Chandrababu: భువనేశ్వరి, బ్రాహ్మణి సంపాదిస్తుంటే.. నేను, లోకేష్ రాజకీయాలు చేస్తున్నాం..

3 hours ago 1

ఎవరు ఏ రంగంలో రాణించాలన్నా ఆర్థికంగా ఇబ్బందులు ఉండకూడదు. రాజకీయాల్లో ఉండి డబ్బులు సంపాదిస్తే ఎప్పటికీ గౌరవం రాదు. కుటుంబం రాజకీయాలపై ఆధారపడకూడదని ఒకటి రెండుసార్లు విఫలం అయినా హెరిటేజ్ స్థాపించి గౌరవంగా ఉన్నాం. నేను రాజకీయం చేస్తే నా సతీమణి వ్యాపారం చూస్తుంది. లోకేష్ కూడా రాజకీయాలు చేస్తుంటే బ్రాహ్మణి వ్యాపారాలు చూస్తున్నారంటూ జ్యూరిచ్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సీఎం. నిత్యస్ఫూర్తినిచ్చే తెలుగు జాతిలో పుట్టడం నా అదృష్టంగా భావిస్తున్నా. మళ్లీ జన్మంటూ ఉంటే తెలుగుబిడ్డగానే పుడతా. నేనెక్కడున్నా నా మనసు తెలుగు జాతి కోసమే తపనపడుతుంది’ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు దావోస్ వెళ్లిన సీఎం చంద్రబాబు నాయుడు జ్యూరిచ్‌లో తెలుగు కమ్యూనిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్‌లో పాల్గొన్నారు. అనంతరం వారిని ఉద్దేశించి ప్రసంగించారు.

మనవాళ్లకే అవకాశాలెక్కువ

‘రాజకీయాల్లోకి వచ్చేందుకు యువతను ఎక్కువగా ప్రోత్సహించా. ఏ దేశమైనా యువత వల్లే అభివృద్ధి చెందుతుంది. యూరప్ లోని 12 దేశాల నుంచి ఈ సమావేశానికి మీరంతా వచ్చారు. గతంలో నేను ఇక్కడి ఎయిర్ పోర్టుకు వస్తే ఎవరూ ఉండేవారు కాదు. ఒకప్పుడు యూరప్‌లో తెలుగువారు ఉండేవారు కాదు. మన వాళ్లు చాలా తెలివైన వాళ్లు… ఎక్కడ అవకాశాలు అంటే అక్కడికి వెళ్తారు. ఊహించని అవకాశాలు భారతీయులకు వస్తాయి… అందులో తెలుగువారు అగ్రస్థానంలో ఉంటారు. యూరప్ మొత్తం వయసు సమస్యతో ఇబ్బంది పడుతోంది. ప్రపంచంలో మన వాళ్లకు ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి. ప్రపంచంలో ఎన్నిదేశాలు ఉన్నాయో అన్ని చోట్ల భారతీయులు, తెలుగువారి ఆనవాళ్లు తప్పకుండా ఉంటున్నాయి.’ అని సీఎం చంద్రబాబు అన్నారు.

