అక్రమ వలసదారులపై అమెరికా ఉక్కుపాదం మోపి వారివారి దేశాలకు వెనక్కి పంపుతుంటే.. భారత్‌లో మాత్రం అందుకు పూర్తి భిన్నమైన పరిస్థితి నెలకొంది. అక్రమంగా భారత్‌లో చొరబడి నివసిస్తున్నవారిని వెనక్కి పంపకుండా కాలయాపన చేస్తున్న అస్సాం ప్రభుత్వంపై ఏకంగా సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అమెరికాలో వీసా గడువు ముగిసిన తర్వాత కూడా అక్కడే ఉంటున్నవారితో పాటు అక్రమ మార్గాల్లో ఆ దేశంలోకి చొరబడి స్థానిక అమెరికన్ల అవకాశాలను కొల్లగొడుతున్నవారు లక్షల సంఖ్యలో ఉన్నారు. వారందరినీ వెనక్కి పంపి స్థానిక అమెరికన్లకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తానంటూ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన ట్రంప్, అధికారంలోకి వచ్చిన మర్నాటి నుంచే ఏరివేత కార్యక్రమం చేపట్టారు. అలా ఆ దేశంలో అక్రమంగా నివసిస్తున్నవారిలో సుమారు 18,000 మంది భారతీయులు ఉన్నారని అమెరికన్ ప్రభుత్వ సంస్థలు గుర్తించాయి. వారందరినీ డిటెన్షన్ సెంటర్లలో పెట్టిన అమెరికా, 205 మందిని మిలటరీ విమానం సీ-17లో ఎక్కించి భారత్‌కు వెనక్కి పంపించింది. టెక్సాస్ నుంచి బయలుదేరిన ఆ విమానం భారత్‌లోని అమృత్‌సర్ చేరుకుంది.
నిజానికి భారతీయులను ప్రపంచవ్యాప్తంగా “మోస్ట్ యాక్సెప్టబుల్ కమ్యూనిటీ”గా చెబుతుంటారు. అంటే ఏ దేశానికి వెళ్లినా సరే.. భారతీయులు అక్కడి సంస్కృతి, సాంప్రదాయాలను, చట్టాలను గౌరవిస్తూ.. తమ సంస్కృతిని సైతం కాపాడుకుంటూ జీవనం గడుపుతుంటారు. భారతీయుల కారణంగా స్థానికంగా ఆయా దేశాల్లోని యువతకు ఉపాధి అవకాశాలు తగ్గుతాయి తప్ప శాంతిభద్రతల పరంగా ఎన్నడూ విఘాతం కల్గించిన దాఖలాలు లేవు. అదే పాకిస్తాన్, సిరియా, ఇరాన్, ఇరాఖ్ వంటి మధ్య ఆసియా, పశ్చిమాసియా దేశాల నుంచి శరణార్థులుగా యూరప్ దేశాలకు వెళ్లినవారు శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తూ.. అత్యాచారాలు, హత్యలకు పాల్పడుతూ అక్కడి సమాజంలో అలజడి సృష్టిస్తున్నారు. కొందరైతే ఏకంగా మతోన్మాదంతో ఉగ్రవాద చర్యలకు సైతం తెగబడుతూ మారణహోమాలు సృష్టిస్తున్నారు. ఈ తరహా పరిస్థితులు భారతీయుల కారణంగా తలెత్తలేదు. అయితే అక్రమమార్గాల్లో ఏ దేశానికి ఎవరు వెళ్లినా అది చట్ట విరుద్ధమే. అలా వెళ్లి అమెరికాలో ఉంటున్న భారతీయల విషయంలో భారత ప్రభుత్వం సైతం అమెరికా ప్రభుత్వానికి సహకరిస్తామని ప్రకటించింది. కానీ భారత్‌లోకి అక్రమంగా చొరబడి నివసిస్తున్నవారి విషయంలో ఏం చేస్తోంది? ఇదే ప్రశ్న ఇప్పుడు సుప్రీంకోర్టు సంధించింది.
