Israel – Iran War: ఇరాన్‌పై ప్రతీకార దాడులు.. ఇజ్రాయెల్ వ్యూహం మార్చిందా..?

2 hours ago 1

పశ్చిమాసియా యుద్ధంతో దద్దరిల్లిపోతోంది. ఇజ్రాయెల్‌పై హమాస్‌ దాడికి ఏడాది పూర్తయినా యుద్ధం మాత్రం ఆగడం లేదు. మ్యూజిక్‌ ఫెస్టివల్‌లో హమాస్‌ కాల్పులతో ఏడాది క్రితం మొదలైన యుద్ధం.. ఇరాన్‌ వరకు విస్తరించి వేలాది మందిని బలితీసుకుంటోంది. ఇజ్రాయెల్‌పై హమాస్‌ జరిపిన తొలిదాడిలో సుమారు 12 వందల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. 250 మందికిపైగా సామాన్య ప్రజలను హమాస్ ఉగ్రవాదులు బందీలుగా తీసుకెళ్లిపోయారు. ఆ బందీల్లో 100 మందిని చంపేయడంతో హమాస్‌పై ఇజ్రాయెల్ ఎదురుదాడికి దిగింది. హమాస్‌- ఇజ్రాయెల్ యుద్ధంలో సామాన్యులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఇప్పటివరకు సుమారు 42వేల మంది మృతి చెందినట్లు హమాస్‌ వెల్లడించింది. పశ్చిమాసియాలో ఏడాది క్రితం మొదలైన మారణ హోమం ఇంకా కొనసాగుతూనే ఉంది. రక్తం ఏరులై పారుతూనే ఉంది. యుద్ధోన్మాదానికి చిన్నారులు, మహిళలు, సామాన్య పౌరులు సమిధలవుతున్నారు.

యుద్ధం మొదట్లో హమాస్ నేతలే టార్గెట్‌గా ఇజ్రాయెల్ గాజాలో ఆపరేషన్ చేపట్టింది. టెక్నాలజీని వినియోగించి ఇజ్రాయెల్ రెచ్చిపోవడంతో వార్‌ మరింత ముదిరింది. వార్‌ సీన్‌లోకి హెజ్బొల్లా, హౌతీలు కూడా ఎంటర్‌ అయ్యారు. చివరకు ఇరాన్‌ కూడా రంగంలోకి దిగడంతో.. వార్‌ నెక్ట్స్‌ లెవెల్‌కు చేరుకుంది. ఫలితంగా.. పశ్చిమాసియా వార్‌ జోన్‌గా మారిపోయింది. దాడులు, ప్రతిదాడులతో లెబనాన్‌, ఇజ్రాయెల్‌ దద్దరిల్లుతున్నాయి. సోమవారం ఉదయం ఇజ్రాయెల్‌ ఉత్తర ప్రాంతంపై హెజ్‌బొల్లా క్షిపణులతో విరుచుకుపడింది. హైఫాలోని సైనిక స్థావరమే లక్ష్యంగా హిజ్బొల్లా దాడులు చేసింది. ఈ ఘటనలో 10 మంది గాయపడ్డట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఆదివారం లెబనాన్‌పై ఇజ్రాయెల్ ప్రతి దాడులు చేసింది. బీరుట్‌పై వరుసగా క్షిపణులు ప్రయోగించింది. కమతియేలో ఆరుగురు చనిపోయారు.

లెబనాన్‌లో ఓ వైపు మరణాలు.. మరోవైపు వ్యాధులు

ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో లెబనాన్‌లో ఇప్పటివరకు 2 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. లెబనాన్‌లో డయేరియా, హెపటైటిస్ ఏ తదితర ప్రాణాంతక వ్యాధులు ప్రబలే అవకాశముందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఆందోళన వ్యక్తంచేసింది. దేశంలో నాలుగు ప్రధాన ఆస్పత్రులు మూతపడగా.. మరో ఐదు ఆస్పత్రులు మాత్రమే ప్రస్తుతం వైద్య సేవలు అందిస్తున్నాయి. ప్రాణాంతక వ్యాధులు ప్రబలే అవకాశం ఉండటంతో లెబనాన్‌లో పరిస్థితి దారుణంగా మారే ప్రమాదముంది. సెంట్రల్ గాజాలో ఇజ్రాయెల్ జరిపిన తాజా దాడుల్లో ఐదుగురు చిన్నారులు, ఇద్దరు మహిళలు సహా 25 మంది పాలస్తీనియన్లు బలయ్యారు.

యుద్ధంలో ఇరాన్ ఎంట్రీ..

