Israel–Hezbollah: ఇజ్రాయెల్‌ వర్సెస్‌ హిజ్బుల్లా.. అంతం కాదిది ఆరంభం..! నస్రల్లా ఖతంతో పశ్చిమాసియాలో అల్లకల్లోలం..

1 hour ago 1

రోజుకో హిజ్బుల్‌ కమాండర్‌ని లేపేస్తూ వచ్చిన ఇజ్రాయెల్‌….ఈసారి హిజ్బుల్లాను కోలుకోలేని దెబ్బ కొట్టింది. శుక్రవారం నాడు లెబనాన్‌ రాజధాని బీరుట్‌ శివార్లలోని దాహియా ప్రాంతంలో ఉన్న హిజ్బుల్లా ప్రధాన స్థావరానికి…ఆ టెర్రరిస్టు సంస్థ చీఫ్‌ హసన్‌ నస్రల్లా వచ్చాడనే పక్కా సమాచారంతో బాంబుల వర్షం కురిపించింది ఇజ్రాయెల్‌. ఈ దాడిలో నస్రల్లాతో పాటు పలువురు ఉగ్రవాదులు మరణించారు. నస్రల్లా లాంటి టెర్రరిస్ట్‌ ఇక ప్రపంచాన్ని భయపెట్టలేడంటూ ఇజ్రాయెల్‌ సైన్యం సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టింది. ఈ ఘటన తరువాత ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు తన అమెరికా పర్యటనను రద్దు చేసుకొని వెంటనే స్వదేశానికి తరలివచ్చారు.

పక్కా స్కెచ్‌తో నస్రల్లాని మట్టు పెట్టింది ఇజ్రాయెల్‌. F-35 ఫైటర్‌ జెట్లతో విరుచుకుపడి బీరుట్‌లో బాంబుల వర్షం కురిపించింది. హిజ్బుల్లా ప్రధాన స్థావరం అండర్‌గ్రౌండ్‌లో నక్కి ఉన్న నస్రల్లాను హతమార్చేందుకు జీబీయూ 28 బంకర్‌ బస్టర్‌ బాంబులను ప్రయోగించింది. ఆపరేషన్‌ న్యూ ఆర్డర్‌ పేరుతో హిజ్బుల్లాపై ప్రళయ భీకరంగా విరుచుకుపడింది. ఈ దాడిలో 64 ఏళ్ల నస్రల్లా మరణించినట్లు ఒక ప్రకటనలో ఇజ్రాయెల్‌ వెల్లడించింది. అంతేకాకుండా.. హిజ్బుల్లా టార్గెట్ బాంబులతో విరుచుకుపడుతోంది..

భవనాల కింద బంకర్లలోనే కాపురం

నస్రల్లా సాధారణంగా బయట కనిపించరు. వీడియోలు, టీవీల ద్వారానే సందేశమిస్తారు. దాదాపు 32 ఏళ్లుగా హిజ్బుల్లా సారథ్య బాధ్యతల్లో ఉండి దాన్ని…పెద్ద సాయుధ దళంగా తీర్చిదిద్దారు. బీరుట్‌లోని పెద్ద భవనాల కింద ఉన్న సెల్లార్లలో ఆయన ఉంటారన్న సమాచారం ఇజ్రాయెల్‌ దగ్గర ఉంది. బంకర్లను సాధారణ బాంబులు ఛేదించలేవు. దీంతో అప్పటికే తమ వద్ద వున్న బంకర్‌ బస్టర్‌ను రంగంలోకి దించింది. వీటిని కొంతకాలం క్రితమే అమెరికా నుంచి కొనుగోలుచేసింది. నిఘావర్గాల సమాచారంతో బీరుట్‌ అపార్ట్‌మెంట్లపై దాడి చేయడంతో నేలమాళిగల్లోకి బాంబుచొచ్చుకుపోవడంతో హెజ్‌బొల్లాకు తీవ్రనష్టం కలిగింది. ఆ దాడిలోనే నస్రల్లా కన్నుమూసినట్టు తెలుస్తోంది.

ప్రతీకారం తీర్చుకుంటామన్న హిజ్బుల్లా

ఇజ్రాయెల్‌ జరిపిన వైమానిక దాడుల్లో మా నాయకుడు నస్రల్లా మృతి చెందారు. నస్రల్లా మృతదేహాన్ని గుర్తించాం. ఆయనతోపాటు మరో టాప్ కమాండర్ అలీ కరాకి మృతదేహం కూడా లభించింది. దీనికి తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటాం. పాలస్తీనాకు మద్దతుగా నిలవడంతో పాటు శత్రువుపై యుద్ధం కొనసాగిస్తాం హిజ్బుల్లా భీకర ప్రతిజ్ఞ చేసింది. నస్రల్లా మృతితో లెబనాన్‌తో పాటు ఇరాన్‌లో కూడా ప్రజలు ఆగ్రహావేశాలతో రగిలిపోతున్నారు. వీధుల్లోకి వచ్చి ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు.

