Janaka Aithe Ganaka Review: జనక అయితే గనక రివ్యూ.. సుహాస్ సినిమా ఎలా ఉందంటే..

2 hours ago 1

మూవీ రివ్యూ: జనక అయితే గనక నటీనటులు: సుహాస్, సంగీర్తన విపిన్, గోకరాజు రమణ, వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్, మురళీ శర్మ తదితరులు సంగీతం: విజయ్ బుల్గానిన్ సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్ ఎడిటర్: పవన్ కళ్యాణ్ కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: సందీప్ రెడ్డి బండ్ల నిర్మాతలు: హర్షిత్ రెడ్డి, హన్షిత సమర్పణ: దిల్ రాజు

ఎప్పటికప్పుడు కొత్త కొత్త కాన్సెప్టులతో వస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంటున్న నటుడు సుహాస్. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, ప్రసన్న వదనం లాంటి సినిమాలతో పర్లేదనిపించాడు ఈ హీరో. తాజాగా దిల్ రాజు ప్రొడక్షన్స్‌లో జనక అయితే గనక అంటూ వచ్చాడు. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం..

కథ:

ప్ర‌సాద్ (సుహాస్‌) సగటు మ‌ధ్య త‌ర‌గ‌తి యువ‌కుడు. పెళ్లై రెండేళ్లైనా పిల్లలు మాత్రం వద్దనుకుంటాడు. తనకు పిల్లలు అంటూ పుడితే వాళ్లకు బెస్ట్ లైఫ్ ఇవ్వాలనుకుంటాడు.. అది ఇవ్వలేడు కాబట్టి పిల్లలే వద్దనుకుంటాడు. ఓ వాషింగ్ మిషన్ కంపెనీలో చిన్న ఉద్యోగం చేస్తూ లైఫ్ లీడ్ చేస్తుంటాడు. భర్తను ప్రతీ విషయంలో ఫాలో అయ్యే భార్య (సంగీర్త‌న‌), ఎప్పుడూ కొడుకు చేతిలో తిట్లు తినే సరదా తండ్రి (గోప‌రాజు ర‌మ‌ణ‌), స‌ర్దుకుపోయే త‌ల్లి, ఇంట్లో బామ్మలతో హాయిగా జీవితం గడుపుతుంటాడు. అంతా బాగానే ఉంది అనుకుంటున్న సమయంలో అనుకోకుండా ప్రసాద్ భార్య ప్రగ్నెంట్ అవుతుంది. తాను కండోమ్ వాడిన తర్వాత కూడా భార్య గర్భవతి కావడంతో షాక్ అవుతాడు ప్రసాద్. దాంతో తన స్నేహితుడు (వెన్నెల కిషోర్‌) లాయ‌ర్ కావ‌టంతో.. ఆ సాయంతో కన్స్యూమర్ కోర్టులో కండోమ్ కంపెనీపై కేసు వేస్తాడు ప్రభాస్. తనకు కోటి రూపాయలు ఇవ్వాల్సిందే అంటాడు. ఈ క్రమంలోనే ప్రసాద్ వేసిన ప్రశ్నలకు కంపెనీ తరఫు లాయర్ (ప్ర‌భాస్ శ్రీను) సమాధానం చెప్పలేకపోతాడు. దాంతో దేశంలోనే ప్ర‌ముఖ లాయ‌ర్ (ముర‌ళీ శ‌ర్మ‌)ని కండోమ్ కంపెనీ రంగంలోకి దించుతుంది. అప్పుడేమైంది.. ప్రసాద్ కోరుకున్నట్లు కండోమ్ కంపెనీ ఆయనకు కోటి రూపాయలు ఇచ్చిందా లేదా అనేది అసలు కథ..

కథనం:

