హైదరాబాద్ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెట్రో రెండో దశ పనులకు శ్రీకారం చుట్టింది రేవంత్ రెడ్డి సర్కార్. ఇందుకోసం ప్రభుత్వం పరిపాలనా అనుమతులు జారీ చేసింది. రెండో దశలో 76.4 కిలోమీటర్ల మేర మెట్రో రైలు నిర్మాణం చేపట్టేందుకు అనుమతి లభించింది. ఈ మేరకు ప్రభుత్వం జీవో 196ని జారీ చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో రెండో దశ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టనున్నారు. మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.24,269 కోట్లు కాగా.. రాష్ట్ర ప్రభుత్వ వాటాగా రూ.7,313 కోట్లను వెచ్చించనుంది. ప్రస్తుతం నగరంలో కొత్తగా 5 మార్గాల్లో మెట్రో రెండో దశ పనులు చేపట్టనున్నారు. కారిడార్ 4లో నాగోలు- శంషాబాద్ విమానాశ్రయం వరకు 36.8 కిలో మీటర్లు, కారిడార్ 5లో రాయదుర్గ- కోకాపేట వరకు 11.6 కిలో మీటర్లు, కారిడార్ 6లో ఎంజీబీఎస్ నుంచి చాంద్రయాణగుట్ట వరకు 7.5 కిలో మీటర్లు, కారిడార్ 7లో మియాపూర్ నుంచి పటాన్ చెరువు వరకు 13.4 కిలో మీటర్లు, కారిడార్ 8లో ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్ వరకు 7.1 కిలో మీటర్లు నిర్మించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
రెండో దశలో మొత్తం 116.4 కిలోమీటర్లు మెట్రో రైలు మార్గాన్ని నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు వివరించారు. అయితే అందులో మొదటగా పార్ట్ ఏ కింద 76.4 కిలోమీటర్ల మార్గానికి పరిపాలన అనుమతులు మంజూరు చేశామని, పార్ట్ -బిలో నిర్మించనున్న శంషాబాద్ విమానాశ్రయం నుంచి వ్యూచర్ సిటీ వరకు 40 కిలో మీటర్ల మార్గానికి సర్వే జరుగుతుందని ప్రభుత్వం తెలిపింది. ఇక హైదరాబాద్ మెట్రో ద్వారా ప్రస్తుతం రోజుకు దాదాపు 5 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. రెండో దశ కూడా అందుబాటులోకి వస్తే రోజుకు మరో 8 లక్షల మంది మెట్రోలో ప్రయాణించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
మెట్రో రైల్ రెండో దశలో పార్ట్-ఏ ఐదు కారిడార్లు ఇలా..
- కారిడార్-4లో నాగోలు-శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ (36.8 KM)
- కారిడార్-5లో రాయదుర్గం-కోకాపేట్ (11.6 కి.మీ)
- కారిడార్-6లో ఎంజీబీఎస్-చాంద్రాయణగుట్ట (7.5 కి.మీ)
- కారిడార్-7లో మియాపూర్-పటాన్‌చెరు (13.4 కి.మీ)
- కారిడార్-8లో ఎల్బీనగర్-హయత్‌నగర్ (7.1 కి.మీ)
- మెట్రో రైల్ రెండో దశలో పార్ట్-బీగా 40 కి.మీ.
- కారిడార్ 9లో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్-ఫ్యూచర్ సిటీ
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..