లెబనాన్‌ రాజధాని బీరుట్‌లో ఇటీవల ఇజ్రాయెల్‌ చేసిన దాడుల్లో హెజ్‌బొల్లా చీఫ్‌ హసన్‌ నస్రల్లా మరణించడం ప్రకంపనలు రేపింది. ఆయా పరిణామాలతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. నస్రల్లా మరణంతో ఇంతకాలం హమాస్‌, హెజ్‌బొల్లా సంస్థలకు బ్యాక్‌ బోన్‌గా ఉన్న ఇరాన్.. ఇజ్రాయెల్‌తో యుద్ధంలో డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చింది. ఇజ్రాయెల్‌పై ప్రత్యక్ష దాడులకు దిగింది. 180 బాలిస్టిక్ మిస్సైళ్లను ఇజ్రాయెల్‌ పైకి సంధించింది. అయితే.. ఇరాన్ దాడులను చాలా వరకు ఐరన్ డోమ్‌లతో అడ్డుకుంది ఇజ్రాయెల్. అయినా కొన్ని మిస్సైళ్లు ఇజ్రాయెల్ భూభాగంలో విధ్వంసం సృష్టించాయి.  ప్రజలు బాంబ్ షెల్టర్లలోకి పరుగులు తీశారు. ఇప్పటికీ ఆ భయం ప్రజలను వెంటాడుతోంది. దాంతో.. ఇరాన్‌పై ఇజ్రాయెల్ ప్రతీకారేచ్ఛతో రగిలిపోతోంది. తమ భూభాగంపై క్షిపణి దాడులతో ఇరాన్ పెద్ద తప్పు చేసిందని.. దీనికి ఇరాన్ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు హెచ్చరించారు. ఇరాన్‌పై ప్రతీకార దాడులు తథ్యమని స్పష్టంచేశారు.

Iran Attack Israel

Iran Attack Israel

ఇజ్రాయెల్ వ్యూహం మార్చిందా..?

ఇప్పటికే ఇరాన్‌పై ప్రతీకార దాడులకు ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఏ క్షణమైనా ఇరాన్‌పై దాడి జరగొచ్చని అంచనాలు ఉన్నాయి. ఇజ్రాయెల్‌పై హమాస్‌ దాడికి ఏడాది పూర్తవడంతో సంస్మరణ కార్యక్రమాలపై దృష్టి పెట్టింది ఇజ్రాయెల్ అధికార యంత్రాంగం. సంస్మరణ కార్యక్రమాలు ముగిశాక ఇరాన్‌పై ఏ క్షణంలోనైనా దాడులు చేయాలని ఇజ్రాయెల్‌ ప్లాన్‌ చేసినట్లు తెలుస్తోంది.

Israel Iran War

Israel Iran War

ఇరాన్ లక్ష్యంగా ఇజ్రాయెల్ ఇక ఏ క్షణంలోనైనా విరుచుకపడే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇరాన్ అణు స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు జరిపే అవకాశముందని ఊహాగానాలు వినిపించాయి.  అణు స్థావరాలతో పాటు ఆ దేశంలోని ఇంధన క్షేత్రాలపై కూడా ఇజ్రాయెల్ దాడులకు దిగే అవకాశముందని ప్రచారం జరిగింది.  అయితే ఇజ్రాయెల్ వ్యూహం మార్చినట్లు తెలుస్తోంది. అణు కేంద్రాలపై కాకుండా ఇరాన్‌కు చెందిన సైనిక స్థావరాలపై దాడుల చేసే యోచనలో ఇజ్రాయెల్ ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఇరాన్ ఇంటెలిజన్స్ లేదా పాలక పెద్దలను ఇజ్రాయెల్ టార్గెట్ చేసే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. దీనిపై ఇరాన్ కూడా ధీటుగా స్పందిస్తే.. తదుపరి చర్యల్లో భాగంగా అణు కేంద్రాలపై దాడులకు దిగే యోచనలో ఇజ్రాయెల్ ఉన్నట్లు తెలిపింది. ఇరాన్ అణు స్థావరాలపై ఇజ్రాయెల్ దాడి యోచనను తాము సమర్థించబోమని అమెరికా ఇప్పటికే స్పష్టంచేసింది. అయితే మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం.. ఇజ్రాయెల్ ముందుగా ఇరాన్‌లోని అణు కేంద్రాలపై దాడి చేయాలంటూ పిలుపునిచ్చారు.

ఇజ్రాయెల్‌కు ఇరాన్ వార్నింగ్..

ఇరాన్‌పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు చేసేందుకు రంగం సిద్ధమయ్యిందన్న కథనాల నేపథ్యంలో.. ఇజ్రాయెల్‌కు ఇరాన్ హెచ్చరికలు జారీ చేసింది. ఇస్లామిక్ రిపబ్లిక్‌పై ఇజ్రాయెల్ ఇక ఎలాంటి దాడులు చేసినా.. తాము ప్రతీకార దాడులకు పాల్పడుతామని వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్ మౌలిక సదుపాయాలపై ఎలాంటి దాడి జరిగినా.. దానికి ఇజ్రాయెల్ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందంటూ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరక్చీ హెచ్చరించారు. ఇజ్రాయెల్ తమ అణు స్థావరాలపై దాడులు చేసే అవకాశముందన్న కథనాలపై స్పందించిన ఇరాన్.. తమ దేశం ఉనికి ప్రమాదంలో పడితే.. అవసరమైతే తాము అణ్వాయుధాలు ప్రయోగించేందుకు వెనకాడబోమని స్పష్టంచేసింది.

మరిన్ని ప్రీమియం కథనాల కోసం.. TV9 News యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article