దేశ రాజధాని ఢిల్లీలో మొబైల్ చోరీ ఘటన కలకలం సృష్టిస్తోంది. భారతదేశంలోని ఫ్రెంచ్ రాయబారి థియరీ మాథౌ వద్ద మొబైల్ చోరీకి గురైనట్లు కేసు నమోదైంది.. ఈ మేరకు ఫ్రాన్స్ రాయబారి థియరీ మాథౌ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోన్ చోరీకి పాల్పడిన నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
చాందినీ చౌక్ మార్కెట్ నుండి భారతదేశంలోని ఫ్రెంచ్ రాయబారి థియరీ మాథౌ మొబైల్ ఫోన్‌ను దొంగిలించిన నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి దొంగిలించిన మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అక్టోబరు 20న థియరీ మాథౌ తన భార్యతో కలిసి చాందినీ చౌక్ మార్కెట్‌ని సందర్శించడానికి వచ్చారు. అతని జేబులోంచి ఎవరో మొబైల్ ఫోన్ దొంగిలించారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మొబైల్ ఫోన్ చోరీకి గురైనట్లు ఫిర్యాదు అందిందని, వెంటనే స్పందించిన కేసు దర్యాప్తు చేపట్టామని ఉత్తర జిల్లా డిప్యూటీ కమిషనర్ తెలిపారు.
కేసు దర్యాప్తు కోసం పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించింది. దీంతో నిందితులను గుర్తించారు. ఇన్‌ఫార్మర్ల సమాచారం మేరకు 20 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. నలుగురు నిందితులు యమునా క్రాస్ ప్రాంతానికి చెందిన వారని, పోలీసులు వారిని విచారించి తదుపరి విచారణ జరుపుతున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. దీపావళి షాపింగ్ కోసం పెద్ద సంఖ్యలో ప్రజలు చాందినీ చౌక్‌కు చేరుకుంటున్నారు. ఈ రద్దీని అవకాశంగా తీసుకుని దొంగలు ప్రజల మొబైల్ ఫోన్లు, పర్సులు ఎత్తుకెళ్లిపోతున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..