మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్ 2025లో భారత జట్టు ఘన విజయం సాధించింది. మలేషియాలో జరిగిన ఈ మెగా టోర్నమెంట్‌లో ఫైనల్లో సౌతాఫ్రికాను 9 వికెట్ల తేడాతో ఓడించి వరుసగా రెండోసారి ఛాంపియన్‌గా నిలిచింది. ఈ విజయంలో తెలంగాణ బిడ్డ గొంగడి త్రిష కీలక పాత్ర పోషించింది.
త్రిష అద్భుత బ్యాటింగ్‌తో పాటు, అసాధారణ బౌలింగ్ ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఫైనల్లోనూ 44 నాటౌట్ (33 బంతుల్లో 8 ఫోర్లు) చేసి, 3 కీలక వికెట్లు తీసి “ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్” గా ఎంపికైంది. టోర్నమెంట్ మొత్తం ఆమె 77.25 సగటుతో 309 పరుగులు చేసి, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గౌరవాన్ని అందుకుంది.
ICC టోర్నమెంట్ బెస్ట్ టీమ్‌లో గొంగడి త్రిష
అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లతో ఐసీసీ ప్రకటించిన “టోర్నమెంట్ బెస్ట్ టీమ్” లో గొంగడి త్రిష తో పాటు నలుగురు భారత క్రీడాకారిణులు స్థానం సంపాదించారు.
ఈ జట్టులో భారతదేశానికి చెందిన ఆటగాళ్లలో, గొంగడి త్రిష (309 పరుగులు, 7 వికెట్లు), జి కమలిని (143 పరుగులు), ఆయుషి శుక్లా (14 వికెట్లు), వైష్ణవి శర్మ (17 వికెట్లు) ఉన్నారు. ఈ జట్టుకు సౌతాఫ్రికా క్రికెటర్ కైలా రేనెకే (11 వికెట్లు) కెప్టెన్‌గా ఎంపికైంది.
టోర్నమెంట్‌లో త్రిష అద్భుత ప్రదర్శన కనబరిచింది. 309 పరుగులతో టోర్నమెంట్ టాపర్ గా నిలిచింది. ఒక అజేయ శతకంతో పాటూ, ఫైనల్లో 44* పరుగులతో జట్టును గెలిపించిన ఘనత తనది. ఇటు బౌలింగ్‌లో కూడా టోర్నమెంట్ మొత్తంలో 7 వికెట్లు తీసుకున్న త్రిష కేవలం ఫైనల్లో 3 కీలక వికెట్లు పడగొట్టింది. ఫలితంగా ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్,ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ (ఫైనల్), తో పాటూ ICC టోర్నమెంట్ బెస్ట్ టీమ్‌లో కూడా ఎంపిక అయ్యింది.
ICC ప్రకటించిన U19 బెస్ట్ టీమ్
గొంగడి త్రిష (భారతదేశం), జెమ్మా బోథా (దక్షిణాఫ్రికా), డేవినా పెర్రిన్ (ఇంగ్లండ్), జి కమలిని (భారతదేశం), కావోయిమ్‌హే బ్రే (ఆస్ట్రేలియా), పూజ మహతో (నేపాల్), కైలా రేనెకే (కెప్టెన్) (దక్షిణాఫ్రికా), కేటీ జోన్స్ (వికెట్ కీపర్) (ఇంగ్లండ్), ఆయుషి శుక్లా (భారతదేశం), చమోడి ప్రబోద (శ్రీలంక), వైష్ణవి శర్మ (భారతదేశం), నాబిసెంగ్ నిని (దక్షిణాఫ్రికా)
తెలంగాణ నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన గొంగడి త్రిష, భారత మహిళల క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తన అద్భుత ప్రదర్శనతో దేశాన్ని గర్వపడేలా చేసిన త్రిష భవిష్యత్తులో భారత మహిళల క్రికెట్‌కు మరింత గొప్ప కీర్తి తెచ్చిపెడుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..