకు ముప్పు రాకుండా గ్రామస్థులు జాగ్రత్తలు తీసుకోవడం విశేషం..
Flock of Northern Pintail birds
సరిహద్దులు లేని ప్రపంచం పక్షుల సొంతం..
వలసలు వెళ్ళడం అనేది మనుషులు, జంతువులకే కాదు పక్షులకు సహజమే.. కాలంతో పాటు ప్రాణులు మనుగడ కోసం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలసలు వెళుతుంటాయి. వీటిలో పక్షుల వలసలకు ఎల్లలు ఉండవు. ఆకాశంలో ఎగురుకుంటూ కొన్ని వేల మైళ్ళ దూరం ప్రయాణం చేస్తుంటాయి. ఖండాంతర వలసలు వెళ్ళడం పక్షులకే సాధ్యం… ఇలా వలసలు వచ్చే పక్షులు తమ గమ్యస్థానాలు చేరకముందే ఆకలితో అలసిపోయిన పరిస్థితుల్లో స్టాప్‌ఓవర్ సైట్‌కు చేరుకుని సేదతీరుతుంటాయి.
అయితే రాను రాను పల్లెలు పట్టణాలుగా మారుతున్న పరిస్థితుల్లో పక్షుల స్టాప్ ఓవర్ సైట్లు తగ్గిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో పక్షులు తమ గమ్యం చేరుకోకముందే అలసిపోయి తాత్కాలిక షెల్టర్ జోన్లలో తలదాచుకుంటుంటాయి. రెగ్యులర్‌గా తమ గ్రామాలకు వచ్చే పక్షలను స్థానికులు అతిధులుగా భావించి రక్షిస్తుంటారు. అయితే కొత్త విడిది కేంద్రాల్లో బసకోసం వచ్చే పక్షులు వేటగాళ్ళకు చిక్కి ప్రాణాలు కోల్పోతుంటాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..