ఐపీఎల్ 2025 వేలంలో ఫాస్ట్ బౌలర్లు తాము అనుకున్నదానికంటే అధిక ప్రాధాన్యతను పొందారు. జెడ్డాలో జరిగిన ఈ రెండు రోజుల వేలం ప్రక్రియలో మొత్తం ₹150 కోట్లకు పైగా ఫ్రాంచైజీలు పేసర్ల కోసం వెచ్చించాయి. ఈ వేలం ఫాస్ట్ బౌలర్ల భవితవ్యాన్ని మార్చడంతో పాటు వారి విలువను, వారి ప్రాముఖ్యతను మరోమారు తెలియజేసింది.
భారత లెఫ్టార్మ్ పేసర్ అర్షదీప్ సింగ్ ఈ వేలంలో అత్యధికంగా ధర పలికిన బౌలర్‌గా నిలిచాడు. పంజాబ్ కింగ్స్ తనను రైట్-టు-మ్యాచ్ కార్డు ద్వారా ₹18 కోట్లకు తమ జట్టులో నిలుపుకున్నారు. ముంబై ఇండియన్స్, తమ గత న్యూజిలాండ్ పేసర్ ట్రెంట్ బౌల్ట్‌ను తిరిగి జట్టులో చేర్చుకోవడానికి ₹12.50 కోట్లు వెచ్చించింది. అంతే కాకుండా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆస్ట్రేలియన్ స్టార్ జోష్ హేజిల్‌వుడ్‌ను అదే ₹12.50 కోట్లకు కొనుగోలు చేసింది.
స్వింగ్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ తన అనుభవంతో అందరినీ ఆకట్టుకున్నాడు. అతన్ని కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ₹10.75 కోట్లకు తమ శిబిరంలో చేర్చుకున్నారు. మిచెల్ స్టార్క్, టీ నటరాజన్, మహ్మద్ షమీ, ప్రసిద్ క్రిష్ణ, దీపక్ చహర్ వంటి ఆటగాళ్లు భారీ ధరలకు అమ్ముడయ్యారు, తమ జట్లలో కీలక పాత్రలు పోషించేందుకు సిద్ధంగా ఉన్నారు.
ఈ వేలంలో అగ్రశ్రేణి ఫాస్ట్ బౌలర్లు పలికిన ధర వివరాలు
అర్షదీప్ సింగ్: ₹18 కోట్లు (పంజాబ్ కింగ్స్) ట్రెంట్ బౌల్ట్: ₹12.50 కోట్లు (ముంబై ఇండియన్స్) జోష్ హేజిల్‌వుడ్: ₹12.50 కోట్లు (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) మిచెల్ స్టార్క్: ₹11.75 కోట్లు (డిల్లీ క్యాపిటల్స్) భువనేశ్వర్ కుమార్: ₹10.75 కోట్లు (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) టీ నటరాజన్: ₹10.75 కోట్లు (డిల్లీ క్యాపిటల్స్) మహ్మద్ షమీ: ₹10 కోట్లు (సన్‌రైజర్స్ హైదరాబాద్) అవేష్ ఖాన్: ₹9.75 కోట్లు (లక్నో సూపర్ జెయింట్స్) ప్రసిద్ధి క్రిష్ణ: ₹9.50 కోట్లు (గుజరాత్ టైటాన్స్) దీపక్ చహర్: ₹9.25 కోట్లు (ముంబై ఇండియన్స్)
వీరితో పాటూ ఆకాశ్ దీప్, తుషార్ దేశ్పాండే, అన్రిచ్ నోకియా వంటి ఆటగాళ్లు కూడా జట్లు మార్చుకొని తమ కెరీర్‌లో కొత్త అద్భుతాలకు తెర తీసే అవకాశాన్ని పొందారు.
ఈ వేలం ద్వారా ఫాస్ట్ బౌలర్లకు ఉన్న గిరాకీ స్పష్టంగా అర్థమవుతోంది. పేస్ ఆటగాళ్ల మీద పెట్టుబడులు పెట్టిన జట్లు, వారి ప్రదర్శనతో ఐపీఎల్ 2025ను మరింత రసవత్తరంగా మార్చనున్నాయి.