మూవీ రివ్యూ: గాంధీ తాత చెట్టు
నటీనటులు: సుకృతి వేణి బండ్రెడ్డి (సుకుమార్ కూతురు), భాను ప్రకాష్, ఆనంద చక్రపాణి, రాగ్ మయూర్, రఘురామ్ తదితరులు
సంగీతం: రీ
ఇవి కూడా చదవండి
సినిమాటోగ్రఫి: శ్రీజిత్ చెరువుపల్లి, విశ్వ దేవబత్తుల
ఎడిటింగ్: హరిశంకర్ టీఎన్
నిర్మాతలు: శ్రీమతి తబితా సుకుమార్ (సమర్పకురాలు) నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, శేష సింధురావు
రచన, దర్శకత్వం: పద్మావతి మల్లాది
కమర్షియల్ సినిమాల యుగంలోనూ అప్పుడప్పుడూ కొన్ని కళాత్మక సినిమాలు వస్తుంటాయి. ఆఫ్ బీట్ కాన్సెప్టుతో వచ్చే ఆ సినిమాలకు బాగుంది, బాలేదు అనే రెండు మాటలతో చెప్పలేం. అలాంటి సినిమానే గాంధీ తాత చెట్టు. సుకుమార్ కూతురు సుకృతి కీలక పాత్రలో నటించిన సినిమా ఇది. మరి ఈ సినిమా ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం..
కథ:
తెలంగాణాలోని ఓ గ్రామంలో అందరికీ మంచి పొలాలుంటాయి. ఎవరికి వాళ్లు చెరుకు పంట పండించుకుని అదే ఊళ్లో ఉన్న ఫ్యాక్టరీకి అమ్ముకుంటూ హాయిగా జీవనం సాగిస్తుంటారు. అదే ఊళ్లో ఉండే ఓ పెద్దాయన రామచంద్రయ్య (ఆనంద చక్రపాణి). గాంధీ మహాత్ముడు చనిపోయినపుడు ఆయన గుర్తుగా ఓ చెట్టును తండ్రితో కలిసి నాటుతాడు రామచంద్రయ్య. అప్పట్నుంచి ఆ చెట్టును ప్రాణంలా చూసుకుంటాడు. ఆయన మనవరాలు గాంధీ (సుకృతి). అదే ఊళ్లో ఉన్న స్కూల్‌లో చదువుకుంటుంది. అంతా సాఫీగా సాగుతున్న సమయంలో ఆ ఊళ్లో ఉన్న చెరుకు ఫ్యాక్టరీ మూత పడుతుంది. దాంతో ఓ బిజినెస్ మెన్ (రాగమయూర్) ఆ ఊరికి వచ్చి రైతుల దగ్గర పొలాలు కొనేస్తాడు. కానీ ఆ ఫ్యాక్టరీ కట్టడానికి దారిచ్చే పొలం మాత్రం రామచంద్రయ్య దగ్గర ఉంటుంది. ఆయన మాత్రం పొలం అమ్మడానికి అస్సలు ఒప్పుకోడు. కానీ కొడుకు మాత్రం కూడా పొలం అమ్మేసి పట్నం పోతానంటాడు. ఆ క్రమంలోనే తండ్రిని నీచంగా మాట్లాడతాడు కొడుకు. అదే బాధతో చెట్టు దగ్గరికి వెళ్లి ప్రాణాలు విడుస్తాడు రామచంద్రయ్య. కానీ చనిపోయే ముందే మనవరాలితో చెట్టును కాపాడతావా అంటూ అడిగుతాడు. తాతకు ఇచ్చిన మాట కోసం గాంధీ ఏం చేసింది.. ఆ తర్వాత ఏం జరిగింది అనేది కథ..
