కర్ణుడి చావుకు కారణాలు అనేకం. ఢిల్లీలో ఆప్ పరాజయానికి కూడా పలు కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆప్ అగ్రనేతలపై అవినీతి ఆరోపణలు కొంపముంచాయి. లిక్కర్ స్కామ్‌లో కేజ్రీవాల్ , సిసోడియా జైలుకెళ్లిన విషయాన్ని బీజేపీ నేతలు ప్రచారంలో పదేపదే ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీ మూడోసారి సున్నా స్థానాలకే పరిమితమైంది.
Aap Leaders
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కమలం వికసించింది. 27 ఏళ్ల గ్యాప్ తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో అధికార పగ్గాలు కైవసం చేసుకునే దిశగా దూసుకుపోతోంది. హ్యాట్రిక్ విజయంతో ఢిల్లీలో మళ్లీ అధికార పగ్గాలు చేపట్టాలకున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఆశలు అడియాశలయ్యాయి.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సహా పలువురు ఆప్ మంత్రులు, ముఖ్యనేతలు ఓటమిపాలయ్యారు. కాగా ఢిల్లీ సీఎం అతిషి విజయం సాధించడం ఆ పార్టీకి కాస్త ఊరట కలిగించే అంశం. మరి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఇప్పటి వరకు అందిన టాప్ అప్‌డేట్స్ ఇవే..
- న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో అప్ అభ్యర్థి అర్వింద్ కేజ్రీవాల్ ఓటమి చెందారు. బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ 1,200కు పైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
- జంగ్‌పురా నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన మనీష్ సిసోడియా ఓటమి చవిచూశారు. బీజేపీ అభ్యర్థి తర్వీందర్ సింగ్ 600 ఓట్ల తేడాతో సిసోడియాపై విజయం సాధించారు.
- ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి విజయం సాధించారు. మర్లెనా కల్కాజీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి రమేష్ బిధూరిపై 3,500 ఓట్ల తేడాతో అతిషి విజయం సాధించారు. ప్రస్తుతం అతిషి ఈ నియోజకవర్గం నుంచే ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
- ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ ఎన్నికల్లో చాలా మంది ప్రముఖులు ఓడిపోయారు. సోమనాథ్ భారతి మాలవీయ నగర్ స్థానం నుంచి ఓడిపోయారు. దుర్గేష్ పాఠక్ కూడా ఓడిపోయాడు.
- ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బోణీ కొట్టలేకపోయింది. ఆ పార్టీ ఒక స్థానాన్ని కూడా గెలిచే పరిస్థితిలో లేదు. ఢిల్లీలో ఆ పార్టీ మరోసారి రిక్తహస్తాలతో వెనుతిరిగింది. సున్నా స్థానాలకే పరిమితం కావడం వరుసగా ఇది మూడోసారి.
- ఢిల్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీ వైపు దూసుకుపోతున్న భారతీయ జనతా పార్టీ.. 27 ఏళ్ల తర్వాత అక్కడ ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. బీజేపీ నుంచి ముగ్గురు నలుగురు నేతలు సీఎం రేసులో ఉన్నట్లు తెలుస్తోంది.
- ఢిల్లీ సీఎం రేసులో కేజ్రీవాల్‌ను ఓడించిన పర్వేష్ వర్మ ముందున్నారు. అర్వింద్ కేజ్రివాల్‌ను ఆయన న్యూఢిల్లీ నియోజకవర్గంలో ఓడించారు. గెలుపొదిన తర్వాత నేరుగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఇంటికి వెళ్లి భేటీ అయ్యారు.
- ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం నేపథ్యంలో బీజేపీ శ్రేణులు దేశ వ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంతో పాటు అన్ని రాష్ట్రాల్లోనూ బీజేపీ కార్యాలయాల దగ్గర సందడి వాతావరణం నెలకొంది.
- కేజ్రీవాల్‌పై అన్నా హజారే సంచలన వ్యాఖ్యలు చేశారు. కేజ్రివాల్ అధికార దాహమే ఆప్ ఓటమికి కారణమని వ్యాఖ్యానించారు.
- మనం మనం కొట్టాడుకుంటే ఈ రకమైన ఫలితాలే వస్తాయంటూ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై జమ్ముకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా స్పందించారు.
- ఢిల్లీ లిక్కర్ కేసులో నిందితులకు ఈ ఎన్నికల్లో ఓటమి చెవిచూశారు. జైలుకు వెళ్లొచ్చిన ఆప్ నేతలు షాకూర్ బస్తీలో మాజీ మంత్రి సత్యేంద్రజైన్ ఓటమి చెందారు. అలాగే కేజ్రీవాల్, సిసోడియా ఓటమి చెందారు.
- గ్రేటర్ కైలాష్ అసెంబ్లీ స్థానం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి సౌరభ్ భరద్వాజ్ ఓడిపోయారు. ఇక్కడి నుంచి బీజేపీకి చెందిన శిఖా రాయ్ 3 వేలకు పైగా ఓట్ల తేడాతో గెలిచారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..