వయసుతో సంబంధం లేకుండా గుండె జబ్బులు చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. దీని బారిన పడుతున్న వారిలో ఎక్కువగా యువతే ఉండటం గమనార్హం. శరీరం ముందుగానే ఈ ప్రమాదాన్ని పసిగట్టి కొన్ని సంకేతాలను చూపుతుంది. వాటిని నిర్లక్ష్యం చేయకుండా అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. గుండె పనితీరు బలహీన పడుతుందని తెలిపే ఈ 5 లక్షణాలపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
1. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది..
గుండె సమస్యలు పొంచి ఉన్నాయని తెలిపే వాటిల్లో అత్యంత ముఖ్యమైంది శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడం. ఎలాంటి కష్టమైన పనులు చేయకున్నా, కాస్తంత దూరం నడిచినా ఊపిరి ఆడకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వడం బెటర్. ఎందుకంటే నిర్ల క్ష్యం చేస్తే మరింత నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. చాలా సార్లు గుండె సమస్యలు ఉన్న వారిలో ఊపిరి ఆడకపోవడం కనిపిస్తుంది. గుండె కండరాలు దెబ్బతిన్నప్పుడు శరీరానికి అవసరమైన రక్తాన్ని పంప్ చేయడంలో సమస్యలు ఏర్పడతాయి. దీని వల్ల ఆ వ్యక్తులు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కుంటారని నిపుణులు సూచిస్తున్నారు. అయితే అన్నిసార్లు ఇది గుండె సమస్యగానే భావించాల్సిన పనిలేదు. కొన్నిసార్లు ఊపిరితిత్తుల సమస్య, అనేమియా, విటమిన్ డెఫిషియన్సీ వంటివి కూడా దీనికి కారణం కావచ్చు.
2. నీరసం కమ్మేస్తుందా?
గుండె బలహీనంగా ఉన్న వారు నీరసంగా ఉంటారు. ఏ చిన్న పని చేయాలన్నా నిస్సత్తువ కమ్మేస్తుంటుంది.ఇలా జరుగుతుంది. శరీరానికి తగినంత ఆక్సిజన్ అందించడంలో గుండె విఫలమైనప్పుడు కొన్ని సార్లు ఇది సర్వసాధారణమే అయినా.. బరించలేనంత నీరసం అనిపిస్తుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
3. వాపుతో జాగ్రత్త..
గుండె రక్తాన్ని సరిగ్గా పంప్ చేయలేనప్పుడు కొన్ని రకాల ద్రవాలు శరీరంలో పేరుకుపోతాయి. అవి శరీర భాగాల్లో వాపుకు కారణమవుతాయి. ముఖ్యంగా పాదాలు, చేతుల్లో నొక్కితే గుంట పడే విధంగా వాపు కనపడుతుంది. కొన్నిసార్లు ఇది తీవ్రమైన నొప్పిని కూడా కలుగజేస్తుంది.
4. ఫాస్ట్ హార్ట్ బీట్..
సాధారణ స్థాయి కంటే గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంటే అది గుండె అనారోగ్యాన్ని సూచిస్తుందని భావించాలి. దీన్నే ర్యాపిడ్ హార్ట్ బీట్ అంటారు. గుండె పనితీరు మందగించినప్పుడు ఈ లక్షణం కనపడుతుంది. కొన్ని సార్లు ఉన్నట్టుండి చెమటలు పట్టేయడం కూడా దీర్ఘకాలిక గుండె సమస్యల ముప్పును తెలుపుతుంది.
5. ఛాతిలో నొప్పి..
ఎక్కువ మసాలా పదార్థాలు, గ్యాస్ ను కలుగజేసేవి తిన్నప్పుడు సాధారణంగానే ఛాతిలో నొప్పిగా అనిపిస్తుంది. అయితే, అన్నిసార్లూ దీన్ని గ్యాస్ సమస్యగానే కొట్టిపారేయలేం. తరచూ ఛాతిలో నొప్పి కలుగుతుంటే వైద్యులను సంప్రదించాలి. అలాగే ఉన్నట్టుండి బరువు పెరగటం కూడా గుండె జబ్బులను తెలియజేస్తుంది.