ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యాక ప్రశాంతంగా, ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఆ సమయంలో ఆర్థికంగా అవస్థలు లేకుండా ఉండాలనుకుంటారు. దీనిలో భాగంగా వివిధ మార్గాల్లో డబ్బులను పెట్టుబడి పెడతారు. రిటైర్మెంట్ తర్వాత వీటి నుంచి వచ్చే సొమ్ముతో హాయిగా జీవించాలని ప్లాన్ చేసుకుంటారు.
Epf Vs Nps
రిటైర్మెంట్ పథకాలలో ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్), నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్ పీఎస్) ప్రధానంగా ఉన్నాయి. వడ్డీ రేట్లు సమానంగా ఉన్నా ఈ పథకాల మధ్య కీలక తేడాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈపీఎఫ్ ఎన్‌పీఎస్ మధ్య తేడాలను, ప్రయోజనాలను తెలుసుకుందాం.
ఈపీఎఫ్ (ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్)
- వివిధ ఫ్యాక్టరీలలో పనిచేసే కార్మికులు, ఉద్యోగులందరూ ఈపీఎఫ్ పథకం కిందకు వస్తారు. ప్రతి నెలా వారి జీతం నుంచి కొంత మొత్తం దానిలో జమఅవుతుంది. అంతే మొత్తాన్ని కంపెనీ కూడా కలుపుతుంది.
- ఈపీఎఫ్ కోసం నెలవారీ బేసిక్ జీతంలోని కొంత మొత్తం చెల్లించాలి. బేసిక్ జీతం ప్రకారం ఎంత కట్టాలో లెక్కిస్తారు. దానికి సమానమైన మొత్తాన్ని కంపెనీ చెల్లిస్తుంది. అయితే ఉద్యోగికి ఇష్టమైతే మరింత ఎక్కువ కట్టుకోవచ్చు.
- ఈపీఎఫ్ కు వచ్చిన చందాలను రుణ సాధనాల్లో పెట్టుబడి పెడతారు. ఇటీవలే పీఎఫ్ నిధిలో ఐదు శాతాన్ని ఈక్విటీ మార్కెట్లలో ఈపీఎఫ్ వో ఇన్వెస్ట్ చేస్తోంది. దీనికి కూడా గరిష్టంగా 15 శాతం వరకూ పరిమితి ఉంది.
- ఈ పథకంలో చందాదారులందరికీ వడ్డీ ఓకే రకంగా అందిస్తారు. గతేడాది 8.7 శాతం అమలు చేశారు. దేశంలో వడ్డీ రేట్లు తక్కుతున్న నేపథ్యంలో అదే స్థాయిలో కొనసాగవచ్చు, లేకపోతే తగ్గవచ్చు.
- ప్రైవేటు కంపెనీల్లో పనిచేసే వేతన జీవులకు మాత్రమే ఈపీఎఫ్ అందుబాటులో ఉంటుంది. సుమారు 20 మందికి పైగా ఉన్న ప్రతి కంపెనీ తన ఉద్యోగులకు ఈపీఎఫ్ అమలు చేయాలి.
- ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80 సీ కిందకు ఈపీఎఫ్ వస్తుంది. దీని ప్రకారం గరిష్టంగా రూ.1.50 లక్షల వరకూ పన్ను మినహాయింపులు పొందవచ్చు.
- రిటైర్మెంట్ తర్వాత మెచ్యూరిటీ సమయంలో మొత్తం ఈపీఎఫ్ ను పన్ను ప్రసక్తి లేకుండా విత్ డ్రా చేసుకోవచ్చు.
ఎన్ పీఎస్ (నేషనల్ పెన్షన్ స్కీమ్)
- 2004 ఏప్రిల్ తర్వాత విధుల్లో చేరిన ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఎన్ పీఎస్ ను తప్పనిసరి చేశారు. వీరితో పాటు వ్యాపారవేత్తలు, స్వయం ఉపాధి పొందుతున్న మహిళలు, సంఘటిత, అసంఘటిత రంగాల్లో పనిచేసే ప్రజలు కూడా ఎన్ పీఎస్ లో పెట్టుబడి పెట్టవచ్చు.
- ప్రైవేటు కంపెనీ ఉద్యోగులు తమ రిటైర్మెంట్ ప్రణాళిక కోసం ఈపీఎఫ్ తో పాటు ఎన్ పీఎస్ లో కొనసాగవచ్చు.
- ఈ పథకానికి ఎంత పెట్టుబడి పెట్టాలో చందాదారులే నిర్ణయించుకోవచ్చు. ఒకేసారి ఏక మొత్తంలోనైనా, వాయిదాల రూపంలోనైనా చెల్లించే అవకాశం ఉంది. ఒక ఆర్థిక సంవత్సరంలో కనిష్టంగా రూ.6వేలు కట్టాల్సి ఉంటుంది. గరిష్ట పరిమితి లేదు.
- ఈక్విటీ, డెట్ సాధనాల్లో ఏరకంగా పెట్టుబడి పెట్టాలన్నది ఇన్వెస్టరే నిర్ణయించుకోవచ్చు.
- పదేళ్లు, అంతకన్నా ఎక్కువ కాలం పెట్టుబడి పెడితే రాబడి బాగుంటుంది. ఈపీఎఫ్ స్కీమ్ కన్నా దాదాపు రెండు నుంచి మూడు శాతం ఎక్కువగా వస్తుంది.
- ఆదాయపు పన్ను చట్టంలోని 80 సీసీడీ (1బీ) కిందకు ఎన్ పీఎస్ వస్తుంది. దీని ద్వారా ఏడాదికి గరిష్టంగా రూ.50 వేల వరకూ మినహాయింపు పొందవచ్చు. ఇది 80సీకి అదనంగా అందిస్తారు.
- ఒక రకంగా చెప్పాలంటే ఈపీఎఫ్, ఎన్ పీఎస్ ఒకదానికి ఒకటి ప్రత్యామ్నాయం కాదు. ఈ రెండు వివిధ రకాల ప్రయోజనాలను అందిస్తాయి. ఒక దానికి తోడుగా మరొకటి ఉండే ఎక్కువ రాబడి పొందే అవకాశం ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..