యాపిల్ సైడర్ వెనిగర్ ఇంటి పనులు, ఆరోగ్య సంరక్షణ, పరిశుభ్రతకు అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. చేతుల నుంచి దుర్వాసన పోగొట్టడం, కళ్లద్దాలపై మరకలు తొలగించడం, పెరటి తోటలో కలుపును నాశనం చేయడం, పాల బాటిళ్లను శుభ్రం చేయడానికి ఉపయోగిస్తారు. ఇలాంటి అద్భుత ప్రయోజనాల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వంట పాత్రల మరకలు
ఆహార పదార్థాలు మాడిపోయినప్పుడు వంట పాత్రలు నల్లబడతాయి. అలాంటి సందర్భంలో కప్పు యాపిల్ వెనిగర్, కప్పు నీటిని పాత్రలో పోసి వేడిచేస్తే మాడింది అంతా కూడా సులభంగా పోతుంది. ఆపై రెండు స్పూన్ల బేకింగ్ సోడా కలిపి కాసేపు ఉంచి ఆ తర్వాత నీటితో శుభ్రం చేస్తే వంట పాత్రలు కొత్తగా మారిపోతాయి.
కళ్లద్దాలపై మరకలు
కళ్లద్దాలు రోజూ వాడటం వల్ల దూళి, మరకలు ఏర్పడతాయి. కొన్ని మరకలు కాస్త గట్టిగా ఉండి తేలిగ్గా పోవు. అలాంటి సమయంలో తక్కువ పరిమాణంలో యాపిల్ వెనిగర్‌ను మెత్తటి క్లాత్ లో తడి చేసి అద్దాలపై తుడిచినట్లయితే అవి మళ్లీ కొత్తవలే మెరిసిపోతాయి.
చేతుల దుర్వాసన
చేపలు, మాంసం లేదా ఉల్లిపాయలను చేతులతో శుభ్రం చేసిన తర్వాత వాటి వాసన త్వరగా పోదు. కేవలం సబ్బుతో చేతులు కడిగినా కొన్నిసార్లు అది ఉండిపోతుంది. అయితే కొద్దిగా యాపిల్ సైడర్ వెనిగర్‌ను నీటిలో కలిపి చేతులు కడిగితే ఆ దుర్వాసన పూర్తిగా పోతుంది.
పెరటి తోట కలుపు
తోటలో ఎదిగే అవాంఛిత కలుపు మొక్కలను తొలగించడానికి యాపిల్ వెనిగర్ చాలా ఉపయోగపడుతుంది. ముప్పావు కప్పు వెనిగర్‌లో పావు కప్పు నీరు కలిపి స్ప్రే బాటిల్‌లో నింపాలి. ఈ మిశ్రమాన్ని కలుపు మొక్కలపై స్ప్రే చేస్తే అవి కాస్త నెమ్మదిగా ఎండిపోతాయి.
పాల బాటిళ్ల శుభ్రం
చిన్నారుల పాల బాటిళ్లు పూర్తిగా శుభ్రం చేయకపోతే బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంది. వేడినీటిలో కొద్దిగా యాపిల్ వెనిగర్ కలిపి ఆ నీటితో పాల బాటిళ్లను శుభ్రం చేస్తే అవి శుభ్రంగా ఉండటమే కాకుండా హానికరమైన సూక్ష్మజీవులు పెరగకుండా ఉంటాయి.
కొవ్వొత్తుల మరకలు
కొవ్వొత్తుల కారణంగా ఫ్లోర్, గోడలపై లేదా చెక్కలపై ఏర్పడిన మరకలను యాపిల్ వెనిగర్ ద్వారా సులభంగా తొలగించవచ్చు. సమానమైన మోతాదులో వెనిగర్, నీటిని కలిపి ఆ మిశ్రమాన్ని క్లాత్ తో రుద్దితే మరకలు పోతాయి.
స్టిక్కర్లు, లేబుళ్లను తొలగించండిలా..!
కొత్త వస్తువులపై అతికించిన స్టిక్కర్లు, లేబుళ్లను తీసేయడానికి యాపిల్ వెనిగర్ ఉపయోగించవచ్చు. కొద్దిగా వెనిగర్‌ను స్టిక్కర్‌పై స్ప్రే చేసి కొంత సేపటికి చేత్తో రుద్దితే అవి సులభంగా తొలగిపోతాయి.