ఇండోర్, జనవరి 24: గుడి మెట్ల వద్ద కూర్చుని బిచ్చమెత్తుకుంటున్న యాచకురానికి బిక్షం వేసినందుకు ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. యాచకులు లేని నగరంగా తీర్చిదిద్దేందుకు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే ఇండోర్‌లో భిక్షాటనను నిషేధించారు. అక్కడి యాచకులకు సాయం చేస్తే వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో గురువారం ఓ గుడి ఎదుట బిచ్చగత్తెకు డబ్బులు ఇస్తున్న వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఖాండ్వా రోడ్‌లోని గుడి ముందు కూర్చున్న మహిళా యాచకురాలికి డబ్బు ఇస్తున్న గుర్తు తెలియని వ్యక్తిపై అధికారులు భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 223 ప్రకారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నేరం రుజువైతే అతడికి ఏడాదిపాటు జైలు శిక్ష కూడా పడే అవకాశముంది. లేదా రూ.5 వేల వరకు జరిమానా లేదా రెండూ విధించే అవకాశం కూడా ఉంది.
యాచకులు లేని నగరాలను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చొరవతో దేశంలోని 10 నగరాల్లో పైలట్ ప్రాజెక్టు చేపట్టింది. హైదరాబాద్‌తో సహా.. ఇండోర్, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై వంటి పలు నగరాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఇందులో భాగంగా ఇండోర్‌ను దేశంలోనే మొదటి బిచ్చగాళ్ల రహిత నగరంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్న అధికారులు భిక్షను స్వీకరించడం, భిక్ష ఇవ్వడం, బిచ్చగాళ్ల నుంచి ఎలాంటి వస్తువులు కొనకుండా నిషేధం విధించారు. ఈ నిషేధాన్ని ఉల్లంఘిస్తే కేసు నమోదు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాకుండా భిక్షాటన చేసేవారి సమాచారం ఇచ్చిన వారికి రూ.1,000 రివార్డును కూడా ప్రభుత్వం ప్రకటించింది.
నిజానికి భిక్షాటన చేసేవారిలో కొందరికి పక్కా ఇళ్లు ఉన్నాయని, మరికొందరి పిల్లలు ఉద్యోగాలు కూడా చేస్తున్నట్లు అధికారుల దర్యాప్తులో తేలింది. ఇలాంటి వాళ్లు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ముఠాలుగా ఇక్కడకు వచ్చి స్థానికులను యాచక వృత్తిలో దించుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో అక్కడి అధికార యంత్రాంగం చర్యలకు ఉపక్రమించింది.
ఇవి కూడా చదవండి
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.