ఇరాన్‌లో హై అలర్ట్‌

ఇక నస్రల్లా మృతి తరువాత ఇరాన్‌లో హైఅలర్ట్‌ ప్రకటించారు. ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఖొమైనీని సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఇక ఇజ్రాయెల్‌ దాడిలో హతమైన నస్రల్లా…వెజిటబుల్స్‌ నుంచి వెపన్స్‌ దాకా ఎదిగాడు. అతగాడి బయోడేటా భయానకం. నస్రల్లా తండ్రి కూరగాయల వ్యాపారి. 1982లో ఇజ్రాయెల్‌ నిఘా సంస్థ షిన్బెట్‌పై నస్రల్లా చేయించిన దాడిలో 91మంది ఇజ్రాయెల్‌ అధికారులు చనిపోయారు. 1992లో హిజ్బుల్లా పగ్గాలు చేపట్టాడు నస్రల్లా. ఆర్డినరీ ఉగ్రవాద సంస్థ అయిన హిజ్బుల్లాను ఇంటర్నేషనల్‌ టెర్రరిస్టు సంస్థగా మార్చాడు. 2006 లెబనాన్‌లో ఇజ్రాయెల్‌ను మట్టి కరిపించాడు. అలాంటి నస్రల్లా మృతి…హిజ్బుల్లాకు చావుదెబ్బగా భావిస్తున్నారు.

80వ దశకంలో హిజ్బుల్లా పుట్టుక..

హిజ్బుల్లా…లెబనాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ. 1980ల్లో లెబనాన్‌ అంతర్యుద్ధంలో ఆవిర్భవించిన అమల్‌ ఉద్యమం నుంచి హిజ్బుల్లా అవతరించింది. అప్పటి నుంచి ఇరాన్‌ అండతో ఎదిగింది. ప్రపంచంలో ఏ ఉగ్ర సంస్థకూ లేని ఆయుధాలు, మానవ వనరులు దీనికి ఉన్నాయి. దాదాపు లక్ష రాకెట్లు, 50 వేల నుంచి లక్ష వరకు ఫైటర్లు ఉన్నారు. వీరి దాడులతో ఇజ్రాయెల్‌ పలు సమస్యలను ఎదుర్కొంది. గత ఏడాది అక్టోబర్‌లో ఇజ్రాయెల్‌పై హమాస్‌ దాడులు చేయడం, అనంతరం పాలస్తీనాకు సంఘీభావంగా ఇజ్రాయెల్‌పై హిజ్బుల్లా నిత్యం రాకెట్లను ప్రయోగించేది. కొన్ని రోజుల క్రితం హిజ్బుల్లా ప్రయోగించిన రాకెట్‌ ఇజ్రాయెల్‌లో 12 మంది పిల్లల ప్రాణాలు తీయడంతో ఇజ్రాయెల్‌ ప్రతీకారంతో రగిలిపోయి దాడులు చేస్తోంది. ఇప్పటికే హిజ్బుల్లా టాప్‌ కమాండర్లను ఇజ్రాయెల్‌ లేపేసింది.

ఇజ్రాయెల్‌ వర్సెస్‌ హమాస్‌, హిజ్బుల్లా, ఇరాన్‌..

దశాబ్దాలుగా ఆరని అరబ్‌- ఇజ్రాయెల్ మధ్య నిప్పుల కుంపటి….తాజా పరిణామాలతో మరింత రాజుకుంది. హిజ్బుల్లాపై దాడులతో ఇజ్రాయెల్‌ పైచేయి సాధించినట్లు కనిపించినా, దానివెనుక పొంచి ఉన్న సవాళ్లు అంతర్జాతీయ సమాజాన్ని కలవర పెడుతున్నాయి. ఇజ్రాయెల్ – పాలస్తీనా మధ్య మొదలైన ఈ యుద్ధం, ఇజ్రాయెల్‌ వర్సెస్‌ లెబనాన్‌గా మారింది. ఆ నిప్పురవ్వలు ఇప్పుడు ఇరాన్‌ను కూడా తాకాయి. ఆ నిప్పురవ్వలు ఇరాన్ నుంచి లెబనాన్ వరకు ఎందుకు మంటలు పుట్టిస్తున్నాయి? ఇది ఇప్పట్లో ఆగుతుందా? మరింతగా రాజుకుంటుందా? ఇజ్రాయెల్‌ తగ్గేదే లేదంటుండడంతో…ఇరాన్‌ కూడా ఈ వార్‌లోకి ప్రత్యక్షంగా ఎంటర్‌ అవుతుందని అంచనా వేస్తున్నారు. దీంతో పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మరిన్ని దేశాలకు విస్తరిస్తున్నాయని చెబుతున్నారు.

ఇజ్రాయెల్‌ దాడుల్లో నస్రల్లా ఖతం అవడంతో పశ్చిమాసియాలో పచ్చి గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు వచ్చాయి. అటు ఇజ్రాయెల్‌ దాడులు..ఇటు హిజ్బుల్లా ప్రతీకార దాడులతో పరిస్థితి ఎటు దారితీస్తుందో అనే ఆందోళన వ్యక్తం అవుతోంది. హిజ్బుల్లాతో ఎలాంటి చర్చలు ఉండవు అని, ఆ ఉగ్రవాద సంస్థను తుడిచి పెట్టేస్తామని ఇజ్రాయెల్‌ ప్రకటించించింది. ఈ పరిణామాలతో పశ్చిమాసియా అల్లకల్లోలంగా మారింది. ఇది చినికి చినికి గాలివానగా మారి మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా అనే భయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article