న్యూఢిల్లీ, జనవరి 24: ఆదివారం జరిగే 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఈ క్రమంలో ఆయన గురువారం రాత్రికి భారత్‌కి వచ్చారు. ఇండోనేషియా దేశాధినేత భారత్ పర్యటనకు రావడం ఇదే తొలిసారి. ఇతర అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా సుబియాంటో ముఖ్య అతిథిగా గణతంత్ర దినోత్సవ వేడులకల్లో హాజరుకానున్నారు. ఇండోనేషియా అధ్యక్షుడి సుబియాంటోకి కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి పబిత్రా మార్గెరిటా విమానాశ్రయంలో స్వాగతం పలికారు. మొదటి పర్యటనలో భాగంగా న్యూ ఢిల్లీకి చేరుకున్నందుకు సుబియాంటోకి హృదయపూర్వక స్వాగతం అంటూ MEA ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ఈ పర్యటన భారత్-ఇండోనేషియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని ఆయన అన్నారు.
మొత్తం మూడు రోజుల పర్యటనతో సుబియానాటో.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖర్, ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌లతో వరుస సమావేశాలను నిర్వహించనున్నారు. రెండు దేశాలు రాజకీయాలు, రక్షణ, భద్రత, వాణిజ్యంతో సహా పలు రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని సమీక్షించుకోనేందుక పలు కీలక ఒప్పందాలను కుదుర్చుకోవాలని భావిస్తున్నారు. రెండు దేశాల మధ్య అవగాహన ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. అంతేకాకుండా సుబియాంటో పర్యటన సందర్భంగా 3వ సీఈవో ఫోరమ్ కూడా జరగనుంది.
ఇక సుబియాంటో.. భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరైన నాల్గవ ఇండోనేషియా అధ్యక్షుడు. 1950లో జరిగిన భారత తొలి గణతంత్ర వేడుకలకు ఇండోనేషియా తొలి అధ్యక్షుడు సుకర్ణో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇండోనేషియా నుండి 352 మంది సభ్యులతో కూడిన కవాతు, బ్యాండ్ బృందం ఇక్కడ జరిగే గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో పాల్గొననుంది. ఇండోనేషియా కవాతు, బ్యాండ్ బృందం విదేశాల్లో జాతీయ దినోత్సవ పరేడ్‌లో పాల్గొనడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ప్రధాని మోదీ 2018లో ఇండోనేషియాకు వెళ్లారు. ఆ సమయంలో భారత్-ఇండోనేషియా సంబంధాలు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి చేరుకున్నాయి .
ఇవి కూడా చదవండి
జనవరి 24న సాయంత్రం 4:00 గంటలకు తాజ్ మహల్ హోటల్‌లో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌తో భేటీ. జనవరి 25న, ఉదయం 10:00 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో ఉత్సవ రిసెప్షన్‌లో పాల్గొంటారు. ఆ తర్వాత రాజ్‌ఘాట్‌లో పుష్పగుచ్ఛం ఉంచుతారు. అదే రోజు మధ్యాహ్నం 12:00 గంటలకు హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని నరేంద్ర మోదీతో ఆయన సమావేశం కానున్నారు. ఇందులో అవగాహన ఒప్పందాలు (ఎంవోయూలు), పత్రికా ప్రకటనలు ఉంటాయి. సాయంత్రం 4:00 గంటలకు తాజ్ మహల్ హోటల్‌లో ఉపాధ్యక్షుడు జగదీప్ ధన్‌ఖర్‌తో సమావేశమవుతారు. రాత్రి 7:00 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అవుతారు. జనవరి 26న గణతంత్ర దినోత్సవ పరేడ్‌కు ముఖ్య అతిథిగా హాజరవుతారు. మధ్యాహ్నం తర్వాత రాష్ట్రపతి భవన్‌లో అధ్యక్షుడు ముర్ము ఏర్పాటు చేసిన ‘ఎట్ హోమ్’ రిసెప్షన్‌లో పాల్గొంటారు. సాయంత్రం 5:30 గంటలకు ఆయన ఇండోనేషియాకు తిరిగి బయలుదేరతారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.