సౌతాఫ్రికాతో జరిగిన నాల్గవ టీ20 లో భారీ విజయం సాధించిన టీమిండియా నాలుగు మ్యాచుల సిరీస్ ను 3-1 తో కైవసం చేసుకుంది. అయితే గత మ్యాచ్ లో బౌలింగ్ లో అద్భుత ప్రదర్శన చేసిన ఆర్ష్‌దీప్ సింగ్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. సిరీస్ మొదటి రెండు మ్యాచుల్లో తన స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోయిన ఆర్ష్‌దీప్, ఆఖరి రెండు మ్యాచ్‌లలో మళ్లీ తన ప్రతాపం చూపించాడు. ఆర్ష్‌దీప్ మూడో, నాలుగో టీ20లో దుమ్మురేపుతూ దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌ను లైనప్ ను ఇబ్బందులకు గురిచేశాడు.
నాలుగో టీ20లో భారత్ భారీగా 283/1 స్కోర్ సాధించిన తర్వాత, ఆర్ష్‌దీప్ తన పవర్‌ప్లే స్పెల్‌తో దక్షిణాఫ్రికా బ్యాటింగ్ లైనప్‌ను కకావికలం చేశాడు. రీజా హెండ్రిక్స్, కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్, హీన్రిచ్ క్లాసెన్‌ను పవర్ ప్లే ఓవర్లలోనే పెవిలియన్‌కు పంపాడు. ఈ మ్యాచ్‌లో అతను 3 ఓవర్లలో 20 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశాడు.
రీజా హెండ్రిక్స్‌ను ఔట్ చేసేందుకు ఓవర్ ది వికెట్ బౌల్ చేస్తూ ఒక అద్భుతమైన బంతితో అతన్ని పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత మార్క్రమ్‌ను ఊరించేలా బంతి వేసి బుట్టలో పడేశాడు. అనంతరం వెంటనే క్రీజులోకి వచ్చిన క్లాసెన్‌ను ఇన్‌స్వింగ్ బంతితో ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేశాడు.
“ఆర్ష్‌దీప్ జట్టుకు చాలా కీలకమైన ఆటగాడు. ప్రతిసారి క్రంచ్ సిట్యూషన్లలో తన సత్తా చాటుతాడు, ఈ రోజు కూడా అలానే చేశాడు. గతంలో ఇక్కడకు వచ్చి ఇదే పిచ్, ఇదే పరిస్థితుల్లో ఆడాం. అతని ప్రదర్శన అద్భుతం,” అని సూర్యకుమార్ పోస్ట్-మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో చెప్పాడు. మ్యాచ్ లో “లైట్లు ఆన్ అయిన తర్వాత వాతావరణం కొంచెం చల్లగా అనిపించింది. ఫాస్ట్ బౌలర్లందరూ బ్యాటర్లతో మాట్లాడారు. పిచ్ ఎలా ఉంది? బంతులను ఎటువంటి లెంగ్త్‌లలో వేయాలి? ఇలా అన్నీ ఆలోచించి మొదటి ఆరు ఓవర్లలో అదిరిపోయే ప్రదర్శన చేశారు. పవర్ ప్లే ముగిసే సరికే మ్యాచ్ మా చేతిలోకి వచ్చిపోయింది,” అని సూర్యకుమార్ వివరించాడు.
భారత బ్యాటర్లు మరియు దక్షిణాఫ్రికా బ్యాటర్ల మధ్య స్పష్టమైన వ్యత్యాసం కనిపించింది. భారత్ స్వేచ్ఛగా ఆడుతుండగా, దక్షిణాఫ్రికా ఆరంభం నుంచే కష్టపడింది. కాగా సిరీస్ ముగిసిన తర్వాత, యువ ఆటగాళ్లు తిరిగి స్వదేశానికి బయలుదేరనన్నానరు. స్వదేశానికి వచ్చాక వారందూ రంజీ ట్రోఫీ సీజన్‌లో భాగం కానున్నారు.