మెసేజ్ విత్ ఎంటర్టైన్మెంట్ చాలా రేర్ కాంబినేషన్. ఇది ఉంటే అది ఉండదు.. అది ఉంటే ఇది ఉండదు. జనక అయితే గనకలో ఈ రెండూ కుదిరాయి. దర్శకుడు తీసుకున్న పాయింట్ రిస్కీగా ఉన్నా.. ఎక్కడ లైన్ క్రాస్ చేయలేదు. ట్రైలర్ లో చూపించినట్టు కండోమ్ కంపెనీ మీద కేసు అయినా కూడా.. సినిమాలో అడ్రస్ చేసిన ఇష్యూస్ మాత్రం వేరే ఉన్నాయి. సమాజంలో జరిగే చాలా విషయాలపై డైరెక్టుగా సెటైర్ వేసాడు దర్శకుడు సందీప్ రెడ్డి బండ్ల. ఈ జనరేషన్లో చాలామంది పిల్లలు అంటే ఎందుకు భయపడుతున్నారనేది.. జనక అయితే గనకలో చాలా బాగా డిస్కస్ చేశారు. పుట్టే పిల్లల హాస్పిటల్ ఖర్చుల నుంచి డైపర్స్, స్కూల్, కాలేజ్, ఆడుకునే బొమ్మల వరకు.. పేరెంట్స్ ప్రేమను ఎలా బిజినెస్ చేస్తున్నారనేది ఆసక్తికరంగా చూపించారు. ఫస్టాఫ్ అంతా ఫ్యామిలీ సీన్స్, వెన్నెల కిషోర్ కామెడీతో వెళ్ళిపోతుంది. అసలు కోర్టు డ్రామా అంతా సెకండ్ హాఫ్ లోనే ఉంటుంది. ఈ సీన్స్ అన్ని ఇంట్రెస్టింగ్ గా రాసుకున్నాడు దర్శకుడు సందీప్ రెడ్డి బండ్ల. సొసైటీలో పిల్లల పేరు మీద జరిగే ప్రతి బిజినెస్ సినిమాలో చూపించే ప్రయత్నం చేశాడు.. చాలా సీన్స్ కనెక్ట్ అవుతాయి కూడా. రియల్ లైఫ్‌ లో మనకు ఎదురయ్యే సంఘటనలు సినిమాలోనూ ఉంటాయి. వాటిని చూసి నవ్వుకుంటాం.. అలాగే ఆలోచనలో కూడా పడతాం. ముఖ్యంగా సెకండాఫ్‌లో మురళీ శర్మ వచ్చిన తర్వాత సినిమా మరింత ఆసక్తికరంగా మారుతుంది. మధ్య తరగతి వాళ్ల ఆలోచనా విధానం ఎలా ఉంటుంది.. వాళ్ల మనస్తత్వాలు ఎలా ఉంటాయి.. ఇంట్లో ఆడవాళ్లు ఎంత సున్నితంగా ఉంటారు అనే విషయాలపై మంచి సీన్స్ రాసుకున్నాడు దర్శకుడు. మరీ ముఖ్యంగా నీ భార్య నీ వల్లే గర్భవతి అయింది అనడగానికి రుజువేంటి.. అసలు ఆ రోజు కండోమ్ వాడారా లేదా అని మేమెందుకు నమ్మాలి.. ఇలాంటి ప్రశ్నలు వచ్చినపుడు దర్శకుడు కథను డీల్ చేసిన విధానం చాలా బాగుంది. ఎక్క‌డా వ‌ల్గారిటీకి చోటు లేకుండా.. సున్నిత‌మైన విష‌యాన్ని ప్ర‌శ్నించేలా సినిమాను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడిని అభినందించాల్సిందే.

నటీనటులు:

సుహాస్ మరోసారి తన న్యాచురల్ యాక్టింగ్ తో ఆకట్టుకున్నాడు. కామెడీ, ఎమోషనల్ రెండింట్లోనూ బాగా చేసాడు సుహాస్. కొత్తమ్మాయి సంగీర్తన విపిన్ చాలా బాగా నటించింది. మంచి పర్ఫార్మెన్స్‌తో మెప్పించింది. వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్ ట్రాక్ నవ్విస్తుంది.. ముఖ్యంగా క్లైమాక్స్ కడుపులు చెక్కలే. చివర్లో వెన్నెల కిషోర్ కోర్టులో రెచ్చిపోయే సీన్ అయితే హైలైట్. గోకరాజు రమణ నటన న్యాచురల్‌గా ఉంది. అలాగే ప్రభాస్ శ్రీను కూడా ఉన్నంత సేపు నవ్వించాడు. మిగిలిన వాళ్లంతా ఓకే.

టెక్నికల్ టీం:

జనక అయితే గనక సినిమాకు సంగీతం కీలకం. విజయ్ బుల్గానిన్ ఈ విషయంలో సక్సెస్ అయ్యాడు. ఆయన అందించిన పాటలతో పాటు రీ రికార్డింగ్ కూడా బాగుంది. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగా కుదిరింది. ఎడిటింగ్ విషయంలో పవన్ కళ్యాణ్ పనితీరు బాగుంది. దర్శకుడు సందీప్ రెడ్డి బండ్ల గురించి చెప్పాలి.. తొలి సినిమాలోనే ఇలాంటి పాయింట్ తీసుకుని డిస్కస్ చేయడం అనేది చిన్న విషయం కాదు. మరోవైపు నిర్మాత దిల్ రాజు కాస్త రిస్కీ లైన్ తీసుకున్నా ఎక్కడా బోర్డర్ దాటలేదు. దర్శకుడు సందీప్ రెడ్డి బండ్ల రైటింగ్‌లో ఎక్కువ మార్కులు కొట్టేశాడు. చాలా సున్నితమైన విషయాలను ఎక్కడా అసభ్యతకు చోటు లేకుండా తెరకెక్కించాడు ఈ దర్శకుడు.

పంచ్ లైన్:

ఓవరాల్‌గా జనక అయితే గనక.. నవ్విస్తూ ఆలోచనలో పడేస్తాడు..

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article