ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1, 2025న కేంద్ర బడ్జెట్‌ను సమర్పిస్తారు. ఈ బడ్జెట్‌పై సాధారణ ప్రజలకు చాలా అంచనాలు ఉన్నాయి. మీడియా నివేదికల ప్రకారం, 2025 బడ్జెట్ సమయంలో మహిళలు, రైతులు, రైల్వేలు, ఆదాయపు పన్నుకు సంబంధించి పెద్ద ప్రకటనలు చేయవచ్చు. మరోవైపు బంగారంపై కస్టమ్స్ సుంకం పెంపుపై ఊహాగానాలు జోరందుకున్నాయి. దిగుమతులను నియంత్రించేందుకు, వాణిజ్య లోటును తగ్గించేందుకు ప్రభుత్వం ఇలాంటి చర్య తీసుకోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకుంటే దేశీయ మార్కెట్‌లో బంగారం ధర వేగంగా పెరగవచ్చు. దేశంలో 999 స్వచ్ఛత కలిగిన బంగారం ధర 10 గ్రాములకు రూ.79453గా ఉంది. ప్రభుత్వం బడ్జెట్‌లో దిగుమతి సుంకాన్ని పెంచితే, దేశంలో బంగారం ధర మరింత పెరగవచ్చు.
బంగారంపై దిగుమతి సుంకం పెరుగుతుందా?
మోడీ ప్రభుత్వం జూలై 2024లో సమర్పించిన బడ్జెట్‌లో బంగారం, వెండిపై కస్టమ్స్ సుంకాన్ని 15% నుండి 6%కి తగ్గించింది. దీని వల్ల బంగారం ధర భారీగా తగ్గింది. ఆగస్టు 2024లో భారతదేశంలో బంగారం దిగుమతులు 104% పెరిగి $10.06 బిలియన్లకు చేరుకున్నాయి.
బడ్జెట్ తర్వాత బంగారం ధర పెరుగుతుందా?
పెరిగిన సుంకం వల్ల దేశీయంగా బంగారం ధర భారీగా పెరగొచ్చని నిపుణులు చెబుతున్నారు. 2024లో భారతదేశం $47 బిలియన్ల విలువైన బంగారాన్ని దిగుమతి చేసుకుంది. 2023లో $42.30 బిలియన్ల కంటే ఎక్కువ. పెరుగుతున్న దిగుమతులను నియంత్రించడానికి ప్రభుత్వం కస్టమ్స్ సుంకాన్ని పెంచవచ్చు. ఇదే జరిగితే బంగారం ధర పెరగడం అనివార్యం.
బంగారం కొనడానికి ఇదే సరైన సమయమా?
ప్రభుత్వం బంగారంపై కస్టమ్ డ్యూటీని పెంచితే బంగారం ధర మరింత పెరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఫిబ్రవరి 1లోపు బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమని నిపుణులు భావిస్తున్నారు. అయితే, కస్టమ్ డ్యూటీని పెంచకపోతే బంగారం ధరలు పెద్దగా పెరిగే అవకాశం లేదు. బడ్జెట్‌లో తయారీని ప్రోత్సహించడానికి ప్రభుత్వం అనేక వస్తువుల ముడి పదార్థాలపై కస్టమ్ డ్యూటీని తగ్గించవచ్చు. ఇందులో వైద్య పరికరాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, పాదరక్షలు మొదలైనవి ఉన్నాయి. ఇది జరిగితే, ఈ పరిశ్రమలకు తక్కువ ధరలకు ముడి పదార్థాలు లభిస్తాయి. ఇదే జరిగితే వీటి ధరలు కూడా తగ్గే అవకాశం ఉండటం వల్ల సామాన్యులకు మేలు జరుగుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి