చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పసికందు మృతి నిప్పులాంటి నిజాన్ని బయట పెట్టింది. ఆసుపత్రికి తీసుకొచ్చేలోపే మృతి చెందిన పసికందు వ్యవహారంలో కన్న తల్లి ప్రధాన నిందితురాలైంది. నాటకీయ పరిణామాలను ఛేదించిన చిత్తూరు 2 టౌన్ పోలీసులు ఈ వ్యవహారాన్ని బయట పెట్టగా.. కేసులో ప్రధాన నిందితురాలు గుణ సుందరితో పాటు మరో 5 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని కాట్పాడికి చెందిన గుణసుందరికి ఇద్దరు పిల్లలున్నారు. 17 ఏళ్ల కూతురు, 12 ఏళ్ల కొడుకు ఉన్నారు. 20 రోజుల క్రితం భర్త ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. అయితే అప్పటికే గర్భం దాల్చిన గుణసుందరికి.. నిన్న పురిటి నొప్పులు రావడం, ఇలాంటి సమయంలో ప్రసవం విషయం బయట పడకుండా చేసే ప్రయత్నం జరిగింది. ఇందులో భాగంగానే సోదరి సుమతి, స్నేహితురాలు నళిని, అఖిలతో కలిసి ప్లాన్ చేసింది గుణసుందరి. చిత్తూరులోని నళిని ఇంటికి వచ్చిన గుణసుందరి.. అక్కడే మగ బిడ్డకు జన్మనిచ్చింది. ప్రసవించిన మగ బిడ్డను ఎవరికైనా ఇచ్చేందుకు గుణసుందరి, ఆమె సోదరి సుమతి, స్నేహితురాలు అఖిల, నళినిలు సత్యవేడుకు చెందిన గోపి అనే వ్యక్తితో సంప్రదింపులు జరిపారు. ఇందులో భాగంగానే తిరుపతికి చెందిన సుజాత అనే అంగన్వాడీ టీచర్‌తో మాట్లాడింది. తిరుపతి నుంచి బస్‌లో వస్తున్న సుజాతకు బిడ్డను చూపించే ప్రయత్నం చేశారు.
పసిబిడ్డను గుడ్డలో చుట్టి చిత్తూరు ఆర్టీసీ బస్టాండ్‌కు తీసుకొచ్చింది. అయితే పసికందును తీసుకుని రావడంలో నిర్లక్ష్యం చేయడాన్ని తప్పు పట్టిన సుజాత ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించింది. పసిబిడ్డను జాగ్రత్తగా తీసుకుని రాలేకపోవడంతో శిశువు ఆరోగ్య పరిస్థితి విషమించినట్లు గుర్తించారు. ఈ మేరకు దగ్గరలోనే ఉన్న ప్రైవేటు ఆసుపత్రికి, అక్కడి నుంచి చిత్తూరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే శిశువు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించడంతో.. శిశువును అక్కడే వదిలి వెళ్లే ప్రయత్నం చేసారు తల్లి సుందరి, ఆమె వెంట వచ్చిన మహిళలు. పసి కందును ఆసుపత్రికి తెచ్చిన వారిపై అనుమానం వచ్చిన ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అసలు కథ వెలుగు చూసింది. గుణసుందరితో పాటు మిగతా వారిని అదుపులో తీసుకున్న పోలీసులు అసలు డ్రామాను బయట పెట్టారు. సుందరితో పాటు నళిని, సుమతి, అఖిల, గోపిలను అరెస్ట్ చేశారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి