హైదరాబాద్, ఫిబ్రవరి 12: తెలంగాణ రాష్ట్రంలో ఉన్న డీఎస్సీ 2008లో నష్టపోయిన బాధితులకు మరోవారంలో కొలువులు దక్కనున్నాయి. గతంలోనే ఈ మేరకు ప్రకటన ఇచ్చనప్పటికీ దానిని రేవంత్ సర్కార్ నిలబెట్టుకోలేదు. దీంతో మరో మారు డీఎస్సీ బాధితులకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. అయితే ఈ సారైనా ప్రభుత్వం మాటమీద నిలబడుతుందో.. లేదో.. అన్నది వేచిచూడాల్సిందే. అసలు సంగతేమంటే.. డీఎస్సీ-2008లో నష్టపోయిన మొత్తం 1399 మంది అభ్యర్ధులకు విద్యాశాఖ వారం రోజుల్లో కాంట్రాక్టు విధానంలో ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. వారందరినీ సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్‌జీటీ)లుగా నియమిస్తూ ఒకట్రెండు రోజుల్లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది.
ఉమ్మడి ఏపీలో అప్పట్లో చివరి నిమిషంలో తీసుకున్న నిర్ణయంతో ఉత్తమ మార్కులు సాధించినా.. మెరిట్ జాబితాలో ఉన్నప్పటికీ బీఈడీ అభ్యర్థులు ఉద్యోగాలకు దూరమయ్యారు. దీంతో అప్పటి నుంచి తమకు న్యాయం చేయాలని వారంతా సర్కార్‌తో పోరాడుతూనే ఉన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే న్యాయం చేస్తామని అసెంబ్లీ ఎన్నికలకు ముందు రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం వారందరికీ కాంట్రాక్టు విధానంలో ఎస్జీటీ ఉద్యోగాలను మినిమం టైమ్ స్కేల్ కింద ఇవ్వాలని 2024 సెప్టెంబరు 24న నిర్ణయం తీసుకుంది. 2008 డీఎస్సీలో నష్టపోయిన వారిలో 2,367 మంది అభ్యర్ధులు ఉన్నట్లు పాఠశాల విద్యాశాఖ లెక్కలు తీసింది.
ఆ మేరకు వారందరికీ ధ్రువపత్రాల పరిశీలన కూడా చేశారు. రేవంత్ సర్కార్ ఆదేశాల మేరకు వీరందరికి కాంట్రాక్టు విధానంలో ఉపాధ్యాయ ఉద్యోగాలిచ్చేందుకు అధికారులు కూడా ఏర్పాట్లు చేశారు. మరో వారం రోజుల్లో వారికి నియామకపత్రాలు అందజేస్తామని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు గత ఏడాది నవంబర్‌లో ఈవీ నరసింహారెడ్డి ప్రకటించారు కూడా. వీరికి వేతనం కింద నెలకు రూ.31,030 చొప్పున చెల్లించనున్నట్లు తెలిపారు. కానీ ఆ తర్వాత అతీగతీ లేకుండా పోయింది. మళ్లీ దాదాపు రెండు నెలల తర్వాత ఆ ప్రస్తావన మళ్లీ తెరపైకి వచ్చింది. తాజాగా డీఎస్సీ బాధితులందరి ధ్రువపత్రాలను అప్‌లోడ్ చేయాలని, కాంట్రాక్టు విధానంలో సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్‌జీటీ)గా పని చేస్తామంటూ ధ్రువీకరించాలని విద్యాశాఖ కోరింది. ఇందుకు 1382 మంది అంగీకరించారు. నియామక పత్రాల అందజేతకు సీఎం రేవంత్‌రెడ్డి నెల రోజుల క్రితమే ఆమోదం తెలిపారు. అయితే కొందరు హైకోర్టును ఆశ్రయించగా.. ఉద్యోగాలు ఇవ్వడంపై జాప్యం నెలకొంది. తాజాగా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చేందుకు ఎట్టకేలకు సిద్ధమైంది.
ఇవి కూడా చదవండి
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.