కథనం:
కొన్ని సినిమాలను కమర్షియల్ కోణంలో కాకుండా.. కళాత్మక దృష్టిలోనే చూడాలి. గాంధీ తాత చెట్టు కూడా అలాంటి సినిమానే. ఇది కమర్షియల్ కాదు.. డబ్బుల కోసం తీసిన సినిమా కాదు అని కథ మొదలైన కాసేపటికే క్లారిటీ వచ్చేస్తుంది. అలా చూస్తే మాత్రం గాంధీ తాత చెట్టు మనసును తాకే సినిమానే. బయటికి వచ్చేటపుడు కచ్చితంగా ఒక ఎమోషన్‌తో అయితే వస్తాం. మల్టీ నేషనల్ కంపెనీలు ఊళ్లకు వచ్చి రైతులను, అక్కడి వనరులను ఎలా దోచుకుంటున్నారనే కాన్సెప్ట్‌తో ఖైదీ నెం 150 లాంటి సినిమాలు కూడా వచ్చాయి. ఇది మరో రకంగా చెప్పిన కథ. ఈ సినిమాలోనూ రైతుల కష్టాలనే మరో విధంగా చూపించింది దర్శకురాలు పద్మావతి. ఫస్టాఫ్ అంతా సరదాగా గడిచిపోతుంది. తాత, మనవరాలి మధ్య వచ్చే సన్నివేశాలు బాగున్నాయి. మరోవైపు సుకృతి కూడా చాలా బాగా నటించింది. గాంధీ పాత్రలో ఆమె అమాయకత్వం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. అంతేకాదు.. ఈ సినిమాకు ఉన్న మరో అడ్వాంటేజ్ భాష.. తెలంగాణ నేపథ్యం.. తెలంగాణ యాస. భాష, యాసలను అద్భుతంగా చూపించారు.. పల్లెటూరులో ఉండే పద్ధతులను కూడా చాలా బాగా ఆవిష్కరించారు. అందుకే సినిమా విడుదలకుముందే పలు అంతర్జాతీయ అవార్డులు అందుకుందేమో అనిపిస్తుంది. పట్నం మోజులో పుట్టిన పుట్టిన ఊరిని, సొంత ఇంటిని, ఉన్న పొలాన్ని లెక్కచేయకుండా వెళదామనుకున్న వాళ్లకు ఈ సినిమా కనువిప్పు కలిగిస్తుందనేలా సాగుతుంది కథ. ఎక్కడా ట్విస్టులు లేకుండా సాఫీగా సాగిపోతుంది కథ. అదొక్కటే సినిమాకు మైనస్. అయితే ముందుగానే మనం చెప్పుకున్నట్లు దీన్ని కమర్షియల్ కోణంలో చూడకూడదు. సెకండాఫ్ అంతా మనవరాలి చుట్టూనే కథ తిరుగుతుంది. ముఖ్యంగా క్లైమాక్స్‌లో ఊరంతా ఒక్కటై ఒకే తాటిమీదకు రావడం కూడా బాగా అనిపిస్తుంది.
నటీనటులు:
సుకుమార్ కూతురు సుకృతి వేణి చాలా బాగా నటించింది. కథ అంతా ఆ అమ్మాయి చుట్టూనే తిరుగుతుంది. ఫస్టాఫ్ ఎంత చిన్నపిల్లగా చిలిపిగా, అమాయకంగా కనిపించిందో.. సెకండాఫ్‌లో అంత మెచ్యూర్డ్‌గా నటించింది ఈ పాప. గాంధేయ మార్గంలో సాధించలేనిది ఏదీ లేదనే పాత్రలో చాలా బాగా నటించింది. కచ్చితంగా ఈమె నటనకు ప్రశంసలు అయితే రావడం ఖాయం. ఇక తాత పాత్రలో ఆనంద చక్రపాణి కూడా చాలా బాగా నటించారు. ఆయన ఉన్నంత సేపు ఆకట్టుకుంటాడు. కొడుకు, కోడలు పాత్రలు కూడా చాలా న్యాచురల్‌గా ఉన్నాయి. ఇక బిజినెస్ మెన్ పాత్రలో రాగమయూర్ నటన బాగుంది. మిగిలిన వాళ్లు కూడా తమతమ పాత్రలకు న్యాయం చేసారు.
టెక్నికల్ టీం:
ఈ సినిమాకు రీ సంగీతం అందించారు. ఎక్కువగా బ్యాగ్రౌండ్ స్కోర్ లేకుండా న్యాచురల్‌గానే కథ సాగింది. ఉన్న రెండు పాటలు తెలంగాణ యాసలో సాగాయి. సినిమాటోగ్రఫీ సహజంగా అనిపించింది. ఎడిటింగ్ కూడా పర్లేదు. పాటలు బాగున్నాయి. సుద్దాల అశోక్ తేజ బ్రాండ్ కనిపించింది. దర్శకురాలు పద్మావతి చాలా సింపుల్ కథను మనసుకు తాకేలా తెరకెక్కించారు. కమర్షియల్ కాకుండా అనుకున్న విధంగా సినిమాను రూపొందించారు.
పంచ్ లైన్:
గాంధీ తాత చెట్టు.. ఓ మంచి సినిమా..!