నా కోసం మీరు చేసిన పోరాటం మర్చిపోలేను

‘ఇన్ని దేశాల్లో తెలుగువారు ఉంటారని నా జీవితంలో ఊహించలేదు. అవకాశాలు అందిపుచ్చుకుని విదేశాలకు వచ్చారు. నన్ను జైలుకు పంపిన సమమంలో మీరు పోరాడిన తీరు నేను చూశాను… ఇన్ని దేశాల్లో తెలుగువారు ఉన్నారా అనిపించింది. 53 రోజుల పాటు నా కోసం మీరు ఉద్యమం చేశారు. రాజకీయాల్లో ఉండటానికి అర్హత లేని వ్యక్తి అధికారంలో ఉంటే ఏమైందో గత ఐదేళ్లు చూశాం. రాష్ట్రాన్ని గట్టెక్కించడానికి టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేశాయి. ఎన్నికల సమయంలో ప్రపంచంలో ఎక్కడున్నా వచ్చి ఓట్లు వేసి మమ్మల్ని గెలిపించారు. ఇది నా జీవితంలో మర్చిపోలేను. పౌరులను తయారు చేయడంలో గతంలో చాలా మంది నాయకులు బాధ్యత తీసుకున్నారు. సింగపూర్ ఒక మత్స్య గ్రామం… అలాంటి దేశాన్ని పబ్లిక్ పాలసీలతో అడ్వాన్స్ దేశంగా పాలకులు మార్చారు. ఏపీ అంటే వ్యవసాయం అని మాత్రమే అనుకున్నారు. 1991లో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. 1993లో ఇంటర్నెట్ రెవల్యూషన్ వచ్చింది. 1995లో నేను ముఖ్యమంత్రి అయ్యాను. ఆ సమయంలో ఎవరూ చేయని సాహసం చేశాను. రెండవ తరంలో సంస్కరణలు ప్రారంభించి ఐటీకి ప్రాధాన్యం ఇచ్చా. ఎవరికీ తెలియని సమయంలో ఐటీ గురించి మాట్లాడాను. పిల్లల్ని చదవిస్తే కోట్లు సంపాదిస్తారని చెప్పాను. హైదరాబాద్‌ను అభివృద్ధి చేయడం వల్ల తెలంగాణ ప్రజల తలసరి ఆదాయం దేశంలో అందరికంటే ఎక్కువ ఉంది. దీనికి కారణం నాడు నేను వేసిన పునాది.

ఉద్యోగాలిచ్చే స్థాయికి తెలుగుజాతి ఎదగాలి

‘మనవాళ్లు ఉద్యోగాలు చేయడం కాదు.. ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని ఎప్పుడూ చెప్పేవాణ్ని. రెండవ తరంలో ఎంట్రప్రెన్యూర్‌కు ఆనాడు పునాది వేశానని గర్వంగా చెప్తున్నా. ఆడపిల్లలను చదివించాలని, వివక్ష చూపించొద్దని చెప్పా. కాలేజీ సీట్లలో, ఉద్యోగాల్లో 33 శాతం ఆడబిడ్డలకు రిజర్వేషన్లు పెట్టాను. ఏ ఐటీ కంపెనీకి వెళ్లినా ఇప్పుడు అమ్మాయిలు ఎక్కువగా కనబడుతున్నారు. ఇప్పుడు అన్ని దేశాల్లో జనాభా సమస్య వచ్చింది. జపాన్ లాంటి దేశం ఇండియా నుంచి మ్యాన్ పవర్ కావాలని మొదటిసారి అడుగుతోంది. సరైన సమయంలో నిర్ణయం తీసుకోకపోతే సంపద సృష్టించినా, టెక్నాలజీ ఉన్నా ఎవరు అనుభవిస్తారు.? 2047 నాటికి భారత్ ఆర్ధికంగా ప్రపంచంలో మొదటి, రెండవ స్థానాల్లో ఉంటాం. 2 కోట్ల మంది తెలుగువాళ్లు ప్రపంచ దేశాలకు వెళ్తే దున్నేస్తారు. మీరు ఇక్కడే ఉండండి… మరింత విస్తరించండి. అభివృద్ధి చేయాలంటే దగ్గరే ఉండాల్సిన పనిలేదు… ఫోన్ ద్వారా కూడా అవుతుంది. తెలుగువారు ప్రపంచమంతా ఉండాలి…. కర్మభూమిని పట్టించుకోవాలి… జన్మభూమికి అవకాశాలు కల్పించాలి. ఈ రెండింటినీ సమాంతరంగా తీసుకెళ్లాలి.’ అని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.

వర్క్‌ఫ్రం హోమ్‌ హబ్‌గా ఏపీ

సంపద సృష్టించడం కష్టం కాదు. 2047 నాటికి నెంబర్ గా తెలుగుజాతి ఉండాలనేదే నా సంకల్పం. వ్యవసాయం, కూలీ కుటుంబాల నుంచి వచ్చాం. ప్రపంచలో ఎక్కడికెళ్లినా రాణిస్తున్నాం. ఉక్రెయిన్‌లో యుద్ధం ప్రకటిస్తే ఏం చేయాలో ఆలోచించి మన వాళ్లను కాపాడుకోగలిగాం. మనం వచ్చిన మార్గాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు. ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీల కోసం నాడు ఫైళ్లు పట్టుకుని తిరిగాను… కారణం మన వాళ్ళ భవిష్యత్తు కోసం.

సుస్థిర ప్రభుత్వంతో అభివృద్ధి

‘నాడు బిల్ గేట్స్‌ను నేను కలవాలంటే కుదరదని చెప్పారు. ఐదు నిమిషాలు సమయం కావాలని వెళ్లాను. కానీ నేను చెప్పింది వింటూ నలభై నిమిషాల సమయం ఇచ్చారు. నేను ఏమి చేయాలని బిల్‌గేట్స్ అడిగారు… మైక్రోసాఫ్ట్ హైదరాబాద్‌లో పెట్టాలని కోరాను. మైక్రోసాఫ్ట్ హైదరాబాద్‌కు రావడంతో మన తెలుగు బిడ్డ సత్యనాదెళ్ల సీఈఓ అయ్యారు. ప్రతి ఎన్నికల్లో గెలిస్తే రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళ్లొచ్చు. కేంద్రంలో మోదీ 3వ సారి పీఎం అయ్యారు. గుజరాత్‌లో బీజేపీ 5వ సారి గెలిచింది. 2004లో కూడా మనం గెలిచి ఉంటే తెలుగు జాతి ఊహకు కూడా అందనంత స్థాయిలో ఉండేది. కానీ అదృష్టం ఏంటంటే నా తర్వాత వచ్చిన పాలకులు హైటెక్ సిటీ కూల్చలేదు. కానీ ఏపీలో మొన్న వచ్చిన పాలకులతో అమరావతి, పోలవరం అన్నీ పోయాయి. మీ శక్తి పెరిగితే మన తెలుగు సంస్కృతి నిలబడుతుంది. మీరు, మీ పిల్లలు తెలుగులోనూ మాట్లాడాలి. అవకాశాలను వెతికిపట్టి ఏపీని వర్క్ ఫ్రం హోమ్ హబ్ గా చేయాలన్నది నా కోరిక. మహిళలు ఇంటి పనులు చూసుకుంటూనే ఐదారు గంటలు పని చేస్తే డబ్బులు సంపాదించవచ్చు. ఏఐని అందరూ అడాప్ట్ చేసుకోవాలి. విద్యుత్ రంగంలో ఊహించని పరిణామాలు రాబోతున్నాయి. గ్రీన్ హైడ్రోజన్ హబ్‌గా ఏపీ తయారవుతుంది. మీరు ఏపీ అభివృద్ధిలో భాగం కావాలి. నేను ఒక్క ఏపీ అభివృద్ధి గురించి మాత్రమే మాట్లాడటం లేదు… తెలుగుజాతి అభ్యున్నతి గురించి మాట్లాడుతున్నా. దేశానికి ఏదో చేయాలన్న సంకల్పంతో మోదీ పని చేస్తున్నారు. వికసిత్ భారత్‌ 2047తో కేంద్రం ముందుకెళ్తే… స్వర్ణాంధ్ర విజన్ 2047తో మనం ముందుకెళ్తున్నాం. మీకున్న నాలెడ్జ్‌తో నాకు సలహాలు ఇస్తే స్వీకరిస్తా. మీరు చూపించే ప్రేమ నా జీవితంలో మర్చిపోలేను. మీ ఆదరణకు నేను ఎంత చేసిన తక్కువే.’ అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article