మరోసారి గెలిచి అధికారాన్ని నెలబెట్టుకోవాలన్న ‘ఆప్’ ఆశలపై నీళ్లు జల్లారు..ఢిల్లీ ఓటర్లు. 27 ఏళ్ల తర్వాత హస్తిన గడ్డపై కాషాయ జెండా రెపరెపలాడింది. కమలదళం హోరులో..ఆప్ అధినేత కేజ్రీవాల్ సహా పలువురు పార్టీ పెద్దలూ కొట్టుకుపోయారు. అయితే అప్పుడే అయిపోలేదు..ఇప్పుడే అసలు కథ మొదలయింది అంటోంది కమలం పార్టీ. ఇంతకూ ఢిల్లీలో బీజేపీ వ్యూహం ఏంటి..? కేజ్రీవాల్‌కు బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయినట్టేనా..?
సీఎంగా ఉండగానే ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు..కేజ్రీవాల్. లిక్కర్ స్కామ్‌లో కేజ్రీవాల్ జైలుకు కూడా వెళ్లొచ్చారు. అయితే ఇప్పుడు బీజేపీ గెలుపుతో కేజ్రీవాల్‌కు మరిన్ని ఇబ్బందులు తప్పేలా లేవు. ఆప్ హయాంలో జరిగిన అవినీతి కార్యక్రమాలపై బీజేపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టే అవకాశం కనిపిస్తోంది. ఈ మేరకు కీలక ఫైళ్లు, రికార్డులు మాయం కాకుండా సచివాలయాన్ని సీజ్ చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు..ఎల్జీ వీకే సక్సేనా. లిక్కర్ కేసులతో పాటు ఇతర కేసులపై కూడా కేంద్ర దర్యాప్తు సంస్థలు మరింత దూకుడుగా వ్యవహరించే అవకాశముంది.
లిక్కర్ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొన్న అరవింద్ కేజ్రీవాల్‌ను..గత ఏడాది ఎన్‌ఫోర్స్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. అయితే సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి విడుదలయ్యారు..కేజ్రీవాల్. ఇప్పటికీ లిక్కర్ కేసులో ఆయన నిందితుడిగానే ఉన్నారు. కాబట్టి ఆయన మళ్లీ ఎప్పుడైనా అరెస్టు కావొచ్చనే ప్రచారం నడుస్తోంది. ఇక కేంద్రంలో, ఢిల్లీలో బీజేపీదే అధికారం కాబట్టి ఆయన్ని ఈ కేసులో మరింత ఇబ్బంది పెట్టే అవకాశాలున్నాయి. ఢిల్లీ వాటర్ స్కామ్, ఇతర కుంభకోణాలపై కూడా అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. దీంతో కేజ్రీవాల్‌పై మరిన్ని కొత్త కేసులు నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. కాగ్ నివేదికను మొదటి అసెంబ్లీ సమావేశంలోనే ప్రవేశపెడతామని ఇప్పటికే ప్రకటించారు..ప్రధాని మోదీ. ప్రజాధనాన్ని దోచుకున్నవాళ్లు తప్పించుకోలేరని స్పష్టం చేశారు.
తాను జైలుకు వెళ్లినప్పుడు సీఎంపగ్గాలు ఆతిశికి అప్పగించారు..కేజ్రీవాల్. ఇప్పుడు పార్టీ పరాజయానికి ఎలా బాధ్యత వహిస్తారనేది ఆసక్తికరంగా మారింది. పార్టీ పగ్గాలు ఎవరికైనా అప్పగిస్తారా లేక తానే కొనసాగుతారా అనేది ఆసక్తికరంగా మారింది. ఇక పార్టీ ఏర్పాటయిన తర్వాత.. తొలిసారి ప్రతిపక్ష పాత్ర పోషించబోతోంది..ఆప్. అయితే కీలక నేతలైన కేజ్రీవాల్, మనీష్ సిసోడియా ఓడిపోవడం పార్టీకి ఇబ్బందికరంగా మారింది. మరోవైపు బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్‌ను తట్టుకుంటూ.. తమ పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోవడం కేజ్రీవాల్‌కు పెద్ద సవాలు కానుంది.
అవినీతి వ్యతిరేక పోరాటంతో రాజకీయాల్లోకి వచ్చిన కేజ్రీవాల్.. అధికారం చేపట్టాక సంప్రదాయక పొలిటిషియన్‌గా మారిపోయారన్న విమర్శలు వినిపించాయి. సామాన్యుడిని అని చెప్పుకునే కేజ్రీవాల్.. ‘శీష్‌మహల్’ కట్టుకున్నారన్న విమర్శలు ఎన్నికల ప్రచారంలో బలంగా వినిపించాయి. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ పూర్వ వైభవాన్ని తిరిగి పొందడానికి ఆయన ఎలా మారతారనేది ఆసక్తికరంగా మారింది. ఢిల్లీ దన్నుతో పంజాబ్‌లో కూడా అధికారంలోకి వచ్చింది..ఆమ్ ఆద్మీ పార్టీ. తాజా ఓటమితో పంజాబ్‌లో కూడా ఆ పార్టీకి ఇబ్బందులు తప్పేలా లేవు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..