ఉన్నత విద్య అభ్యసించేందుకు భారత్ నుంచి కెనడాకు వెళ్లిన దాదాపు 20 వేల మంది విద్యార్ధులు కనబడకుండా పోయారు. వీరంతా అక్కడి విద్యాసంస్థల్లో అసలు ప్రవేశాలు పొందలేదని, వాళ్లెక్కడ ఉన్నరన్నదానిపై అక్కడి ప్రభుత్వం వద్ద ఎటువంటి రికార్డులు కూడా లేవని తాజా నివేదికలు వెల్లడించాయి. ఇలా కెనడాకు చదువు కోసం వచ్చిన విద్యార్ధుల్లో చాలా మంది చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని, నిజంగా చదువుకోవాలని ఆశతో అక్కడికి చేరుకున్న భారతీయ విద్యార్థులు.. కెనడా యూనివర్సిటీల్లో అడ్మిషన్లు పొందలేకపోతున్నట్లు నివేదికలు తెలిపాయి. అందుకు కారణం.. కెనడాలో కుప్పలు తెప్పలుగా ఉన్న ఫేక్ యూనివర్సిటీలే కారణమని బట్టబయలైంది. మన విద్యార్ధులు అక్కడికి చేరుకున్న తర్వాత తామకు ప్రసిద్ధ యూనివర్సిటీల పేరుతో వచ్చిన ఆఫర్లన్నీ నకిలీవని, అలాంటి సంస్థలు కెనడా దేశంలో ఎక్కడా లేవని తేలడంతో వారంతా అక్కడ చిన్నాచితకా ఉద్యోగాలు చేసుకుంటూ పొట్టపోసుకుంటున్నట్లు సమాచారం.
బ్రాంప్టన్‌లోని ఓ ప్రఖ్యాత కాలేజీ నుంచి అడ్మిషన్ ఆఫర్ వచ్చిన హర్యానాకు చెందిన 24 ఏళ్ల విద్యార్థి ఇటీవల కెనడాకి వెళ్లాడు. అతని అడ్మిషన్ లెటర్‌లో ఉన్న చిరునామాలో క్లాస్ రూమ్‌లకు బదులు ఒక చిన్న కార్యాలయం ఉండటం కనుగొన్నాడు. అయితే అక్కడ అడ్మిషన్లన్నీ ఫిల్ అయ్యాయని, కొంత కాలం వేచి ఉండగమని చెప్పారట. అలా ఎన్ని వారాలు గడిచిపోయిన సదరు కాలేజీ నుంచి పిలుపు రాకపోవడంతో మోసపోయినట్లు గ్రహించానన్నాడు. అదృష్టవశాత్తూ ఏడాదికి మొత్తం రూ.12 లక్షల ట్యూషన్ ఫీజులో రూ.4.2 లక్షలు మాత్రమే చెల్లించానని, అదే మొత్తం ఫీజు చెల్లించి ఉంటే నిండా మునిగేవాడినని ఆవేదన వ్యక్తం చేశాడు.
హర్యానాలో ఫోన్ కాల్స్ ద్వారా మాట్లాడిన విద్యార్థి ఏజెంట్ అదనపు రుణం తీసుకోకుండా పార్ట్ టైమ్ జాబ్ చేసి మిగిలిన ఫీజు చెల్లించాలని సూచించాడు. దీంతో చేసేదిలేక తనను తాను పోషించుకోవడానికి స్థానిక గ్యాస్ స్టేషన్‌లో పనిచేయడం ప్రారంభించాడు. ఇలా కొంత మంది ఫేక్ కాలేజీలతో మోసపోతే.. మరికొంత మంది ఉద్యోగం కోసం కెనడాలోకి ప్రవేశించడానికి విద్యార్థి వీసాలను ఉపయోగించుకుంటున్నారు. US, ఆస్ట్రేలియా వంటి దేశాల మాదిరిగా కాకుండా, అంతర్జాతీయ విద్యార్థులు ట్యూషన్ ఫీజులను ముందస్తుగా చెల్లించాల్సిన అవసరంలేని కెనడాలో స్టూడెంట్ వీసా విధానం ఈ విధంగా దుర్వినియోగానికి గురవుతుంది. గుజరాత్‌లోని వల్సాద్‌కు చెందిన 27 ఏళ్ల వ్యక్తి రెండు సంవత్సరాలకు 7.5 లక్షల రుసుముతో కమ్యూనిటీ కాలేజీలో అడ్మిషన్ పేరిట కెనడాకి వెళ్లాడు. కెనడాలో మాస్టర్స్ డిగ్రీ ఖర్చు కంటే ఇది చాలా తక్కువ. కానీ అతడు అక్కడ రోజుకు రెండు ఉద్యోగాలు చేస్తూ భారత్‌లోని తన కుటుంబానికి డబ్బు పంపిస్తున్నాడు. పగలు రెస్టారెంట్‌లో, రాత్రిపూట ఫుడ్ డెలివరీలో పని చేస్తూ డబ్బు సంపాదిస్తున్నాడు. ఇది చట్టవిరుద్దమని తనకు తెలుసని, కానీ వేరే మార్గం లేదని, కెనడాలో మంచి కాలేజీల్లో చేరిన వారు కూడా తనలాగే ఇదే ఉద్యోగాలు చేస్తున్నారని చెప్పడం విశేషం.
ఇవి కూడా చదవండి
తెలంగాణలోని ఖమ్మంకు చెందిన 26 ఏళ్ల వ్యక్తి సర్రేలోని ఓ కళాశాలలో అడ్మిషన్ పొందాడు. కానీ అతడెప్పుడూ క్లాస్‌లక హాజరు కాలేదు. బదులుగా, అక్కడ గంటకు ఏడు డాలర్ల చొప్పున జీతంతో ఓ మొబైల్ షాప్‌లో ఫుల్ టైం వర్కర్‌గా పనిచేస్తున్నాడు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలుకు చెందిన 25 ఏళ్ల వ్యక్తి టొరంటోలో డెలివరీ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. ఇలా గుజరాత్, పంజాబ్ , హర్యానా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర నుంచి అధిక మంది స్టూడెంట్ వీసాలతో కెనడా చేరుకుని.. అక్కడ చిన్నాచితక ఉద్యోగాలు చేసుకుంటున్నారు. వీరిలో కొంతమంది విద్యార్థులు కెనడా నుంచి అక్రమంగా యునైటెడ్ స్టేట్స్‌లోకి కూడా ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నట్లు నివేదికలు వెల్లడించాయి. అయితే ఇమ్మిగ్రేషన్‌పై మాజీ ఫెడరల్ ఆర్థికవేత్త హెన్రీ లాటిన్ మాట్లాడుతూ.. కెనడాలో తప్పిపోయిన భారతీయ విద్యార్థులలో ఎక్కువ మంది ఆ దేశ సరిహద్దు దాటలేదని, ఇప్పటికీ కెనడాలోనే ఉన్నారని, అక్కడ చిన్న పనులు చేసుకుంటూ శాశ్వత నివాసం కోసం ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. గతేడాది కెనడాలో ఆశ్రయం పొందిన అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగిందని, స్థూలంగా 10% మంది విద్యార్థి వీసా హోల్డర్ల ఆచూకీ తెలియడం లేదని అన్నారు. మొదటిసారిగా స్టూడెంట్ వీసా హోల్డర్ల డేటా ఉన్నప్పటికీ.. వారంతా ఎక్కడ ఉన్నారన్నది ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్నగానే మిగిలిపోయిందని అన్నారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.