ఐఆర్‌సీటీసీ ద్వారా ఆన్‌లైన్‌లో టిక్కెట్లు బుక్ చేసుకునే ప్రయాణికులు, సర్వీస్ చార్జ్, లావాదేవీ ఛార్జీల కారణంగా రైల్వే కౌంటర్లలో భౌతికంగా కొనుగోలు చేసే వారి కంటే ఎక్కువ చెల్లిస్తున్నారని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ శుక్రవారం అన్నారు. ఐఆర్‌సీటీసీ టికెట్ ధరల్లో వ్యత్యాసాల గురించి శివసేన (యూబీటీ) రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ లేవనెత్తిన ప్రశ్నలకు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ సమాధానం ఇచ్చారు. ఆన్‌లైన్ టికెటింగ్ సౌకర్యాన్ని అందించడానికి ఐఆర్‌సీటీసీ గణనీయమైన ఖర్చును భరిస్తుంది. ముఖ్యంగా టికెటింగ్ మౌలిక సదుపాయాల నిర్వహణ, అప్‌గ్రేడేషన్, విస్తరణకు అయ్యే ఖర్చును తగ్గించడానికి, ఐఆర్‌సీటీసీ సౌకర్య రుసుమును వసూలు చేస్తుందన్నారు. అలాగే అదనంగా కస్టమర్లు బ్యాంకులకు లావాదేవీ ఛార్జీలను కూడా చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
ఐఆర్‌సీటీసీ అందించే ఆన్‌లైన్ టిక్కెట్ బుకింగ్ సౌకర్యం భారతీయ రైల్వేలు అత్యంత ప్రయాణీకులకు అనుకూలమైన కార్యక్రమాలలో ఒకటిగా ఉంది. ప్రస్తుతం, రిజర్వ్ చేసిన టిక్కెట్లలో 80 శాతానికి పైగా ఆన్‌లైన్‌లో బుక్ చేస్తున్నారని పేర్కొన్నారు. అలాగే హైడ్రోజన్ రైళ్లను నిర్మించడంపై మరొక ప్రశ్నకు మంత్రి సమాధానం ఇస్తూ దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ రైలును అభివృద్ధి చేయడానికి రైల్వేలు అత్యాధునిక ప్రాజెక్టును చేపట్టాయని, ఇది ప్రపంచంలోనే అతి పొడవైన మరియు అత్యధిక శక్తితో నడిచే హైడ్రోజన్ రైళ్లలో ఒకటిగా ఉంటుందన్నారు.
డీజిల్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ (డీఈఎంయూ) ర్యాక్‌పై హైడ్రోజన్ ఇంధన సెల్‌ను రెట్రోఫిట్ చేయడం ద్వారా పైలట్ ప్రాతిపదికన మొదటి హైడ్రోజన్ రైలు అభివృద్ధి కోసం భారత రైల్వేలు అత్యాధునిక ప్రాజెక్టును చేపట్టాయని వివరించారు. ఈ రైలుతో పాటు హైడ్రోజన్‌ను రీఫిల్ చేయడానికి ఏకకాలంలో ఆన్-గ్రౌండ్ మౌలిక సదుపాయాలను ఇంటిగ్రేటెడ్ హైడ్రోజన్ ఉత్పత్తి-నిల్వ-పంపిణీ సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తెస్తున్నట్లు స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..