ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజకీయాలు అనుహ్యంగా మలుపు తిరుగుతున్నాయి. గతంలో అధికారంలో ఉన్న వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా చేజారుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల రాజ్యసభ ఎంపీ పదవితోపాటు రాజకీయాల నుంచి తప్పుకున్న వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి మరోసారి హాట్ టాపిక్‌గా మారారు. వైసీపీకి ఆయన గుడ్ బై చెప్పేయడంపై ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై విజయసాయిరెడ్డి ఘాటుగా స్పందించారు. సోషల్ మీడదియా ఎక్స్ వేదికగా గట్టి కౌంటర్ ఇచ్చారు. ముఖ్యంగా తన క్యారెక్టర్‌పై వైఎస్ జగన్ చేసిన కామెంట్స్‌కు సాయిరెడ్డి ఇచ్చిన రిప్లై సంచలనంగా మారింది.
వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్న వాడిని కాబట్టే, ఎవరికి ఎలాంటి ప్రలోభాలకి లొంగలేదన్నారు విజయసాయిరెడ్డి. భయం అనేది తనలో ఏ అణువు అణువు లోను లేదన్నారు. కాబట్టే రాజ్యసభ పదవిని, పార్టీ పదవుల్ని మరి రాజకీయాలనే వదులుకున్నానని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.
వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్న వాడిని కాబట్టే, ఎవరికి ఎలాంటి ప్రలోభాలకి లొంగలేదు. భయం అనేది నాలో ఏ అణువు అణువు లోను లేదు కాబట్టే రాజ్యసభ పదవిని, పార్టీ పదవుల్ని మరి రాజకీయాలనే వదులుకున్నా.
— Vijayasai Reddy V (@VSReddy_MP) February 7, 2025
వైసీపీ అధినేత వైఎస్ జగన్ గురువారం(ఫిబ్రవరి 6) మీడియాతో మాట్లాడుతూ.. పార్టీకి వరుసగా గుడ్ బై చెబుతున్న నేతల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. సాయిరెడ్డి కావచ్చు.. వెళ్లిపోయిన ఇతర నేతలు కావచ్చు, వెళ్లబోయే వాళ్లు కావచ్చు, ఎవరికైనా వ్యక్తిత్వం ముఖ్యమని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బెదిరింపులు, ప్రలోభాలు కామన్‌గా ఉంటాయని వాటికి నిలబడిన వాళ్లనే ప్రజలు గుర్తు పెట్టుకుంటారని వైఎస్ జగన్ అన్నారు. ప్రత్యర్థి పార్టీల బెదరింపులకు భయపడి వెళ్లిపోయిన వాళ్లను జనం పట్టించుకోరని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పడు ఓపిక అవసరమన్నారు. పార్టీలు మారే వారికి గౌరవం ఉండదని జగన్ అన్నారు. క్యారెక్టర్, క్రెడిబిలిటీ ఉండాలని ఆయన పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా విజయసాయిరెడ్డి ఘాటుగా స్పందించారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఓ పోస్టు షేర్ చేసిన సాయిరెడ్డి.. ఎక్కడా జగన్ పేరెత్తకుండానే చెప్పాల్సింది సూటిగా చెప్పేశారు. వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్న వాడిని కాబట్టే, ఎవరికి ఎలాంటి ప్రలోభాలకి లొంగలేదన్నారు. ఇదిలావుంటే, విజయసాయిరెడ్డి కంటే ముందే వైసీపీకి, రాజ్యసభ పదవికి రాజీనామా చేసిన మోపిదేవి వెంకటరమణ కూడా ఇలాగే రియాక్ట్ అయ్యారు. జగన్ ప్రెస్‌మీట్‌లో తమపై జగన్ వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. తాను ప్రలోభాలు, ఒత్తిళ్లకు లొంగే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు. అలా లొంగే వ్యక్తినే అయితే తనపై కేసులు ఉండేవి కాదని గుర్తు చేసుకున్నారు. ఈ విషయాలన్నీ జగన్‌కి కూడా తెలుసన్నారు. తాము ఎందుకు పార్టీని వీడాల్సి వచ్చింది.. అప్పుడే వివరంగా చెప్పామని మోపిదేవి స్పష్టం చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..