తురకా కిషోర్.. గత మున్సిపల్ ఎన్నికల సమయంలో రాష్ట్రవ్యాప్తంగా మారుమ్రోగిన పేరు.. మాచర్ల నియోజకవర్గంలో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించేందుకు వెళ్లిన టీడీపీ నాయకుల కారుపై పెద్ద కర్రతో దాడి చేసిన సంచలనం సృష్టించిన వ్యక్తి తురకా కిషోర్. వైసీపీకి చెందిన తురకా కిషోర్ ఆ తర్వాత మాచర్ల మున్సిపల్ ఛైర్మన్ కూడా అయ్యాడు. గత ఎన్నికల సమయంలోనూ అల్లర్లకు పాల్పడిన తురకా కిషోర్, అతడి తమ్ముడిపై మాచర్ల పిఎస్ పరిధిలో అనేక కేసులున్నాయి. అయితే ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతోనే తురకా కిషోర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అతని కోసం పోలీసులు అనేక చోట్ల గాలింపు చేపట్టారు. అయినా ఆచూకీ దొరకలేదు. ఆరు నెలల పాటు పోలీసులకు దొరకకుండా తప్పించుకున్నాడు. చివరికి విదేశాలకు పారిపోయినట్లు ప్రచారం కూడా జరిగింది. మరొకవైపు తురకా కిషోర్‌ను పట్టుకోలేకపోవడంతో పోలీసులపై ఒత్తిడి కూడా పెరిగింది.
దీంతో తురకా కిషోర్ ఆచూకీ కోసం పోలీసులు ప్రత్యేక దృష్టిపెట్టారు. అయితే అజ్ఞాతంలోకి వెళ్లిన వెంటనే ఫోన్ నంబర్‌ను మార్చేశాడు. తెలిసిన వాళ్లెవరితోనూ మాట్లాడటం మానేశాడు. దీంతో అతని ఆచూకీ తెలుసుకోవడం మరింత కష్టంగా మారింది. అయితే హైదరాబాద్‌లోని మల్కాజ్‌గిరి ప్రాంతంలో ఉన్న జైపురి కాలనీలో ఉంటున్నట్లు పోలీసులు ఎట్టకేలకు గుర్తించారు. గత ఏడాది డిసెంబర్‌లో పోలీసులు రైడ్ చేసి తురకా కిషోర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కోర్టులో ప్రవేశపెట్టగా కోర్టు రిమాండ్ విధించింది. ప్రస్తుతం కిషోర్ జైల్లో ఉన్నాడు.
ఎలా పట్టుకున్నారంటే..
కిషోర్ ఫోన్ నెంబర్ మార్చేయడంతో అతన్ని పట్టుకునేందుకు అతని బ్యాంక్ ఖాతాలపై దృష్టిపెట్టారు. ఈ క్రమంలోనే ఫోన్ నెంబర్ మార్చేసినా.. ఫోన్ పే వాడుతున్నట్లు గుర్తించారు. జైపురి కాలనీలోని ఒక చికెన్ షాపులో ఆ ఫోన్ పే ద్వారా చెల్లింపులు చేస్తున్నట్లు సమాచారం సేకరించారు. తరుచుగా అదే షాపులో చికెన్ కొంటున్నట్లు తేల్చిన తర్వాత ఒక నిఘా టీంను హైదరాబాద్ పంపించారు. కిషోర్ కదలికలను తెలుసుకున్న తర్వాత ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అరెస్ట్ చేశారు. ఆరునెలల పాటు ముప్పతిప్పలు పెట్టిన కిషోర్ ఆచూకీ చివరికి కోడి మాంసం పట్టించింది.
ఇవి కూడా చదవండి
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి