ప్రస్తుత కాలంలో దొంగతనం కేసులు ఎక్కువయ్యాయి. పొద్దున లేచింది మొదలు..పేపర్లు, టీవీల్లో భారీ భారీ చోరీ కథలు వినిపిస్తూనే ఉంటాయి. ఇండ్లు, దుకాణాలు, పెద్ద పెద్ద షోరూమ్‌లు, ఆఖరుకు పెట్రోల్ బంకుల్లోనూ దొంగలు లూటీకి పాల్పడుతున్న ఉదంతాలు కూడా చూస్తుంటాం. కానీ, ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వింత దొంగతనం కేసు వెలుగులోకి వచ్చింది. ఇది అందరినీ ఆశ్చర్యపోయేలా చేస్తుంది. ఇక్కడ దొంగలు ఓ ఖాళీ ఇంటి నుండి ఎటువంటి విలువైన వస్తువులు, వాహనాన్ని దొంగిలించలేదు. బదులుగా ఆవు పేడను దొంగిలించి వెళ్లిపోయారు. అవును, మీరు చదివింది పూర్తిగా నిజమే. ఇక్కడ ఆవు పేడ దొంగతనం జరిగింది. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ కేసులో పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా దాఖలు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే…
ఇది నిజంగా ఒక వింతైన, ఆసక్తికరమైన కేసు. ఆవు పేడ దొంగతనం సంఘటనలు సాధారణంగా వినబడవు. కానీ, గ్రామీణ ప్రాంతాల్లో దీనికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకంటే దీనిని ఇంధనం, ఎరువు, ఇతర అవసరాలకు ఉపయోగిస్తారు. పాకిస్తాన్‌లో జరిగిన ఈ సంఘటనలో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, దొంగ తోబుట్టువే స్వయంగా ఈ చోరీపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఈ వింత సంఘటన పంజాబ్‌లోని ముజఫర్‌గఢ్ జిల్లాలో రంగ్‌పూర్ పట్టణంలో జరిగింది. నాగినా బీబీ అనే మహిళ తన ఇద్దరు అన్నదమ్ములతో పాటు మరో 7 మంది కలిసి వేల రూపాయల విలువైన ఆవు పేడను దొంగిలించారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయంపై నగీనా రంగ్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
ఇవి కూడా చదవండి
రంగ్‌పూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఆ మహిళ తన పశువుల పేడను ఇంటి ముందు పోసిందని, సోదరులు ట్రాక్టర్ ట్రాలీ సహాయంతో అదంతా దొంగిలించారని తెలిపారు. ఆవు పేడతో తయారు చేసిన ఎరువు ధర రూ. 35 వేలు అని ఆ మహిళ చెప్పింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులందరినీ అరెస్టు చేశారు. ఆవు పేడతో నిండిన ట్రాలీని కూడా స్వాధీనం చేసుకున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..