Freedom At Midnight Review: ‘ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్’ రివ్యూ.. స్వాతంత్య్రం వెనక అంతర్యుద్ధం..!

2 hours ago 1

ఈ మధ్య కాలంలో సినిమాలతో పోటీ పడి మరీ వెబ్ సిరీస్‌లు కూడా వస్తున్నాయి. వాటికి వస్తున్న రెస్పాన్స్ కూడా అలాగే ఉంది. వందల కోట్లు వెబ్ సిరీస్‌ల కోసం ఖర్చు పెడుతున్నారు నిర్మాతలు. తాజాగా అలా వచ్చిన సిరీస్ ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్. భారతదేశానికి స్వాతంత్ర్యం ఎలా వచ్చింది..? దానికోసం గాంధీ, నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ సహా మిగిలిన వాళ్లు ఎంత కష్టపడ్డారు అనే కథాంశంతో నిఖిల్ అద్వానీ తెరకెక్కించిన ఈ వెబ్ సిరీస్‌ ఎలా ఉంది..? ఆడియన్స్ మనసు దోచుకుందా..? అప్పటి పరిస్థితులకు అద్దం పట్టిందా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం..

కథ

ఇండియాకు ఇండిపెండెన్స్ ఇవ్వడానికి ఆంగ్లేయులు సిద్ధమవుతుంటారు. దానికోసం భారతదేశానికి చివరి వైశ్రాయ్‌ను నియమిస్తారు బ్రిటన్ ప్రధాని. అక్కడ్నుంచి కథ మొదలవుతుంది. అయితే దేశ విభజన చేయడంలో మాత్రం చాలా సమస్యలు ఎదురవుతాయి. ఇండియాను ముక్కలు చేయొద్దని గాంధీజి, నెహ్రూతో పాటు ఉక్కు మనిషి పటేల్ కూడా చాలా ప్రయత్నిస్తుంటారు. అదే సమయంలో ముస్లిమ్స్ కోసం ప్రత్యేకంగా దేశం కావాలని ఎన్నో కుట్రలు పన్నుతుంటాడు మహమ్మద్ జిన్నా. ఎలాగైనా దేశాన్ని విడగొట్టి పాకిస్తాన్‌ను ప్రత్యేకమైన దేశంగా ప్రకటించవలసిందేనని తేల్చి చెబుతాడు. తాము చెప్పింది జరక్కపోతే ఆయుధాలు పట్టడానికైనా.. ఎంతమంది ప్రాణాలు తీయడానికైనా సిద్ధం అంటాడు జిన్నా. అలాంటి సమయంలో మహ్మద్ అలీ జిన్నాతో అధికారం పంచుకోవడం కంటే.. దేశాన్ని విభజించడమే నయం అని నిర్ణయానికి వచ్చేస్తారు గాంధీ, నెహ్రూ, పటేల్. అప్పుడు ఏం జరిగింది..? ఎలా దేశాన్ని విడదీసారు అనే నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ సాగుతుంది.

కథనం:

