ప్రస్తుతం ఇప్పుడు ఏది తిన్నా గ్యాస్, మంట అంటూ అజీర్ణంతో బాధపడుతున్న వారిని చూస్తున్నాం.. ఆ రోజుల్లో ప్రకృతి ఆధారిత వ్యవసాయ విధానంతో పండించిన వివిధ రకాల వరివంగడాలు, చిరుధాన్యాలు తిని కొండల్ని సైతం పిండి చేసేవారు. ఎంతో ఔషధ గుణాలు, పోషక విలువలు ఉన్న వరి వంగడాలను పండించడం వల్ల లాభం లేదనుకుని సంకరం చేసి తయారుచేసిన తక్కువ కాలంలో పండి ఎక్కుల లాభాలు వస్తున్నాయంటూ ప్రస్తుతం మార్కెట్‌లో దొరుకుతున్న వరి వంగడాలను పండిస్తున్నారు. అయితే కరోనా తరువాత దేశవాళీ వరి వంగడాలపై జనానికి ఆశక్తి పెరిగింది. వీటిని తినడం వల్ల రకరకాల రోగాలు నయమవుతాయని పెద్దలు చెబుతుండంతో ఒక్క రకం వరి వంగడం ఒక్కో రకం పోషకాల గనిగా ఉందంటున్నారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఆదర్శ రైతు..
ఎకరా పొలంలో 60 రకాల వరి రకాలను పండిస్తున్నాడో యువ రైతు. సామాజిక మాధ్యమాల ద్వారా ఆయా రకాల గురించి తెలుసు కుంటూ మన దేశంలోని 15 రాష్ట్రాలతో పాటు అమెరికా, థాయ్‌లాండ్ దేశాల నుంచి విత్తనాలు సేకరించి సేద్యం చేస్తున్నాడు. లాభాల కోసం కాకుండా ఆరోగ్యమే ప్రధానంగా తాను చేస్తున్న ఈ సాగును చూసి తొలుత గ్రామస్తులు హేళన చేసినా ఆరేళ్ళుగా చేస్తున్న తన సేంద్రీయ వ్యవసాయంపై ప్రస్తుతం స్థానిక రైతులు విపరీతమైన ఆశక్తి చూపిస్తున్నారు. అవసరమైన రైతులకు విత్తనాలు అందించడమే కాకుండా సాగు మెళకువలుగా కూడా నేర్పిస్తూ ఆదర్శరైతుగా మారాడు.
పాకల.. వరి వంగడాల ప్రయోగశాల
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకల గ్రామానికి ఇప్పుడు దేశీయవరి వంగడాలకు సంబంధించి ఓ గుర్తింపు వచ్చింది. గ్రామానిక చెందిన షేక్ సుభాని వివిధ రకాల వరి వంగడాలను సాగుచేస్తూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. పదో తరగతి వరకు చదువుకున్న ఆయనకు. ఆరోగ్యాన్ని ఇచ్చే వరి రకాలను పండించడమంటే ఆసక్తి. గూగుల్, యూట్యూబ్ లాంటి సామాజిక మధ్యామాలద్వారా రకరకాల వరి వంగడాల గురించి తెలుసు కుంటూ.. విత్తనాలు సేకరించి సాగుచేస్తున్నారు. గత ఆరేళ్లుగా సేంద్రీయ పద్దతిలో దేశీ, విదేశీ వరి విత్తనాలను సేకరించి వినూత్న పద్దతిలో వ్యవసాయం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ యువరైతు తనకున్న 1.20 ఎకరాల పొలంలో 60 రకాల వరి వంగడాలను పండిస్తున్నారు. వీటిలో రత్నచోడి, దత్వాన్, మాండియా మాంజా, నవారా, మురినీ ఖైమా, కిన్నార్, తులాయిపాజ్, బహుముఖి, బంగారు గులాబీ తదితర వంగడాలు ఉన్నాయి. మన దేశంలోని 15 రాష్ట్రాలతో పాటు అమెరికా, థాయ్‌లాండ్ వంటి దేశాల నుంచి విత్తనాలను సేకరిస్తున్నారు. పూర్తిగా ప్రకృతి విధానంలోనే సేద్యం చేయడం విశేషం.
ప్రకృతి వ్యవసాయానికి, జీవ వైవిధ్యానికి భారతదేశం పెట్టింది పేరు. ఇక్కడి నేలల్లో ఒకప్పుడు వేలాది రకాల వరి విత్తనాలు సాగులో ఉండేవి. నేల స్వభావం, భౌగోళిక స్వరూపం, నీటివసతి, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా వివిధరకాల వరి వంగడాలను పండించేవారు. అయితే దేశవాళీ వరి విత్తనాల దిగుబడి తక్కువగా ఉంటుండటం, భారీగా పెరుగుతున్న జనాభా ఆహార అవసరాలు తీర్చేందుకు తప్పనిసరిగా ఉత్పత్తి పెంచాల్సిన పరిస్థితులు ఏర్పడటంతో విత్తనాలను సంకరం చేసి తక్కువ కాలంలో పండే వరి వంగడాలను తయారు చేసి సాగు చేయడం ప్రారంభించారు. ఈ పంటల సాగు కోసం రసాయనాలు, పురుగుల మందులు వాడటం వల్ల నాణ్యమైన పంట లేకుండా పోయింది. అధిక దిగుబడితో పాటు పంటకాలం తక్కువగా ఉండే వరి రకాలను పండిచడం ద్వారా లాభాలు వస్తున్నాయన ఆలోచనలతో రైతులు సాంప్రదాయ వరి వంగడాలకు గుడ్‌బై చెప్పి కొత్తరకాల వైపు మళ్ళారు. అధిక దిగుబడి ఇచ్చే లాభదాయక వరి విత్తనాలు అందుబాటులోకి రావడంతో రైతులు వాటివైపు మొగ్గచూపడం ప్రారంభించారు. దీంతో క్రమంగా దేశవాళీ వరి సాగు తగ్గుతూ రావడం ప్రారంభమైంది. చివరకు సాగుచేసేవారులేక వేలాది రకాలు అంతరించిపోయే పరిస్థితి వచ్చింది.