ముహూర్తం కోసం ఎదురుచూస్తున్నారా?
అక్రమ చొరబాటుదారులుగా గుర్తించినవారిని వెంటనే వెనక్కి పంపకుండా మీనమేషాలు లెక్కిస్తున్న అస్సాం ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ముహూర్తం కోసం ఎదురుచూస్తున్నారా అంటూ జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విరుచుకుపడింది. బంగ్లాదేశ్‌తో సరిహద్దు కల్గిన పశ్చిమ బెంగాల్, అస్సాం వంటి రాష్ట్రాల్లో అక్రమ చొరబాట్ల సమస్య చాలా ఎక్కువగా ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. అందులో తృణమూల్ కాంగ్రెస్ పాలిత పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశీ అక్రమ వలసదారులకు ఓటర్ ఐడీ కార్డు సహా ప్రభుత్వ ఫలాలన్నీ అందజేస్తూ ఓటుబ్యాంకుగా మార్చుకుంటోంది. అలా వచ్చిన బంగ్లాదేశీ చొరబాటుదారులు స్థానిక ప్రజల ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కొల్లగొట్టడమే కాదు, మతోన్మాదాన్ని ప్రదర్శిస్తూ ఉగ్రవాద కార్యాకలాపాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం సరిహద్దు రాష్ట్రాల్లో నేషనల్ రిజిస్ట్ర్ ఆఫ్ సిటిజన్స్ (NRC)ని తీసుకొచ్చి అక్రమ చొరబాటుదారులను గుర్తించే ప్రక్రియ చేపట్టింది. అలా గుర్తించినవారిని వెనక్కి పంపే క్రమంలో డిటెన్షన్ సెంటర్లలో పెట్టింది. అలా గుర్తించిన 63 మందిని వెనక్కి పంపకపోవడంపై సుప్రీంకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.
“ఒకసారి ఒక వ్యక్తిని అక్రమ చొరబాటుదారుడిగా గుర్తించాక, ఆ తర్వాత తీసుకోవాల్సిన చర్య వెనక్కి పంపించడం. ఆర్టికల్ 21 ప్రకారం ఎల్లకాలం డిటెన్షన్ సెంటర్లో పెట్టడం కుదరదు. అస్సాంలో ఇలాంటి డిటెన్షన్ సెంటర్లు చాలా ఉన్నాయి. వాటి నుంచి ఎంతమందిని వెనక్కి పంపారు?” అంటూ జస్టిస్ భుయాన్ ప్రశ్నించారు. అక్రమ చొరబాటుదారులు ఏ దేశం నుంచో వచ్చారో తెలిసినా.. వారి చిరునామాలు తెలియక వారిని డిటెన్షన్ సెంటర్లలో ఉంచామన్న సమాధానాన్ని తప్పుబడుతూ.. వారిని ఆయా దేశాల రాజధానులకు పంపించండి అంటూ సుప్రీంకోర్టు సూచించింది. అడ్రస్ తెలియదు అన్న కారణం చూపుతూ ఎంత కాలం డిటెన్షన్ సెంటర్లలో ఉంచుతారంటూ జస్టిస్ ఓకా ప్రశ్నించారు.
అక్రమ చొరబాటుదారులను వెంటనే బహిష్కరించాలని ధర్మాసనం పేర్కొంది. “వారి దేశం ఏదో మీకు తెలుసు. వారి చిరునామా తెలిసే వరకు మీరు ఎలా వేచి ఉండగలరు? వారు ఎక్కడికి వెళ్లాలో ఆ దేశం నిర్ణయించుకుంటుంది.” అంటూ ధర్మాసనం వ్యాఖ్యానించింది. వారిని వెనక్కి పంపే విషయంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ సహాయం కోరుతూ ప్రతిపాదనను ఎందుకు సమర్పించలేదని అస్సాం ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నించింది.
అమెరికా అనుసరిస్తున్న వైఖరి చూసైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మేల్కోవాల్సిన పరిస్థితి ఉంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..