చిరాగ్ వోరా, రాజేంద్ర చావ్లా, ల్యూక్ మెక్ గిబ్నే లాంటి వాళ్లు ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్‌లో కీలక పాత్రలు పోషించారు. మొత్తం 7 ఎపిసోడ్స్‌తో సీజన్ 1 వచ్చింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, బెంగాలీ, మరాఠీ భాషలలో ఈ సిరీస్ అందుబాటులో ఉంది. ఈ నెల 15వ తేదీ నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. 200 ఏళ్లపాటు బ్రిటీష్ వాళ్లు ఇండియాను ఎంత హింసించారు.. ఎలా అణచివేతకు గురి చేసారు అనేది ఈ సిరీస్‌లో చాలా బాగా చూపించారు. స్వాతంత్య్ర కాంక్షను కూడా అద్భుతంగా చూపించారు. ఉద్యమకారులు, స్వాతంత్ర్య సమరయోధుల మనోభావాలకు అద్దం పడుతుంది ఈ సిరీస్. ఓ వైపు అహింసా పద్దతిలో గాంధీ నడుస్తుంటే.. మరోవైపు దేశాన్ని విడదీయాలని జిన్నా చేసే ప్రయత్నాలు.. అలా విడిపోకుండా అడ్డుకోవాలని నెహ్రూ, పటేల్ పడే ప్రయాస అన్నీ అద్భుతంగా చూపించారు. దేశ స్వాతంత్య్రం ప్రధానమైన కథాంశమే అయినా.. అసలు ఇండియాను ఎలా రెండు ముక్కలు చేసారు అనేది ఈ సిరీస్‌లో మెయిన్ ప్లాట్. అక్కడ్నుంచే అసలు కథ మలుపులు తిరుగుతుంది. జిన్నా చేసే ప్రతీ పనిని.. అతడి కుట్రలను ఎలా అడ్డుకోవాలని నెహ్రూ, పటేల్ పడిన తర్జన భర్జనలను ఈ సిరీస్ హైలైట్ చేస్తుంది. మధ్య మధ్యలో వచ్చే బ్రిటీషర్ల సీన్లు కూడా చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. అసలు స్వాతంత్ర్యం ఇవ్వడానికి ముందు ఇంగ్లండ్‌లో జరిగిన సంఘటనలేంటి..? అసలు ఇండియాను విడిచిపెట్టి ఎందుకు వెళ్లాలనుకున్నారు అనే విషయాలపై కూడా సమీక్ష బాగుంది. స్వాతంత్య్రం కంటే.. విభజన అనే అంశంపైనే దర్శకుడు ఎక్కువగా ఫోకస్ చేసాడు. ఈ క్రమంలోనే కొన్నిచోట్ల గాంధీ కారెక్టర్‌పై చురకలు కూడా అంటించారు. నెహ్రూ, పటేల్ కారెక్టర్స్ ఈ సిరీస్‌కు హీరోలుగా మారిపోతారు. చరిత్ర తెలుసుకోడానికి హాయిగా ఈ సిరీస్ ఓ సారి చూడొచ్చు.

Freedom At Midnight

Freedom At Midnight

నటీనటులు:

మహాత్మా గాంధీజీగా చిరాగ్ వోరా అద్భుతంగా నటించాడు. ఇక పండిట్ జవహర్ లాల్ నెహ్రూగా సిద్ధాంత్ గుప్తా అచ్చు గుద్దినట్లు సరిపోయాడు. సర్దార్ వల్లభాయ్ పటేల్‌గా రాజేంద్ర చావ్లా చాలా బాగున్నాడు. మహ్మద్ అలీ జిన్నాగా ఆరిఫ్ జకారియా అదిరిపోయే నటనతో మాయ చేసాడు. మౌంట్ బాటెన్ గా ల్యూక్ మెక్ గిబ్నే నటన సహజత్వానికి చాలా దగ్గరగా ఉంటుంది. మిగిలిన పాత్రలు కూడా చాలా బాగా సరిపోయారు.

టెక్నికల్ టీం: 

ఇంత పెద్ద సిరీస్‌కు సంగీతం చాలా కీలకం. ఈ విషయంలో అశుతోష్ పాఠక్ నూటికి నూరు మార్కులు వేయించుకున్నాడు. ఆయన ఆర్ఆర్ అదిరిపోయింది. అలాగే ప్రకాశ్ సినిమాటోగ్రపీ మెప్పిస్తుంది. ఆ కాలానికి సంబంధించిన లైటింగ్ సెట్ చేసుకుని ఆడియన్స్‌ను అందులోకి తీసుకెళ్తారు. శ్వేత వెంకట్ ఎడిటింగ్ బాగుంది. 7 ఎపిసోడ్స్ ఉన్నా కూడా చాలా త్వరగానే అయిపోతాయి. దర్శకుడు నిఖిల్ అద్వానీ వర్క్ మెచ్చుకోవాల్సిందే. కాకపోతే ట్రైలర్‌లో ఒకటి కట్ చేసి.. సిరీస్‌లో మరోటి చూపించారు. గాంధీకి వ్యతిరేకంగా సిరీస్ ఉంటుంది అనుకుంటారు ట్రైలర్ చూసాక.. కానీ సిరీస్ చూస్తే మాత్రం పూర్తిగా జిన్నాకు వ్యతిరేకంగా ఉంటుంది.

పంచ్ లైన్:

ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్.. తెలుసుకోవాల్సిన చరిత్ర..!

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article