అయితే కొన్ని ప్రాంతాల్లో ఇంకా సాగులో ఉన్న సాంప్రదాయ వరి వంగడాలను ఇంకా సాగు చేస్తూనే ఉన్నారు. వాటిలో ఉన్న ఔషధ గుణాలు, పోషక విలువలు గుర్తించిన కొంతమంది కొన్ని రకాల వరి వంగడాలకు తిరిగి జీవం పోస్తున్నారు. ఇది సత్ఫలితాలనిచ్చి ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొన్ని దేశీయ రకాలు తిరిగి సాగులోకి తీసుకొస్తున్నారు. అలాంటి వారిలో ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకలకు చెందిన యువరైతు షేక్ సుభాని ఒకరు. ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో కొన్ని దేశవాళీ రకాలను విజయవంతంగా సాగుచేస్తూ 60 నుంచి 80 రకాల వరి వంగడాలను తన ఎకరా పొలంలో ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్నారు. నేటి రైతులు ఏనాడో మరిచిపోయిన దేశవాళీ వరి రకాలను సంరక్షించటం, అందులోని పోషకాలను నేటి తరానికి అందించాలనేది సుభాని ఆశయంగా ఉందంటున్నారు. ప్రకృతి ఆధారిత వ్యవసాయ పద్ధతులతో తీసిన విత్తనాలను దేశంలోని 15 రాష్ట్రాల నుంచే కాకుండా అమెరికా, ధాయ్‌లాండ్ దేశాల నుంచి కూడా విత్తనాలను సేకరించి సాగు చేస్తున్నట్టు సుభాని చెబుతున్నారు.
పెళ్ళి కొడుకు బియ్యం
పాకల గ్రామంలో తనకున్న కేవలం ఎకరా పొలంలోనే సాగుచేసిన వరి రకాల్లో బీపీటీ తరహాలోనే రోజువారీ ఆహార వినియోగానికి తగినట్టుండే ‘రత్నచోళి’. అధిక పోషకాలు ఉండే సారంగనలి, దాసమతి, నెల్లూరు మొలకొలుకులు, బహురూపి, చినుకుమిని, కుంకుమసాలి తదితర ప్రముఖ దేశవాళీ రకాలున్నాయి. అలాగే తులసి బాసో, ఇంద్రాయణి, కాలాబట్టి, మాపిళైసాంబ రకాలు ఉన్నాయి. వీటిలో మాపిళ్లై సాంబ రకం వరికి మంచి పోషక విలువలతో పాటు ఆదరణ కూడా బాగానే ఉంటుంది. ఈ బియ్యాన్ని పెళ్ళికొడుకు బియ్యంగా పిలుస్తారు. కొత్తగా పెళ్ళయిన దంపతులకు ఇవ్వడం గతంలో ఆచారంగా ఉండేది. ఎరుపు రంగులో ఉండే ఈ బియ్యం తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా కండపుష్టి, ధాతుపుష్టి, వీర్యవృద్ధి కలుగుతుందని చెబుతారు. తమిళనాడులోని తిరవణ్ణామలై ప్రాంతం ఈ విత్తనాలకు మూలకేంద్రంగా ఉంది. నాగపట్టణం, తిరుచ్చురాపల్లి, తంజావూర్ జిల్లాల్లో రైతులు కొంతమేరకు ఈ సాగుచేస్తూ వస్తున్నారని, ప్రస్తుతం మన రాష్ట్రంలో కూడా అక్కడక్కడ సాగు చేస్తున్నట్టు తెలుసుకుని తాను కూడా సేకరించి సాగు చేస్తున్నట్టు యువరైతు సుభాని చెబుతున్నారు.
పోత్సహిస్తున్న వ్యవసాయశాఖ అధికారులు..
ప్రస్తుతం పాకల గ్రామంలో యువ రైతు సుభాని చేస్తున్న వివిధ రకాల దేశవాఠీ వరి వంగడాల సేద్యం గురించి తెలుసుకున్న వ్యవసాయశాఖ అధికారులు అతడ్ని ప్రోత్సహిస్తున్నారు. వారానికి ఒకసారి సుభాని పొలానికి వచ్చి వరి వంగడాలను పరిశీలిస్తున్నారు. సుభాని లాగే ఇతర రైతులు కూడా దేశవాళీ వరి వంగడాలను తమ పొలంలో కనీసం పావువంతైనా సాగు చేయాలని పాకల అగ్రికల్చర్ అసిస్టెంట్ కిషోర్ సూచిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి